నోట్లు.. అవే పాట్లు

One Year of Demonetisation - Sakshi

ఏడాది అయినా తీరని కరెన్సీ కష్టాలు

పెద్ద నోట్లు రద్దు చేసి నేటికి ఏడాది పూర్తి తేరుకోని 

రియల్‌ ఎస్టేట్‌ రంగం

 అందుబాటులోకి రాని రూ.50, రూ.200 నోట్లు

చింతలపూడి/జంగారెడ్డిగూడెం : కేంద్ర ప్రభుత్వం 1,000, 500 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించి సరిగ్గా నేటికి ఏడాది పూర్తైంది. నల్ల ధనంపై యుద్ధం అంటూ ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేశారు. అయితే పెద్ద నోట్లు రద్దు చేసి సంవత్సరం పూర్తయినా ఇప్పటికీ ప్రజల కరెన్సీ కష్టాలు మాత్రం విడనాడలేదు. ప్రభుత్వ చర్యతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా దెబ్బతిన్నారు. ప్రజలకు నగదు చెలామణీ చేసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఏటీఎంలు దిష్టిబొమ్మల్లా మారాయి. ఏటీఎంలలో డబ్బులు డ్రా చేయాలంటే అధికంగా చార్జీలు వసూలు చేస్తుండటంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు.

 ఇప్పటికీ ఎక్కడ చూసినా బ్యాంకుల్లో బారులు, ఏటీఎంల వద్ద చిన్నా, పెద్దా తేడా లేకుండా జనం క్యూలు కడుతున్నారు. ఈ సంవత్సరం మొత్తం జనం ఇబ్బందులు తారస్థాయికి చేరుకున్నాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలు, వాయిదాపడ్డాయి. పెళ్లిళ్ల సీజన్‌లో కేంద్రం నోట్ల రద్దు ప్రకటించడంతో వధువు, వరుడి కుటుంబాలపై పెను భారమేపడింది. పెళ్లి ఖర్చులకు చేతిలో నగదు లేక పెళ్లి బట్టలు, నగలు కొనడానికి తీవ్ర అవస్థలు పడ్డారు. వ్యాపారాలు కుంటు పడ్డాయి. ముఖ్యంగా చిల్లర కష్టాలతో ప్రజలు తీవ్రఇబ్బందులు పడ్డారు. వ్యాపార, వాణిజ్య కేంద్రాల్లో ఆన్‌లైన్‌ చెల్లింపులు తప్ప ప్రత్యామ్నాయ చర్యలు లేకపోవడంతో పడరాని పాట్లు పడ్డారు. నోట్ల రద్దు తరువాత మూలనపడ్డ కొన్ని ఏటీఎంలు నేటికీ తెరుచుకోలేదు. 

కుదేలైన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నోట్ల రద్దుతో పూర్తిగా కుదేలైంది. అమ్మేవారు ఉన్నా కొనేవారు ముందుకు రాకపోవడంతో రియల్‌ బిజినెస్‌ కుప్ప కూలిపోయింది. ఇక సామాన్యుల అవస్థలైతే చెప్పనలవి కాదు. అటు మార్కెట్లో నగదు కొరత ఏర్పడటంతో కూలి పనులు లేక ఒక వేళ కూలికి వెళ్లినా సకాలంలో కూలి డబ్బులు అందక ఇబ్బందులు పడ్డారు. ఇక రైతుల పరిస్థితి అయితే మరీ దారుణంగా మారిందని చెప్పవచ్చు. వ్యవసాయానికి పెట్టుబడులు అందక, పండించిన పంటలకు నగదు రూపంలో చెల్లింపులు జరక్క బాధపడ్డారు. ఒక పక్క నోట్ల రద్దుతో ప్రజలకు ఇబ్బందులు తప్ప ఒరిగిందేమీ లేదన్న వాదనలు వినపడుతున్నాయి. ఇదిలా ఉంటే రూ.2 వేలు, రూ. 500 నోట్లు మార్కెట్‌లో చలామణి తగ్గిపోయాయి. చాలావరకు పెద్దనోట్లు బ్లాక్‌మనీగా వెళ్లిపోయినట్టు పలువురు పేర్కొంటున్నారు. దీంతో పెద్దనోట్లు మార్కెట్‌లో పెద్దగా కనిపించడం లేదు. 

జాడే లేదు
తాజా ప్రభుత్వం చిల్లర సమస్య తీర్చేందుకు రూ.200, రూ.50 కొత్త నోట్లను ప్రవేశపెట్టింది. అయితే ఈ నోట్లు విడుదల చేసి సుమారు రెండు నెలలు కావస్తున్నా నేటికీ పూర్తిగా చలామణిలోకి రాలేదు. అటు పెద్దనోట్లు చలామణిలో లేకపోగా, విడుదల చేసిన కొత్త నోట్లు రూ.200, రూ.50 ఇంకా పూర్తిగా చలామణిలోకి రాకపోవడం, కేవలం రూ.100 నోట్లు, పాత రూ.50 నోట్లు మాత్రమే మార్కెట్‌లో చలామణిలో ఉన్నాయి.

వ్యాపారి ప్రాణం తీసిన నోట్ల రద్దు 
కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు జిల్లాకు చెందిన ఓ వ్యాపారి ప్రధాని మోడీకి లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నరేంద్ర మోడీ గారు మీరు తీసుకున్న పెద్ద నోట్ల రద్దు ఎంతమందికి ఉపయోగపడిందో తెలియదు కానీ ఒక సామాన్యుడి ప్రాణం తీసింది. ఎందుకంటే నేను అప్పుల్లో ఉన్నాను. మీ రద్దు నిర్ణయం పుణ్యమా అంటూ ఒక్క రూపాయి కూడా దొరకక, చీటీలు కట్టలేకపోయాను. అప్పు ఇచ్చేవారు కూడా లేక ఎవరికీ సమాధానం చెప్పలేక చనిపోతున్నాను... అంటూ లేఖ రాసి నరసాపురం మండలం కొప్పర్రుకు చెందిన పోలిశెట్టి నర్సింహమూర్తి (నాని) హనుమకొండ లాడ్జిలో ఆత్మహత్య చేసుకోవడం జిల్లాలో కలకలం రేపింది. నోట్ల రద్దు వల్ల తాను ఇబ్బందులు పడ్డానని, అప్పులు తీర్చగలిగినన్ని తీర్చానని, ఇంకా తీర్చలేకపోవడంతో వారికి మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని, మోడీ నిర్ణయం వల్ల జీవించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖలో పేర్కొన్నాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top