సర్టిఫికెట్ల పరిశీలనకు సర్వం సిద్ధం | Sakshi
Sakshi News home page

సర్టిఫికెట్ల పరిశీలనకు సర్వం సిద్ధం

Published Wed, Sep 25 2019 10:01 AM

Officers Are Completed Arrangements For Grama Sachivalaya Certificate Verification In Kurnool - Sakshi

సాక్షి, కర్నూలు(అర్బన్‌) : జిల్లాలో సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా పరిషత్‌ ప్రాంగణంలోని డీపీఆర్‌సీ భవనం, విశ్వేశ్వరయ్య భవన్‌ (పీఆర్‌ ఎస్‌ఈ కార్యాలయం), మండల పరిషత్‌ సమావేశ భవనంలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ప్రత్యేకంగా ఫ్లెక్సీలు, సైన్‌ బోర్డులు ఏర్పాటు చేశారు. విశ్వేశ్వరయ్యభవన్‌లో కేవలం ఇంజినీరింగ్‌ అసిస్టెంట్, కర్నూలు మండల పరిషత్‌ సమావేశ భవనంలో వీఆర్‌ఓ, విలేజ్‌ సర్వేయర్‌ గ్రేడ్‌–3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. మిగిలిన 16 రకాల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన డీపీఆర్‌సీ భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర్, ఫస్ట్‌ ఫ్లోర్‌లలోని గదుల్లో నిర్వహించనున్నారు. అన్ని గదులకు ముందు భాగంలో అందులో  ఏ పోస్టుకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ జరుగుతుందనే విషయాన్ని సైన్‌బోర్డులపై ముద్రించి గోడలకు అతికించారు. ఒక్కో గదిలో నాలుగుకు మించి టేబుళ్లను ఏర్పాటు చేశారు. వరండాలోనూ అభ్యర్థులు కూర్చునేందుకు వీలుగా కుర్చీలను వేశారు.  ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు  వచ్చే అవకాశం ఉన్నందున డీపీఆర్‌సీ భవనం ముందుభాగంలో పెద్ద షామియానాలు ఏర్పాటు చేశారు. విశ్వేశ్వరయ్య భవన్, మండల పరిషత్‌ సమావేశ భవనం ప్రాంతాల్లోనూ అభ్యర్థులు కూర్చునేందుకు వీలుగా షామియానాలు, కుర్చీలు వేశారు. ఆయా భవనాల్లో టాయిలెట్లను శుభ్రం చేయడంతో పాటు పలు ప్రాంతాల్లో తాగునీటి వసతి కల్పిస్తున్నారు. 

14 రకాల పోస్టులకు షార్ట్‌లిస్ట్‌లు   
సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం 19 రకాల పోస్టులకు గాను మంగళవారం సాయంత్రానికి 14 రకాల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో షార్ట్‌ లిస్ట్‌లను రూపొందించి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఈ నెల 23న విలేజ్‌ ఫిషరీస్‌ అసిస్టెంట్, విలేజ్‌ సెరికల్చర్‌ అసిస్టెంట్స్‌ షార్ట్‌లిస్ట్‌ను అప్‌లోడ్‌ చేసిన అధికారులు.. 24వ తేదీ సాయంత్రానికి ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ (గ్రేడ్‌–2), పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌–6 (డిజిటల్‌ అసిస్టెంట్‌), విలేజ్‌ హార్టికల్చర్‌ అసిస్టెంట్, అనిమల్‌ హజ్‌బెండరీ అసిస్టెంట్, విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్‌ (గ్రేడ్‌–2 ), విలేజ్‌ సర్వేయర్‌ గ్రేడ్‌–3, వార్డు శానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీ, వార్డు అమెనిటీస్‌ సెక్రటరీ, వార్డు ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్‌ అండ్‌ డాటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ, వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ పోస్టులకు సంబంధించి షార్ట్‌ లిస్ట్‌లను సిద్ధం చేశారు. 

ఐదు రకాల పోస్టులకు కొనసాగుతున్న ప్రక్రియ  
14 రకాల పోస్టులకు షార్ట్‌లిస్ట్‌లను విడుదల చేసిన అధికారులు మిగిలిన ఐదు రకాల పోస్టులైన పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌–5, వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్, మహిళా పోలీస్‌– ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ అసిస్టెంట్, ఏఎన్‌ఎం/మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (ఫిమేల్‌ ) గ్రేడ్‌–3,  విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌–2 పోస్టులకు షార్ట్‌లిస్టులను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఏఎన్‌ఎం/మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (ఫిమేల్‌ ) గ్రేడ్‌–3,  విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌–2 పోస్టులకు సంబంధించి వెయిటేజీ మార్కులు కలిపి షార్ట్‌లిస్టులు అప్‌లోడ్‌ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఆ దిశగా ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన షార్ట్‌లిస్టులలో  అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌ నంబర్లను చూసుకుని.. కాల్‌లెటర్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కాల్‌లెటర్లలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఏ తేదీన, ఎక్కడ హాజరు కావాలనే విషయాలను పొందుపరిచారు.  

నేడు మూడు రకాల పోస్టులకు వెరిఫికేషన్‌ 
24 విలేజ్‌ ఫిషరీస్‌ అసిస్టెంట్, 11 విలేజ్‌ సెరికల్చర్‌ అసిస్టెంట్, 770 అనిమల్‌ హజ్‌బెండరీ అసిస్టెంట్‌ పోస్టులకు బుధవారం సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. స్థానిక డీపీఆర్‌సీ భవనంలో చేపట్టనున్నారు. 

వీఆర్‌ఓ పోస్టులకు కటాఫ్‌ మార్కులు 
జిల్లాలో మొత్తం 224 విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్‌ (వీఆర్వో) పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ పోస్టులకు సంబంధించి రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, రోస్టర్‌ ప్రకారం సంబంధిత అధికారులు ప్రకటించిన కటాఫ్‌ మార్కులు ఇలా ఉన్నాయి. బీసీ–ఏ లోకల్‌ 85.75, బీసీ–ఏ (ఉమెన్‌) 67, బీసీ–బీ 87, బీసీ–బీ (ఉమెన్‌) 58, బీసీ–సీ 71, బీసీ–సీ (ఉమెన్‌ ) 71, బీసీ–డీ 82, బీసీ–డీ (ఉమెన్‌) 60, బీసీ–ఈ 85, బీసీ–ఈ (ఉమెన్‌) 62, ఓసీ 91, ఓసీ (ఉమెన్‌) 71, ఎస్‌సీ 82, ఎస్‌టీ 71 మార్కులు.   

1/1

అభ్యర్థులు వేచి ఉండేందుకు వీలుగా సిద్ధం చేస్తున్న షామియానాలు

Advertisement

తప్పక చదవండి

Advertisement