గాలి దుమారం... పిడుగుల బీభత్సం | peoples are afraid with sudden rain | Sakshi
Sakshi News home page

గాలి దుమారం... పిడుగుల బీభత్సం

May 23 2014 2:50 AM | Updated on Sep 5 2018 1:45 PM

గాలి దుమారం... పిడుగుల బీభత్సం - Sakshi

గాలి దుమారం... పిడుగుల బీభత్సం

జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో గురువారం సాయంత్రం పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీచాయి. గాలుల కారణంగా రోడ్డుపై దుమ్మూధూళి రేగి కళ్లలో పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

ఈదురు గాలుల బీభత్సానికి జిల్లా వాసులు వణికిపోయారు. జిల్లా వ్యాప్తంగా గురువారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు పిడుగులు తోడయ్యాయి. దీంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఉదయం భీకరంగా సూర్యుడు నిప్పులు కురిపించగా, సాయంత్రం ఒక్కసారిగా గాలిదుమారం లేచింది. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఈ హఠాత్‌పరిణామంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు.
 
 విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో గురువారం సాయంత్రం పె ద్ద ఎత్తున ఈదురుగాలులు వీచాయి. గాలుల కారణంగా రోడ్డుపై దుమ్మూధూళి రేగి కళ్లలో పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు జల్లుల నుంచి భారీ వర్షం పడిం ది.  చోట్ల చెట్లు నేలకూలగా సుమారు 100 విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయాయి.

దీంతో పలు గ్రామాల్లో అంధకారం అలముకుంది. మామిడి పంటకు అపార నష్టం కలిగి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం నెలకొంది. బొబ్బిలి మండలం రాముడువలసలో పొలంపనులకు వెళ్లిన బొంతలకోటి పోలమ్మ, మునగపాటి నారాయణమ్మలపై పిడుగు పడడంతో వారు మృత్యువాత పడ్డారు. ఎల్.కోట మండల కేంద్రంలో కె.భాస్కరరావు అనే వ్యక్తిపై గోడ కూలి అక్కడికక్కడే మృతి చెందాడు.
 
 తెర్లాం మండలం నందబలగలో  కండి వెంకటరమణకు చెందిన ఓ ఎద్దుపై పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందింది.  నెల్లిమర్ల, చీపురుపల్లి, విజయనగరం, బొబ్బిలి, బాడంగి, తెర్లాం, గజపతినగరం, గుర్ల తదితర మండలాల్లో ఈదురుగాలులకు అనేక చెట్లు నేలకూలాయి. మొరకముడిదాం మండలంలో మామిడి పంట, అరటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.  గుర్ల, బాడంగి, తెర్లాం, బొబ్బిలి, ఎల్.కోట మండలాల్లో విద్యుత్ స్తంభాలు నేలకూలిపోయాయి. బాడంగి మండలం వాడాడలో ఓ ఇంటిపై చెట్టు కూలిపోవడంతో గొట్టాపు తమ్మినాయుడు ఆయన భార్య నారాయణమ్మ, జగ్గునాయుడులు గాయపడ్డారు.
 
దీంతో వారికి చికిత్స అందించారు. గజపతినగరం రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్‌కు అడ్డంగా చెట్టు కూలిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. విజయనగరం నుంచి బొబ్బిలివైపు వెళ్తున్న బొకారో ఎక్స్‌ప్రెస్‌ను సుమారు గంట సేపు నిలిపివేశారు. అనంతరం చెట్టును తొలగించాక రైళ్ల రాకపోకలను కొనసాగించారు. అదేవిధంగా నెల్లిమర్ల మండలం గరికిపేటలో ప్రాథమిక పాఠశాల ప్రహరీ కూలిపోయింది,. విజయనగరం నుంచి చీపురుపల్లి వెళ్లే రహదారిలోనూ, పార్వతీపురం వెళ్లే రహదారిలోనూ చాలా చెట్లు కూలిపోయాయి.
 
పట్టణంలో కూలిన హోర్డింగ్‌లు, చెట్లు..
జిల్లా కేంద్రమైన విజయనగరం పట్టణంలో పలు చోట్ల ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు, చెట్లు నేలకూలాయి. ట్యాంక్‌బండ్, ఇందిరా నగర్ తదితర ప్రాంతాల్లో చెట్లు కూలాయి. వాహనచోదకులకు  ఇబ్బందులు ఎదురయ్యాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement