మీరు చెబితే..  మేం వినాలా!

Parents Encouraging Child Marriages In Srikakulam Rural - Sakshi

సాక్షి, శ్రీకాకుళం రూరల్‌ : చిన్నారి పెళ్లికూతుళ్లు రోజురోజుకూ అధికమవుతున్నారు. చైల్డ్‌లైన్‌ సిబ్బంది, అధికారులు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నా ఫలితం లేకపోతోంది. వారు వెళ్లిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా బాల్య వివాహాలు జరిపించేస్తున్నారు. చిన్న వయసులోనే పెళ్లి జరగడం, బిడ్డలకు జన్మనివ్వడంతో చాలామంది అమ్మాయిలు 16 నుంచి 20 ఏళ్ల వయసులోపే కాన్సుల సమయంలో మృత్యువాత పడుతున్నారు.ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు సమాచారం అందితే వెంటనే ఉన్నతాధికారులు ఆయా గ్రామాలకు వెళ్తున్నారు.

తల్లిదండ్రుల సమక్షంలో బాలికతో మాట్లాడి చిన్న వయసులో పెళ్లి జరిగితే కలిగే అనర్ధాలను వివరిస్తున్నారు. అయినా తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు. గ్రామపెద్ద, వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి సమక్షంలో కౌన్సెలింగ్‌ చేసినప్పటికీ రాజకీయ నాయకులతో చెప్పించి చూసీచూడనట్లు వదిలేయండిని చెప్పడంతో అధికారులు ఏమిచేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు ముహూర్తబలం చేదాటిపోకూడదని దొంగచాటుగా  గుడిలోనో, వేరేచోటనో గుట్టుచప్పుడు కాకుండా మూడుముళ్లు వేయించేస్తున్నారు. 

కానరాని మార్పు..
తక్కువ వయసులోనే వివాహం కావడం, ఏడాదిలోనే కాన్పులు రావడంతో బాలికలు యుక్త వయస్సులోనే మృతి చెందిన సంఘటనలు కోకొల్లలు. ఈ విషయంలో అధికారులు, వైద్యులు ఎన్ని హెచ్చరికలు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. చట్ట ప్రకారం అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండితేనే వివాహం జరిపించాల్సి ఉంది. ప్రస్తుతం గ్రామీణ ప్రాం తాల్లో ఎక్కువ శాతం మంది ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. అమ్మాయి పెళ్లి చేస్తే ఓ బాధ్యత తీరిపోతుందంటూ తల్లిదండ్రులు సంబంధాల కోసం వెతకడం, అబ్బాయి తరఫు వారు కూడా వయసును పెద్దగా పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లే బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. బాల్య వివాహాలు నేరమంటూ చైల్డ్‌లైన్‌ సిబ్బంది, ఐసీడీస్‌ సిబ్బంది గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నా, యువతీ యువకుల తల్లిదండ్రుల కౌన్సిలింగ్‌ ఇస్తున్నా ఏ మాత్రం ప్రయోజనం ఉండటం లేదు. 

తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌..
రెండు రోజులు క్రితం చైల్డ్‌లైన్‌ సిబ్బందికి వచ్చిన ఫిర్యాదు మేరకు మండలంలోని తండేవలస గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికకు ఈ నెల 23న వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న చైల్డ్‌లైన్‌ సిబ్బంది బాలిక తల్లిదండ్రులకు గురువారం కౌన్సిలింగ్‌ ఇచ్చారు. పెళ్లికి బాలిక వయసు సరిపోదంటూ, వివాహం చేయకూడదని ఇరువర్గాల కుటుంబ సభ్యులను హెచ్చరించారు. ఇదిఇలావుండగా గడిచిన కొన్ని రోజులు క్రితమే ఈ అమ్మాయికి ప్రధానం కుడా జరిగిపోయింది. ఈ వివాహాంకు సంబందించి అధికారులు ఏమేరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top