పోలీస్‌ బాస్‌... మళ్లీ రేస్‌!

Permanent DGP selection process - Sakshi

మొదటికొచ్చిన శాశ్వత డీజీపీ ఎంపిక

ఐపీఎస్‌ ప్యానల్‌లో లోపాలను కేంద్రం బయటపెట్టడంతో మళ్లీ కసరత్తు

సాంబశివరావు, గౌతమ్‌ సవాంగ్‌ వైపు సీఎం మొగ్గు

సాక్షి, అమరావతి: నూతన డీజీపీ ఎంపికపై తానొకటి తలిస్తే కేంద్రం మరోలా నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఏడుగురు సీనియర్‌ ఐపీఎస్‌ల పేర్లతో యూపీఎస్సీకి పంపిన ప్యానల్‌లో లోపాలు ఉన్నాయంటూ కేంద్రం తిప్పి పంపిన సంగతి తెలిసిందే. దీంతో శాశ్వత డీజీపీ ఎంపిక ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. పోలీస్‌ బాస్‌ పోస్టు కోసం సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల్లో మళ్లీ రేస్‌ మొదలైంది.

ప్రస్తుత ఇన్‌చార్జి డీజీపీ నండూరి సాంబశివరావును మరో రెండేళ్లు కొనసాగించాలని సీఎం భావిస్తున్నట్టు ప్రచారం జరిగింది. అయితే, సాంబశివరావుకు చెక్‌ పెట్టేందుకు కేంద్రం స్థాయిలో చక్రం తిప్పింది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఐపీఎస్‌ ప్యానల్‌ను 6 నెలల ముందుగానే యూపీఎస్సీకి పంపాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆలస్యంగా స్పందించింది. గత నెలలో కేంద్రానికి పంపిన ఏడుగురి పేర్ల జాబితాలో ఉన్న సాంబశివరావు వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్నారు.

సీనియారిటీ ప్యానల్‌లో ఉన్న మాలకొండయ్య, రమణమూర్తిల పదవీ కాలం ఏడాదిలోపే ఉంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి ఏడాదిలోపే పదవి విరమణ చేయనున్న ఆ ముగ్గురిని మినహాయించి కొత్త జాబితాను పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. పాత జాబితాలో ఉన్న ముగ్గురిని తొలగిస్తే కౌముది, ఆర్పీ ఠాకూర్, గౌతమ్‌ సవాంగ్, వినయ్‌ రంజన్‌రే మిగిలారు. ఈ నేపథ్యంలో కేంద్రం తిప్పి పంపిన జాబితాలో అర్హత కలిగిన నలుగురికి తోడు మరో ముగ్గురు ఏడీజీలకు డీజీపీలుగా పదోన్నతులు కల్పించి ఆ ఏడుగురి పేర్లను కేంద్రానికి పంపించాలా? లేక పాత జాబితానే మళ్లీ పంపాలా? అనేదానిపై  ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.

జేవీ రాముడు అలా.. సాంబశివరావు ఇలా..
గతంలో కేవలం రెండు నెలల పదవీ కాలం మిగిలిన ఉన్న జేవీ రాముడికి మరో రెండేళ్లపాటు పదవీ కాలం పొడిగిస్తూ సీనియర్‌ ఐపీఎస్‌ల జాబితాను ప్రభుత్వం యూపీఎస్సీకి పంపింది.

అప్పట్లో లోపాలు ఉన్నప్పటికీ జేవీ రాముడు విషయంలో మౌనం వహించి ఆమోదించిన కేంద్ర హోంశాఖ ఇప్పుడు సాంబశివరావు విషయంలో తప్పుపట్టడం గమనార్హం. సాంబశివరావునే డీజీపీగా కొనసాగించాలని సీఎం గట్టి నిర్ణయం తీసుకుంటే పాత జాబితానే మళ్లీ పంపి ఖరారు చేయించుకుంటారని, లేకుంటే గౌతమ్‌ సవాంగ్‌ వైపు మొగ్గు చూపుతారని పరిశీలకులు అంటున్నారు. కాగా, ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్‌ను డీజీపీగా తెచ్చేందుకు మంత్రి నారా లోకేశ్‌ గట్టిగా పట్టుబడుతున్నట్టు తెలిసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top