పల్లె సీమలో కేంద్రీయ విద్య

Palachur Kendriya Vidyalaya Sanctioned By Central Government - Sakshi

 పాలచ్చూరులో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు అనుమతి  

ఎన్నో దశాబ్దాల తర్వాత మండలానికి గుర్తింపు 

ఎంపీ దుర్గాప్రసాద్‌రావు చొరవతో మంజూరు   

పల్లె సీమలో కేంద్రీయ విద్యాలయానికి పునాదులు పడుతున్నాయి. పచ్చని వ్యవసాయ పొలాలు.. ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య పాలచ్చూరులో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు  వేగవంతంగా అడుగులు పడుతున్నాయి. నెల్లూరు, చిత్తూరు జిల్లాల సరిహద్దు మండలంగా ఉన్న పెళ్లకూరు దశాబ్దాలుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఉన్నత విద్యా సంస్థలను నెలకొల్ప లేకపోయాయి. గత టీడీపీ ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టకపోగా, ఉన్న విద్యాలయాలను తొలగించింది. గ్రామీణ విద్యార్థులు ప్రాథమిక విద్యకే దూరమయ్యే పరిస్థితి కల్పించింది. ఈ దశలో స్థానిక నేతల ప్రతిపాదనలతో ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌రావు చొరవతో మండలానికి గుర్తింపు వచ్చే కేంద్రీయ విద్యాలయం మంజూరు అయింది.

సాక్షి, పెళ్లకూరు: దశాబ్దాల తర్వాత పెళ్లకూరు మండలానికి జిల్లా స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విద్యాలయం మండలంలో ఏర్పాటు చేయనుంది. 2020–21 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించనున్నారు. విద్యాలయం ప్రారంభించేందుకు అధికారులు ఇప్పటికే గ్రామ సమీపంలో పది ఎకరాల స్థలాన్ని సేకరించారు. రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో సర్వే చేసి కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి త్వరలో స్థలాన్ని అందజేసేలా చర్యలు చేపట్టారు. విద్యాలయం ప్రారంభించేందుకు అధికారులు ఇప్పటికే గ్రామ సమీపంలో పది ఎకరాలు స్థలాన్ని సేకరించారు. ప్రస్తుతానికి గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల భవనంతో పాటు అద్దె భవనాల్లో కేంద్రీయ విద్యాలయం నిర్వహించేలా అధికారులు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది.

పాలచ్చూరులో విద్యాలయం ఏర్పాటు చేస్తే అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలతో పాటు స్థానిక విద్యార్థులు సీబీఎస్‌ఈలో ఉన్నత చదువులు చదువుకొనే అవకాశం కలుగుతుంది. ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్‌ వరకు చదువుకొనే అవకాశం ఉన్న కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశం కోసం ప్రతి ఏటా మార్చి నెలలో నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా ఎస్సీ, ఎస్టీలకు 15 శాతం, దివ్యాంగులకు 3 శాతం చొప్పున సీట్లు కేటాయించనునన్నారు. దీని వల్ల పేద కుటుంబాలకు చెందిన పిల్లలు మంచి అవకాశం లభిస్తుంది. చదువుతో పాటు వ్యాయామం, క్రీడలు, యోగా తదితర అంశాల్లో ప్రత్యేక తర్ఫీదు ఉంటుంది. ప్రతి క్షణం విద్యార్థులపై ప్రత్యేక నిఘా ఉంచడం, క్రమశిక్షణతో కూడిన సీబీఎస్‌ఈ సిలబస్‌లో విద్యా బోధన ఉంటుంది. నియోజకవర్గంలోని అన్నీ మండలాల్లో గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ హాస్టళ్లు, మోడల్‌ స్కూళ్లు ఉన్నాయి. కానీ పెళ్లకూరు మండలంలో మాత్రం ఇప్పటి వరకు అలాంటి అవకాశం లేదు.

వైఎస్సార్‌ పాలనలో.. 
మండలంలో 24 పంచాయతీలు ఉండగా గతంలో 16 పంచాయతీలు చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజక వర్గంలో, 6 పంచాయతీలు సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో ఉండేవి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ హయాంలో 24 పంచాయతీలను సూళ్లూరుపేట నియోజక వర్గంలో విలీనం చేశారు. అప్పటి నుంచి పెళ్లకూరు, చెంబేడు, శిరసనంబేడు, రోసనూరు గ్రామాల్లో సంక్షేమ వసతి గృహాలు ఏర్పాటు చేసి పేద పిల్లలు చదువుకొనే అవకాశం కలిగించారు. అయితే టీడీపీ అధికారంలోకి రావడంతో సంక్షేమ వసతి గృహాలు పూర్తిగా తొలగించడం వల్ల మళ్లీ ఇక్కడి విద్యార్థులకు ఇక్కట్లు తప్పలేదు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ పాలనలో తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌రావు చొరవతో పాలచ్చూరులో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.

టీడీపీ హయాంలో..
మండలంలో 51 ప్రాథమిక, 7 ప్రాథమికోన్నత, 7 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 1,816 మంది ప్రాథమిక విద్యార్థులు, 972 మంది ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థులు మొత్తం 2,788 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.  స్వాతంత్య్రం సిద్ధించి 73 ఏళ్లు పూర్తయినా మండలంలో కనీసం ఒక్క ప్రభుత్వ కళాశాల గానీ, గురుకుల పాఠశాల గానీ, మోడల్‌ స్కూల్‌ గానీ లేకపోవడం గమనార్హం. దీనికి తోడు గత టీడీపీ పాలనలో మండలంలోని మూడు సాంఘిక సంక్షేమ వసతి గృహాలు మూసివేసింది. 

ఆయా ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాలకు చెందిన పలువురు విద్యార్థులు చదువులకు దూరమయ్యారు. మరి కొందరు విద్యార్థులు ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మండలంలో ఎక్కువ మంది వ్యవసాయ కూలీల కుటుంబాలు ఉండడం వల్ల అక్షరాస్యత లేని తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువుల చదివించకుండా అర్ధాంతరంగా ఆపేస్తున్నారు. దీంతో కొందరు విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొనే అవకాశం లేక నివాసాలకే పరిమితమవుతున్నారు.    

ఎంపీ దుర్గాప్రసాద్‌రావు చొరవతో
మండలంలోని గ్రామీణ ప్రాంత ప్రజలు చదువుకొనే అవకాశం లేక ఇబ్బందులు పడుతున్న ఇక్కడి పరిస్థితిని తెలుసుకున్న తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌రావు చొరవ తీసుకుని కేంద్ర విద్యాలయ అధికారులతో సంప్రదింపులు జరిపారు. పాలచ్చూరులో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, వైఎస్సార్‌సీపీ నేతలు కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, డాక్టర్‌ వెడిచర్ల ప్రద్యుమ్నకుమార్‌రెడ్డి తదితరులు ఇక్కడి ఉన్నత విద్యపై నెలకొన్న సమస్యపై ఎంపీతో మాట్లాడారు. ఎంపీ చొరవతో పాలచ్చూరులో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసేలా కసరత్తు మొదలు పెట్టారు. పాలచ్చూరు పంచాయతీ పరిధిలోని జంగాలపల్లి కూడలి వద్ద ఇప్పటికే 10 ఎకరాల భూములను సేకరించి కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి ప్రాథమిక దశ పనులు చేపట్టేలా పాలకులు పనులు మొదలు పెట్టారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top