పెంచుట ‘ముంచుట’కేనా? | pension problems at rajamandry | Sakshi
Sakshi News home page

పెంచుట ‘ముంచుట’కేనా?

Jul 18 2014 12:01 AM | Updated on Jul 6 2019 4:04 PM

ఈ పండుటాకుల్లో ఏ సాకుతో ఎవరికి షాకో! - Sakshi

ఈ పండుటాకుల్లో ఏ సాకుతో ఎవరికి షాకో!

రైతు, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని ఊరించిన తెలుగుదేశం అధికారం...

* పింఛన్‌దారుల్లో కలవరం రేపుతున్న ‘పరిశీలన’
* ఆధార్ వివరాలతో సరిపోలుస్తున్న అధికారులు
* ఎక్కడ తేడా వచ్చినా చిరు సాయానికి పెనుగండమే!
* జాబితాను గణనీయంగా ‘కుదించాలన్న’ సర్కారు!
 సాక్షి, రాజమండ్రి : రైతు, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని ఊరించిన తెలుగుదేశం అధికారంలోకి రాగానే ‘బాబు గారి మాటలకు భాష్యాలే వేరులే’ అన్నట్టు వ్యవహరిస్తోంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులు, మహిళలను ఉసూరుమనిపిస్తోంది. ముందు అన్నట్టు.. మాఫీ ఫైలుపై తొలి సంతకం పెట్టినా, మధ్యలో కమిటీ ఒకటి వేసి.. ఎటూ తేల్చకుండా నానుస్తోంది. ఇప్పుడు పింఛన్ల పెంపు సంగతీ ఆ బాపతేనన్న అనుమానం కలిగేలా ‘పరిశీలన’కు పూనుకుంది. అధికారంలోకి వస్తే వికలాంగులకు వైకల్యాన్ని బట్టి రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు; వృద్ధులకు, వితంతువులకు, ఇతరులకు రూ.వెయ్యికి పెంచుతానన్న చంద్రబాబు సంబంధిత ఫైలుపైనా సంతకం పెట్టారు.

అయితే.. పెంచిన పింఛన్లను అందించేది అక్టోబర్ నుంచేనని ప్రకటించారు. ‘పోనీలే.. మూడునాలుగునెలలు ఆలస్యమేతేనేం.. పెంచుతున్నారు అదే పదివేలు’ అన్న లబ్ధిదారుల సంతోషంపై నీలినీడలు కమ్ముకునేలా సర్కారు.. మండలానికో ప్రత్యేక కో ఆర్డినేటర్‌ను నియమించి, పింఛన్ పంపిణీదారుల పరిశీలనకు శ్రీకారం చుట్టింది. ఆధార్ ఆధారంగా లబ్ధిదారుల గుర్తింపు, ఇతర ధృవీకరణ పత్రాల పరిశీలన, వేలిముద్రల సేకరణ.. ఇలా శతవిధాల శల్య పరీక్షలు ప్రారంభించారు. ఎక్కడ ఏమాత్రం తేడా వచ్చినా వారిని లబ్ధిదారుల జాబితా లోంచి తొలగించాలని ఉత్తర్వులు జారీ కాగా జిల్లావ్యాప్తంగా 58 మంది కో ఆర్డినేటర్లు వారం రోజులుగా ఇదే పనిలో నిమగ్నమై ఉన్నట్టు సమాచారం.
 
పరిశీలన  ఇలా...
జిల్లాలో పింఛన్ లబ్ధిదారుల పరిశీలనకు మండలాల వారీ ప్రత్యేక సిబ్బందిని నియమించారు. లబ్ధిదారులను మండల పరిషత్ కార్యాలయాలకు రప్పించి వారి ఆధార్ కార్డు సమాచారాన్ని పరిశీలిస్తున్నారు. బయో మెట్రిక్ విధానంలో వేలిముద్రలు సరిపోలుస్తున్నారు. ఈ ప్రక్రియలో ఏ విషయంలో తేడా వచ్చినా వారిని పింఛన్లకు అనర్హులుగా తేల్చనున్నారని, అలాగే పరిశీలనకు హాజరు కాని వారి పేర్లూ కొత్తజాబితాలో ఉండవని అంటున్నారు. కొన్ని నెలలుగా పింఛను తీసుకోని వారి పేర్లూ తొలగించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న లబ్ధిదారుల జాబితా లోంచి రకరకాల సాకులతో గణనీయమైన సంఖ్యలో లబ్ధిదారులను జల్లెడ పట్టే బాధ్యతను ప్రభుత్వం జిల్లా అధికారులపై మోపినట్టు తెలుస్తోంది. పింఛన్‌లు చెల్లిస్తున్న పోస్టల్ అధికారులు, ఏపీ ఆన్‌లైన్ సంస్థ  కో ఆర్డినేటర్ల సహకారంతోనే ఈ పరిశీలన ప్రక్రియ కొనసాగిస్తున్నారు.
 
రూ.48 కోట్లకు పెరుగుతుందనే..
జిల్లా మొత్తమ్మీద సుమారు 4.5 లక్షల మంది పింఛను దారులు ఉన్నారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారి సంఖ్య 3.67 లక్షలు. లబ్ధిదారుల్లో సుమారు 50 వేల మంది వికలాంగులు కాగా మిగిలిన వారు వృద్ధులు, వితంతువులు, ఇతరులు. వీరందరికీ పాత విధానం ద్వారా రూ.12 కోట్ల చెల్లింపులు నెలవారీగా జరుగుతున్నాయి.  టీడీపీ అధినేత ఎన్నికల వాగ్దానం ప్రకారం పెంపుదలను ఇప్పుడున్న లబ్దిదారులందరికీ వర్తింపజేస్తే జిల్లాలో సుమారు రూ.48 కోట్ల వరకూ చెల్లించాల్సి వస్తుంది. ఈ కారణం వల్లే సాధ్యమైనంత వరకూ లబ్దిదారుల సంఖ్యను కుదించేందుకు పూనుకున్నట్టు తెలుస్తోంది.

పలువురు లబ్ధిదారులు అనారోగ్యం, ఇతర కారణాలతో పింఛన్లు తీసుకోలేక పోతున్నారు. సుమారు 10 నుంచి 15 శాతం లబ్ధిదారుల వేలి ముద్రలు బయోమెట్రిక్ పరికరాల్లోని సమాచారంతో సరిపోలడం లేదు. ఇలాంటి లబ్ధిదారుల్లో నేడు ఆందోళన వ్యక్తమవుతోంది. పింఛనుదారుల పరిశీలన కార్యక్రమం గ్రామస్థాయిలో ఇంకా ప్రచారం పొందకపోవడంతో చాలా మందికి సమాచారం తెలీదు. అనేక మంది వయోవృద్ధులు ఇళ్లు దాటి గ్రామాంతరాలకు వెళ్లలేని పరిస్థితి. అయినప్పటికీ మండల పరిషత్ కార్యాలయాలకు హాజరు కాని వారి పేర్లు కూడా లబ్ధిదారుల జాబితాలోంచి తొలగిపోనున్నాయి.
 
70 శాతం పరిశీలన పూర్తయింది..
ఇప్పుడు పింఛన్లు తీసుకుంటున్న వారంతా అర్హులేనా అనే కోణంతో వారి ఆన్‌లైన్ వివరాలను పరిశీలిస్తున్నామని ఏపీ ఆన్‌లైన్ జిల్లా కో ఆర్డినేటర్ దుర్గాప్రసాద్ ‘సాక్షి’కి చెప్పారు. ఆధార్ సీడింగ్ ద్వారా జరుగుతున్న ఈ ప్రక్రియ ఇప్పటికే 70 శాతం పూర్తయిందని, మిగిలిన 30 శాతం పూర్తయితే అర్హులైన వారి జాబితా పై స్పష్టత వస్తుందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement