45 ఏళ్లకే పింఛన్‌

Pension at the age of 45 says YS Jagan in Anantapur tour - Sakshi

అనంతపురం పర్యటనలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని పేదలకు అమలు 

పింఛన్‌ సొమ్మును రూ.వెయ్యి నుంచి రూ.2 వేలకు పెంచుతాం

మేము అధికారంలోకి రాగానే చేనేతలకు రూ.2 వేలు సిల్క్‌ రాయితీ..

నేతన్నల రుణాలు మాఫీ.. రూ.లక్ష వరకు వడ్డీ లేని రుణం ఇస్తాం

రాష్ట్రంలో పేదలకు 25 లక్షల పక్కా ఇళ్లు 

సాక్షిప్రతినిధి, అనంతపురం: ‘‘చేనేతలు, బడుగు, బలహీన వర్గాల వారు పనులకు వెళ్తేనే కడుపు నిండుతుంది.. ఆరోగ్యం బాగోలేక ఇంటిపట్టున ఉంటే బతకలేని పరిస్థితి.. కాయ కష్టం చేయడంతో 40–50 ఏళ్ల మధ్యే కీళ్ల నొప్పులు మొదలవుతాయి.. ఒక్క ఏడాది ఓపిక పడితే వచ్చేది మన ప్రభుత్వమే.. ఆ తర్వాత 45 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల(బడుగు, బలహీన వర్గాలు)లోని పేదలకు పింఛన్లు ఇస్తాం.. అదీ రూ.వెయ్యి కాకుండా రూ.2 వేలు ఇస్తాం’’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. తమ డిమాండ్ల సాధన కోసం అనంతపురం జిల్లా ధర్మవరం తహసీల్దార్‌ కార్యాలయం సమీపం లో రిలే దీక్షలు చేస్తున్న చేనేత కార్మికులను మంగళవారం జగన్‌ పరామర్శించి, దీక్షకు సంఘీభావం ప్రకటించారు.

ఇప్పటికే చాలా రోజులుగా దీక్షలు చేస్తున్నారని, ఇంటిల్లిపాదీ.. అక్కలు, చెల్లెళ్లు కూడా దీక్షల్లో పాల్గొన్నారని, ఎన్ని రోజులు దీక్షలు చేసినా చంద్రబాబు ప్రభుత్వం కనికరించదన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తానని భరోసా ఇచ్చి వారితో దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా అక్కడికి భారీగా విచ్చేసిన చేనేతలు, ధర్మవరం నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. చేనేతలు రూ.వెయ్యి సిల్క్‌ రాయితీ కోసం 37 రోజులుగా టెంట్లు వేసుకుని దీక్షలు చేస్తుంటే చంద్రబాబుకు మనసు కరగలేదన్నారు. సిల్క్‌ రాయితీ బకాయిలు చెల్లించి, నెల నెలా సక్రమంగా ఇవ్వాలని కోరుతున్నా పట్టించుకోలేదన్నారు. జగన్‌ తన ప్రసంగంలో ఇంకా ఏమన్నారంటే.. 

మోసం చేయడం బాబుకు కొత్త కాదు
అనంతపురం జిల్లాలో 34 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే జిల్లాలోని ధర్మవరం పట్టు పరిశ్రమ దేశంలోనే ప్రసిద్ధి. నాడు జగన్‌ ధర్మవరానికి వెళ్తున్నారు.. చేనేత కుటుంబాల ఇళ్లకు వెళతారని 11 మందికి ముష్టి వేసినట్లు సాయం అందించా రు. అందులోనూ రూ.5 లక్షల పరిహారం దేవుడెరుగు రూ.1.50 లక్షలు కూడా అందలేదు. జగన్‌ వెళ్లిపోయిన తర్వాత (భరోసా ముగిసిన తర్వాత) తిరిగి చేనేతలను పట్టించుకునే నాథుడే లేడు. ఇంత మంది చనిపోతే ఆదుకోవాలనే స్పృహ ప్రభుత్వానికి లేదు. చేనేత కుటుంబాల్లోని ఆడబిడ్డలు దీక్షలు చేస్తుంటే కూడా మనసు కరగలేదు. బాబు ప్రభుత్వం రాకముందు ముడి పట్టుపై రూ.600 రాయితీ వచ్చేది.

ముడి పట్టు రూ.2,300 ఉన్నపుడు రూ.600 అంటే 25 శాతం సబ్సిడీ వచ్చేది. ఈ రోజు ముడి పట్టు ధర రూ.4 వేలకు పెరిగింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 41 నెలలైంది. ఏడాది కిందట ఆయన ఇక్కడకు వచ్చి.. సబ్సిడీని రూ.600 నుంచి వెయ్యి చేస్తానని చెప్పారు. ఆ తర్వాత ఎన్ని నెలలు రాయితీ ఇచ్చారని శిబిరంలో ఉన్న వారిని ప్రశ్నిస్తే.. బాబు రాక ముందు 13 నెలలు రాలేదన్నారు. రూ.వెయ్యి సబ్సిడీ ప్రకటించాక కేవలం రెండు నెలలు ఇచ్చారని చెప్పారు. రూ.వెయ్యి చొప్పున 10 నెలల బకాయిలు ఇవ్వాల్సి ఉంది. దీక్ష చేస్తున్నవారి వద్దకు జగన్‌ వచ్చాడు అని తెలిసిన తర్వాతైనా బాబుకు జ్ఞానోదయమవుతుందని ఆశిద్దాం. మోసం చేయడం ఆయనకు కొత్త కాదు. రైతులు, విద్యార్థులు, పిల్లలు, అవ్వాతాతలు, చివరకు అన్ని కులాల వారినీ మోసం చేశారు.

చేనేతలనైతే దారుణంగా వంచించారు
ఇదే ఎన్నికల మేనిఫెస్టో (మేనిఫెస్టో చూపిస్తూ)లో మగ్గం పట్టుకుని, సినిమా ఫోజు పెట్టి చేనేత కార్మికులను మోసం చేసేందుకు నాంది పలికారు. చేనేత కార్మికుల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామన్నారు. ‘రుణాలు చెల్లించొద్దు. నేనొస్తున్నా.. చెల్లిస్తా’ అన్నారు. ఎంత మందికి రుణాలు మాఫీ అయ్యాయని అడుగుతున్నా? రైతులకు సంబంధించి రూ.87,612 కోట్ల రుణాల్లో ఈ ప్రభుత్వం ఇచ్చింది దాని వడ్డీకి కూడా సరిపోలేదు. చేనేత కార్మికులు బ్యాంకుల్లో తీసుకున్న రుణం కేవలం రూ.390 కోట్లు. కనీసం ఇదైనా మాఫీ చేస్తారనుకుంటే ఇందులో కత్తిరింపులు వేసి రూ.110 కోట్లకు తగ్గించారు. అందులోనూ కేవలం రూ.70 కోట్లు ఇచ్చి చేతులెత్తేశారు.

ఒక్కో చేనేత కార్మిక కుటుంబానికి రూ.లక్ష వరకు తక్కువ వడ్డీకి రుణం ఇప్పిస్తామన్నారు. బ్యాంకులకు వెళితే రుణం అందుతుందా అని అడుగుతున్నా? రుణమిస్తామనే అంశాన్ని కూడా మేనిఫెస్టోలో పొందుపరిచారు. ప్రతీ చేనేత కుటుంబానికి రూ.1.50 లక్షలతో ఇల్లు, మగ్గం ఏర్పాటు చేస్తామన్నారు. ఉచితంగా ఇల్లు కట్టించి, షెడ్డు నిర్మించారా? అని అడుగుతున్నా. (జగన్‌మోహన్‌రెడ్డి అడిగిన ప్రతీ ప్రశ్నకు ప్రజల నుంచి ‘లేదు.. లేదు..’ అని సమాధానం వచ్చింది) ఇలా చంద్రబాబు చేసిన మోసాల గురించి చెబుతూ పోతే చాలా ఎక్కువగా కన్పిస్తాయి. చేనేత కార్మికులకు రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక నిధి, బ్యాంకు ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యి నాలుగేళ్లయింది. ఇప్పటి వరకు రూ.4 వేల కోట్లు ఇవ్వాలి? ఇచ్చారా? అని అడుగుతున్నా. బ్యాంకు లేదు.. నిధి లేదు. తుదకు ఇస్తున్న సబ్సిడీని కూడా కత్తిరించారు.

అందరం ఒక్కటవుదాం..
ప్రతీ జిల్లాలో చేనేత పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. కడపలో నాకైతే కన్పించలేదు. మీకు అనంతపురంలో ఎక్కడైనా చేనేత పార్కు కన్పించిందా? అని అడుగుతున్నా. ఏటా రూ.వెయ్యి కోట్లు ఇస్తానన్న చంద్రబాబు 2014 – 15 బడ్జెట్‌లో రూ.98 కోట్లు, 2015 – 16లో రూ.120 కోట్లు మాత్రమే కేటాయించారు. ఐసీఐసీఐ ఇన్సూరెన్స్‌ ఉండేది. రూ.30 వేల వరకూ వైద్యం అందేది. ఈ ముఖ్యమంత్రి పుణ్యమా అని ఆ భరోసా కూడా పోయింది.

చేనేత కార్మికులంతా అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు ఆప్కో అనే పేరు ఎక్కడైనా కనిపిస్తోందా? ఓ వైపు ముడిసరుకు ధరలు పెరుగుతున్నాయి. మరో వైపు చీరల ధరలు మాత్రం పెరగడం లేదు. కార్మికులు మూడు రోజులు కష్టపడితే రూ.500 వస్తోంది. దున్నపోతు మీద వర్షం పడ్డట్లు ఈ ప్రభుత్వ పాలనలో ఏం చేసినా వారికి కన్పించడం లేదు.. విన్పించడం లేదు. ఈ దుర్మార్గపు పాలన పోయే రోజు దగ్గరలోనే ఉంది. అందరం ఒక్కటై మన ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం. ఏడాదిలో ఎన్నికలు వస్తాయని ఆయనే పదిసార్లు చెప్పారు. అప్పటి వరకూ కలసి కట్టుగా పోరాడి చంద్రబాబు మెడలు వంచుదాం. ఇందుకు మీ అందరి ఆశీస్సులు కావాలి’’ అని జగన్‌ అన్నారు. సభ అనంతరం అనంతపురానికి చెందిన పారిశ్రామికవేత్త శివారెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరారు.

మెరుగైన పాలన అందిస్తాం
‘‘ప్లీనరీలో నవరత్నాలు ప్రకటించాం. ఎన్నికలకు ఏడాదికి పైగా గడువు ఉందని, రూ.2 వేలు పింఛన్‌ ఇస్తామని మనం ఇప్పుడే ప్రకటించడం వల్ల చంద్రబాబు కూడా అంతే మొత్తం పెంచే అవకాశం ఉందని ఆ తర్వాత పలువురు నాతో అన్నారు. నిజంగా ఆయన అలా చేయాలని నేను ఛాలెంజ్‌ విసురుతున్నా. అలా చేస్తే పేదవాడికి మేలు జరుగుతుంది. అవ్వా తాతలకు ఎంత చేసినా తక్కువే అన్నాను. ఈ డబ్బులు వారి ఆస్పత్రి ఖర్చులకు పనికొస్తాయి. మానవత్వంగా ఆలోచించాలని చెప్పా. ఆయన అలా పెంచితే.. జగన్‌ మోహన్‌రెడ్డి ప్రకటించాకే చేసినట్లవుతుందని చెప్పాను. బాబు కంటే గొప్పగా, మెరుగైన పాలన అందిస్తామని మీ అందరికీ భరోసా ఇస్తున్నా. 

చేనేతలను ఆదుకుంటాం..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేనేతలకు ప్రతీ నెల రూ.2 వేలు సిల్క్‌ రాయితీ ఇస్తాం. రూ.1.50 లక్షలతో ఇల్లు కట్టిస్తాం. ప్రతీ చేనేత కార్మికుడికి తోడుగా ఉంటాం. రూ.390 కోట్లలో మిగిలిన అప్పులు మాఫీ చేస్తాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 50 ఏళ్లకు పింఛన్‌ ఇచ్చారు.. మేము అధికారంలోకి రాగానే 45 ఏళ్లకే చేనేతలతో పాటు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలలోని బడుగు, బలహీనవర్గాలకు పింఛన్లు ఇస్తాం. ఆ పింఛన్‌ కూడా రూ.వెయ్యి కాకుండా రూ.2 వేలకు పెంచుతాం. వడ్డీ లేకుండా రూ.లక్ష అప్పు ఇప్పిస్తాం. ఇందుకు బ్యాంకర్లు ఒప్పుకోకపోతే హ్యాండ్లూం కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి.. దాని ద్వారా రుణం ఇప్పిస్తాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క ఇల్లూ కన్పించలేదు. మేము రాష్ట్ర వ్యాప్తంగా పేద వాళ్లకు 25 లక్షల ఇళ్లు నిర్మిస్తాం. గ్రామాల్లో నిల్చుని ఇల్లు లేని వారు ఎవరైనా ఉంటే చేతులెత్తండి అని అడిగితే ఒక్క చేయి కూడా పైకి లేవకుండా అందరికీ న్యాయం చేస్తాం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top