స్వీయ నిర్బంధమే కరోనాకు మందు

Perni Nani Comments On Coronavirus Prevention - Sakshi

వలంటీర్లకు ట్యాబ్‌లు.. ఎప్పటికప్పుడు వివరాల నమోదు

రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉధృతికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) స్పష్టం చేశారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం ముందు చూపుతో రాష్ట్రంలో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థ కరోనాను కట్టడి చేయడంలో, సమాచార సేకరణలో ప్రధాన భూమిక పోషిస్తోందన్నారు. వలంటీర్లకు ట్యాబ్‌లు అందించి అందులో ఒక యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసి ఎప్పటికప్పుడు అందులో నమోదు చేసి.. ట్రాక్‌ చేస్తామన్నారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిని, వారి కుటుంబాన్ని అవమానించడం, అనుమానించడం సరైన విధానం కాదన్నారు. మంత్రి నాని ఇంకా ఏం చెప్పారంటే.. 

- నిత్యావసర వస్తువుల ధరలు, మెడిసిన్‌ ధరలు పెంచి విక్రయిస్తే కఠిన చర్యలు.
- ఇప్పటి వరకు రాష్ట్రంలో లక్ష ఎన్‌–95 మాస్కులు, 25 వేల పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌తో పాటు 5 వేల లీటర్ల శానిటైజర్‌ బాటిల్స్‌ అందుబాటులో ఉన్నాయి. 
- 50 వేల నుండి లక్ష వరకు కొత్త మాస్క్‌లకు ఆర్డర్‌ ఇచ్చాం. 150 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయి. మరో 200 వెంటిలేటర్లు త్వరలోనే అందుబాటులోకి వస్తాయి.
- సోషల్‌ మీడియాలో వచ్చే అవాస్తవ వార్తలను షేర్‌ చేస్తే తీవ్రంగా పరిగణిస్తాం. వైరస్‌ నియంత్రణకు  అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర, జిల్లా అధికారులకు అధికారం.
- కరోనాను కట్టడి చేయడానికి రాష్ట్ర స్థాయిలో వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఆధ్వర్యంలో ఐదుగురు ఐఏఎస్‌లతో బృందం ఏర్పాటు. అన్ని మార్గాల ద్వారా ప్రజలకు అవగాహన.   
- కరోనా కట్టడిలో భాగంగా గుంటూరు మిర్చి యార్డు మూసివేత. ప్రజలు గుమిగూడకుండా జనాభాను బట్టి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అదనంగా రైతు బజార్ల ఏర్పాటు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top