షాడో డేగ కన్ను | Sakshi
Sakshi News home page

షాడో డేగ కన్ను

Published Tue, Apr 15 2014 2:16 AM

officials Intelligence  on  candidates  campaign expenditure

జిల్లాలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే ఖర్చులను అధికార యంత్రాంగం వేయి కళ్లతో పరిశీలిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు చేసే వివిధ రకాల ఖర్చులకు జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం రేట్లను కూడా నిర్ణయించింది. ఈ రేట్ల ప్రకారం అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా పెట్టే భోజనాలు, కాఫీ, టీ తదితర వాటికి లెక్క కట్టి ఖర్చును అభ్యర్థుల ఖాతాలో రాస్తారు. ఇలా జెండాలు, పోస్టర్లు, కరపత్రాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, జీపులు, ఇతర వాహనాలకు కూడా రేట్లను నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గానికి 7 రకాల టీమ్‌లు ఉన్నాయి.

 వీటి లక్ష్యం ఎన్నికల కోడ్‌ను పకడ్బందీగా అమలు చేయడం, అభ్యర్థులు చేసే ఖర్చును నిశితంగా గమనించడం, ఆధారాలు సేకరించి అభ్యర్థి వారీగా రికార్డులలో ఖర్చుల వివరాలను నమోదు చేస్తారు. పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేసే అభ్యర్థులు రూ.78 లక్షలు, శాసనసభకు పోటీ చేసేవారు రూ.28 లక్షల వరకు వ్యయం చేయవచ్చు. ఎన్నికల కమిషన్ నిర్ణయించిన ఖర్చును మించి ఎక్కువ ఖర్చు చేస్తే అనర్హత వేటు పడే ప్రమాదం ఉంది. నామినేషన్ల అనంతరం పోటీ చేసే అభ్యర్థులు ప్రచారంలో చేసే ఖర్చుల వివరాలను ప్రతి మూడు రోజులకోసారి రిటర్నింగ్ అధికారికి, వ్యయ పరిశీలకులకు సమర్పించాల్సి ఉంది.

అభ్యర్థులు సమర్పించిన ఖర్చుల వివరాలను తమ దగ్గర ఉన్న షాడో రిజిస్టర్‌లో నమోదు చేసిన వాటితో సరిచూస్తారు. ఆధారాలతో సహా సేకరించిన ఖర్చుల వివరాలు అభ్యర్థులు చూపిన ఖర్చుల్లో లేకపోతే వెంటనే నోటీసులు ఇస్తారు. వీటికి విధిగా జవాబు ఇవ్వాల్సి ఉంది. 2004, 2009 ఎన్నికలతో పోలిస్తే ఈసారి వ్యయంపై నిఘా పెరిగిందనేది సుస్పష్టం. అయితే అధికారులు లెక్కిస్తున్న ధరలు కాస్తా ఎక్కువగా నిర్ణయించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ రేట్లపై రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
Advertisement