చంద్రబాబుతో కలిసి పనిచేయలేం!

చంద్రబాబుతో కలిసి పనిచేయలేం! - Sakshi


 సన్నిహితులకు పవన్‌కళ్యాణ్ స్పష్టీకరణ?

 

 సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి పనిచేయడానికి జనసేన నాయకుడు, సినీనటుడు పవన్‌కల్యాణ్ ఏమాత్రం సిద్ధంగా లేరని తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబుకు దూరంగా ఉండటమే మేలని పవన్‌కల్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం. బాబుతో కలిసి పనిచేయడమన్నది ఏ రూపంలో కూడా సాధ్యంకాదనేది పవన్ ఆలోచనగా చెప్తున్నారు. పవన్‌కల్యాణ్ ఇటీవల చంద్రబాబుతో భేటీ  అయినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని పార్టీ నేతలు రహస్యంగా ఉంచారు. చంద్రబాబుతో సమావేశమైన తర్వాతే పవన్ తన విధానమేంటో స్పష్టం చేస్తూ బీజేపీ నేతలకు లేఖ రాసినట్టు సమాచారం. ‘నా మద్దతు జాతీయ పార్టీలకే... ప్రత్యేకించి  నరేంద్రమోడీకే పరిమితం’ అని స్పష్టంచేస్తూ పవన్ బీజేపీ నేత సోము వీర్రాజుకు రాసిన లేఖపై విస్తృత చర్చ జరుగుతోంది. టీడీపీ నేతల ఆహ్వానం మేరకు ఆయన ఇటీవల చంద్రబాబును ఆయన నివాసంలో కలుసుకున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఆ భేటీ తర్వాత చంద్రబాబు పట్ల పవన్ తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్టు వినికిడి. బాబు పైకి చెప్తున్న విషయాలకు అంతర్గత వ్యవహారాలకు ఏమాత్రం పొంతన లేదని పవన్ తన సన్నిహితుల వద్ద తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అసలు ఏ విషయంలోనూ స్పష్టత లేని ఇలాంటి నేతలను కలుసుకోవాలని తనను పిలవడమే తప్పని పవన్ అన్నట్లు  సన్నిహితులు చెబుతున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top