ఆమె పేరు చెబితే కార్యదర్శులకు హడల్‌ 

Panchayat Secretary Becoming Afraid Of Women MPDO In Nuziveedu - Sakshi

సాక్షి, నూజివీడు : అధికారులు అవినీతికి దూరంగా ఉండాలని ఒకవైపు ప్రభుత్వం పదేపదే చెప్తున్నా, అధికారులు మాత్రం తమ తీరును మార్చుకోవడం లేదు. నూజివీడు నియోజకవర్గంలోని ఓ మండలంలో అధికారి పేరు చెబితే పంచాయతీ కార్యదర్శులు హడలెత్తుతున్నారు. ప్రతి విషయంలోనూ డబ్బులు ఇవ్వాలంటూ వేధిస్తుండడంతో వారంతా సెలవుపై వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

తన ఇంట్లో పూజలు నుంచి మనవరాలి పుట్టినరోజు వరకు, వినాయక చవితి నుంచి దీపావళి వరకు ఏ పండుగ వచ్చినా ఒత్తిడి చేసీ మరీ సెక్రటరీల నుంచి వేలకువేలు గుంజుతున్నట్లు తెలిసింది. దసరా పర్వదినానికి చీర కొనిపెట్టమని కార్యదర్శులను ఒత్తిడి చేయడంతో రూ.5వేలు సమరి్పంచుకున్నట్లు సమాచారం. వినాయకచవితికి పూజా కార్యక్రమాలకు, దీపావళికి బాణసంచా కూడా కార్యదర్శులే కొని ఇచ్చినట్లు సమాచారం.

ఆమె తనకు కావాల్సిన గృహోపకరణాలను సైతం కార్యదర్శులను పీడించి మరీ వారితో కొనుగోలు చేయిస్తున్నట్లు సమాచారం. రూ.30వేలతో వాషింగ్‌ మెషిన్‌ కొనుగోలు చేశారు. అందులో రూ.20వేలు ఆమె చెల్లించగా, మిగిలిన రూ.10వేలు ఓ కార్యదర్శి పేరుతో షోరూమ్‌లో అప్పురాయించారు. చేసేదేమీ లేక తప్పని పరిస్థితుల్లో ఆ కార్యదర్శి రూ.10వేలు షోరూమ్‌లో చెల్లించినట్లు సమాచారం. ఆ అధికారి మనమరాలి జన్మదిన వేడుకలకు కార్యదర్శుల జేబులు ఖాళీ అయ్యాయి.  పంచాయతీలలో సొంత డబ్బులు పెట్టి పనులు చేయించి బిల్లులు పెడితే వాటిపై సంతకాలు చేయడానికి చేయి తడపాల్సిందే.

వాళ్లూ, వీళ్లు అనే తేడా లేకుండా నిత్యం డబ్బులు గుంచే ఆలోచనలో ఉండడంతో కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే మండలంలోని మరో అధికారి కూడా పంచాయతీ కార్యదర్శుల వద్ద నుంచి వసూలు చేస్తున్నారు. కార్యాలయంలోని టేబుల్‌పైన ఒక పంచాయతీ కార్యదర్శి తన బ్యాగ్‌ను ఉంచి పక్కకు వెళ్తే ఆ బ్యాగులోని రూ.2వేలను ఆ అధికారి తీసుకోవడం చర్చనీయాంశమైంది. వీరిద్దరి తీరుపై ప్రజాప్రతినిధులలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top