సేవల్లో హైఫై | Sakshi
Sakshi News home page

సేవల్లో హైఫై

Published Wed, May 20 2015 4:56 AM

సేవల్లో హైఫై

- పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌కు రాజధాని శోభ
- దేశంలో వైఫై ఉన్న మొదటి బస్టాండ్
- 25 బస్సు సర్వీసుల్లో ఇంట్రా వైఫై
- స్కానియా బస్సు రాకపోకలు
సాక్షి, విజయవాడ :
పండిట్ నెహ్రు బస్‌స్టేషన్ రాజధాని శోభను సంతరించుకుంది. క్రమంగా అధునాతన సౌకర్యాలను అందిపుచ్చుకుని వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందిస్తోంది. సర్వీసుల సంఖ్య మొదలుకుని వైఫై సేవల వరకు అన్నీ దశలవారీగా ఇక్కడ అమల్లోకి తెస్తున్నారు. తద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించటంతోపాటు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు ఆదాయం పెంచే దిశగా కసరత్తు సాగిస్తున్నారు. ప్రస్తుతం 25 బస్సుల్లో ఉచిత వైఫై సౌకర్యం నాలుగు రోజులుగా అందుబాటులోకి వచ్చింది.

ప్రతినెలా మూడురోజులు ఆర్టీసీ ఎండీ బస్టాండ్‌లోనే..
గడిచిన ఆరు నెలల్లో జిల్లాకు రెండు విడతల్లో 120కుపైగా కొత్త బస్సులు (వీటిలో 12 ఏసీ సర్వీసులు) వచ్చాయి. మరో మూడు నెలల వ్యవధిలో దశలవారీగా మంజూరైన 50 బస్సులు జిల్లాకు రానున్నాయి. ఇప్పటికే జిల్లాలోని 14 డిపోల్లో కలిపి 1,440 వరకు బస్సులు ఉన్నాయి. ఇవికాకుండా పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ రాష్ట్రానికి కేంద్ర బిందువుగా ఉండటంతో ఎక్కువ సర్వీసులు ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తున్నాయి. రోజుకు 2,500 బస్సులు విజయవాడ నుంచి రోజూ వెళ్తున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాలతోపాటు చెన్నై, హైదరాబాద్, బెంగళూరుకు పదుల సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నాయి. వచ్చేనెల నుంచి ఆర్టీసీ ఎండీ నగరంలోనే మూడు రోజులు అందుబాటులో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు. దీనికి అనుగుణంగా బస్‌స్టేషన్‌లోని పైఅంతస్తుల్లో మార్పులు చేసి ప్రత్యేక చాంబర్‌తోపాటు కార్యాలయాన్ని సిద్ధం చేస్తున్నారు.

టెస్ట్ డ్రైవ్‌లో స్కానియా బస్సు
మల్టీయాక్సిల్ సౌకర్యం కలిగిన స్కానియా బస్సు గతనెల 15 నుంచి హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీకి రాకపోకలు మొదలుపెట్టింది. సుమారు రూ.1.20 కోట్ల విలువైన ఈ బస్సును విజయవాడ రీజియన్‌కు కేటాయించారు. దీనిని ప్రస్తుతం ప్రయోగాత్మకంగా రెండు నెలల పాటు విజయవాడ నుంచి హైదారాబాద్‌కు నడిపి పనితీరును పరిశీలిస్తున్నారు. దీనికోసం పదిమంది డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. స్కానియా కంపెనీకి చెందిన టెక్నీషియన్ ఒకరు బస్సులోనే ఉండి పనితీరును పరిశీలిస్తున్నారు. ఆటోమేటిక్ డోర్ లాకింగ్ సిస్టమ్, మల్టీయాక్సిల్ సీటింగ్, ఏసీ ఇందులోని ప్రత్యేకతలు.

25 సర్వీసుల్లో ఇంట్రా వైఫై
ప్రస్తుతం విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్, చెన్నై, బెంగళూరు తదితర సర్వీసుల్లోని కొన్ని బస్సులకు ఇంట్రా వైఫై సౌకర్యాన్ని ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేశారు. ఇంట్రానెట్‌లో కొన్ని సినిమాలు, కొన్ని రకాల గేమ్స్, వీడియో, ఆడియో సాంగ్స్ మాత్రమే ఉంటాయి. గత నెల 29 నుంచి ఈనెల 31 వరకు 25 బస్సు సర్వీసుల్లో వైఫై అమల్లో ఉంది.

బస్టాండ్‌లో వైఫై
వీటితోపాటు పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో సోమవారం నుంచి వైఫై సేవలు కూడా ప్రారంభమయ్యాయి. ఒకేసారి 8వేల మంది ప్రయాణికులు వినియోగించుకునే సౌకర్యంతో దీనిని అమల్లోకి తెచ్చారు. బస్టాండ్‌లో 17 మాక్సెస్ పాయింట్లు ఏర్పాటుచేసి దీనిని అందిస్తున్నారు. 220 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 5జీ వైఫై సేవలను ప్రయాణికులు వినియోగించుకోవచ్చు. రోజుకు అరగంట మాత్రమే వైఫై ఉచితంగా పనిచేస్తుంది. ఆ తర్వాత రీచార్జి చేయించుకోవాల్సిందే. ఈ సౌలభ్యంతో దేశంలోనే వైఫై ఉన్న మొదటి బస్టాండ్‌గా పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌గా నిలిచింది.

Advertisement
 
Advertisement
 
Advertisement