ప్రైవేట్‌ బోట్‌ ఆపరేటర్ల ఇష్టారాజ్యం c

Over action of of Private Boat Operators - Sakshi

‘నిర్దిష్ట అనుమతులు లేకుండానే ప్రైవేటు ఆపరేటర్లు కృష్ణా నదిలో బోటు సర్వీసులు నిర్వహిస్తున్నారు. లైసెన్సు ఇచ్చే ముందు జల వనరులు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అనుమతులు పొందడంలేదు. ప్రైవేటు ఆపరేటర్లు తగిన భద్రతా ప్రమాణాలు పాటించడంలేదు. సిబ్బందికి తగిన నైపుణ్యం లేదు.’ 
(కృష్ణా నదిలో ప్రైవేటు బోటు ఆపరేటర్ల మాఫియాపై కొద్ది నెలల క్రితం విజిలెన్స్‌ శాఖ ఇచ్చిన నివేదిక ఇదీ.) 

సాక్షి, అమరావతి/అమరావతి బ్యూరో: రాజధానిగా రూపాంతరం చెందిన అనంతరం విజయవాడలో పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. భవానీ ద్వీపం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో బోట్‌ టూరిజాన్ని పెంపొందించేందుకు పర్యాటక శాఖ అధికారులు కొన్ని ప్రణాళికలు రూపొందించారు. అప్పట్లో పర్యాటక శాఖను పర్యవేక్షిస్తున్న సీఎం చంద్రబాబు.. వారి సూచనలకు భిన్నంగా ప్రైవేటు ఆపరేటర్లను ప్రోత్సహించాలని అధికారులకు పరోక్షంగా ఆదేశాలిచ్చారు. మరోవైపు.. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేటు బోట్లపై విజిలెన్స్‌ అధికారులు గత ఏడాది నవంబర్‌లో దాడులు నిర్వహించి సీజ్‌ చేశారు. ఆ బోట్లను జలవనరుల శాఖకు అప్పగించారు.

కానీ, ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని ఆ బోట్లను ఒక్కరోజులోనే విడుదల చేశారు. అనంతరం విజిలెన్స్‌ శాఖ అధికారులు కృష్ణా నదిలో ప్రైవేటు బోటు ఆపరేటర్ల అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనపై ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. కానీ, ప్రభుత్వ పెద్దలు ఆ నివేదికను ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా.. సీజ్‌ చేసిన బోట్లను వెంటనే విడుదల చేయాలని జలవనరుల శాఖను ఆదేశించి అప్పటికప్పుడు తూతూ మంత్రంగా అనుమతులిచ్చేశారు. ప్రభుత్వ పెద్దలే పర్యాటక మోజులో వారికి దన్నుగా నిలవడంతో మరికొందరు ప్రైవేటు బోటు ఆపరేటర్లు సైతం కృష్ణా నదిలో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు చేపట్టారు. ఫలితం.. కృష్ణా నదిలో ఆదివారం పెను విషాదానికి దారితీసింది. అంతేకాదు.. జలక్రీడలకు సైతం ఇటీవల ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చేస్తోంది. ప్రకాశం బ్యారేజీ ఎగువన కృష్ణా నదీ గర్భంలో అధికారపార్టీ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి ఫ్లోటింగ్‌ రెస్టారెంట్ల ఏర్పాటుకు ఛాంపియన్స్‌ యాచెట్స్‌ క్లబ్‌కు అనుమతిస్తూ గత జూన్‌ 21న జలరవాణా శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేయడం.. దీనివల్ల చేకూరే ప్రమాదాలపై ‘సాక్షి’ కథనాలు ప్రచురించడంతో గత ఆగస్టు 29న ఆ అనుమతులను రద్దు చేశారు.

పర్యాటక శాఖ వద్దు.. ప్రైవేటు ఆపరేటర్లే ముద్దు
కాగా, విజిలెన్స్‌ విభాగం అధికారులు దాడులు నిర్వహించిన తరువాత  ప్రభుత్వ పెద్దలు పంథా మార్చారు. పర్యాటక శాఖ కంటే ప్రైవేటు ఆపరేటర్లకే ఎక్కువ లబ్ధి కలిగేలా ఒప్పందాలు చేసుకున్నారు. ఆదాయంలో పర్యాటక శాఖకు 30శాతం, ప్రైవేటు ఆపరేటర్లకు 70శాతం ఉండాలని అధికారులు సూచించారు. ప్రభుత్వ పెద్దలు మాత్రం పర్యాటక శాఖకు కేవలం 10శాతం, ప్రైవేటు ఆపరేటర్లకు 90శాతం దక్కేలా ఒప్పందం చేసుకున్నారు. ఇక బోటింగ్, జల క్రీడలు, జలరవాణాకు లైసెన్సు ఇవ్వాలంటే రాష్ట్ర జలవనరుల శాఖ, జాతీయ అంతర్గత జలరవాణా సంస్థ, అంతర్గత జలరవాణా సంస్థల అనుమతులు తప్పనిసరి. వీరితోపాటు రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అధికారులు పరిశీలించి అనుమతివ్వాలి. కానీ, వీటితో నిమిత్తం లేకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ప్రైవేటు బోట్లకు అనుమతులు ఇచ్చేసింది. ఆదివారం ప్రమాదానికి గురైన రివర్‌ బోటింగ్‌ అడ్వంచర్స్‌ సంస్థ కూడా అదే విధంగా నాలుగు నెలల క్రితం ఒప్పందం కుదుర్చుకుంది.

ఉధృతి అంచనా వేయలేకే...
పట్టిసీమ జలాలను కృష్ణా నదిలోకి మళ్లించిన లగాయతు.. పవిత్ర సంగమం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు ప్రవాహ ఉధృతి బాగా పెరిగింది. జలవనరుల శాఖకు ఈ పరిస్థితి నివేదించి ఉంటే ఆ ప్రాంతంలో నీటి ఉధృతిని అంచనా వేసేవారు. అందుకు బోట్లు తగిన విధంగా ఉన్నాయో లేవో పరిశీలించేవారు. కానీ, ఆ శాఖను కనీసం పట్టించుకోలేదు. అదే విధంగా రెవెన్యూ, అగ్నిమాపక శాఖలను పక్కనబెట్టేశారు.  ప్రభుత్వ పెద్దల నిర్వాకమే ఆదివారం ప్రమాదానికి ప్రధాన కారణమైంది.

భద్రతా ప్రమాణాలు గాలికి...
ప్రైవేటు బోటు ఆపరేటర్లు భద్రతా ప్రమాణాలను పూర్తిగా గాలికి వదిలేశారు. ఏ బోటులో కూడా లైఫ్‌ జాకెట్లు లేవని విజిలెన్స్‌ శాఖ నివేదించింది. అగ్నిమాపక పరికరాలూ లేవు. బోటు సిబ్బందికి తగిన శిక్షణ కూడా ఇవ్వలేదని విజిలెన్స్‌ శాఖ గుర్తించింది. నదిలో కొన్నిచోట్ల ఇసుక దిబ్బలు ఉంటాయి కాబట్టి వాటిని ముందే గుర్తించి బోటు గమనాన్ని మార్చాలి. ఇక ఉధృతి పెరిగినప్పుడు కూడా చాకచక్యంగా బోటును నడపాల్సి ఉంటుంది. బోటు సామర్థ్యం ఎంత, ఎంతమందిని ఎక్కించాలన్న దానిపై సిబ్బందికి అవగాహన ఉండాలి.

కానీ, కృష్ణా నదిలో ప్రైవేటు బోట్ల సిబ్బందిలో దాదాపు ఎవరికీ ఈ నైపుణ్యంలేదని విజిలెన్స్‌ నివేదిక స్పష్టంచేసింది. దీనిపై ప్రభుత్వం అప్పుడే స్పందించి తగిన చర్యలు తీసుకుని ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అలాగే, పర్యాటక బోట్లలో డ్రైవర్‌తో సహా ప్రయాణికులందరికీ లైఫ్‌ జాకెట్లు సమకూర్చాలి. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. కానీ, ఆదివారం ప్రమాదానికి గురైన బోటులో ఇవేవీ లేకపోవడం గమనార్హం. ఇక ఎంతమంది పర్యాటకులు బోటు ఎక్కుతున్నారో అన్నదానిపై సరైన రికార్డులూ నిర్వహించడంలేదు. ఎందుకంటే అందులో 10శాతం పర్యాటక శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే పర్యాటకుల సంఖ్యపై ఆపరేటర్లు సరైన రికార్డులు నిర్వహించడంలేదు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top