పేట పోలీసులకు అది కాళరాత్రి..! | October 21st Police Memorial Day Celebrations In Guntur | Sakshi
Sakshi News home page

పేట పోలీసులకు అది కాళరాత్రి..!

Oct 21 2018 1:52 PM | Updated on Oct 21 2018 1:52 PM

October 21st Police Memorial Day Celebrations In Guntur - Sakshi

మావోయిస్టుల దాడిలో అమరులైన పోలీసులు, ర్యాలీ నిర్వహిస్తున్న పోలీసులు, విద్యార్థులు (ఫైల్‌)

చిలకలూరిపేట : విధినిర్వహణలో భాగంగా పోలీసులు చేసిన త్యాగాలను గుర్తుచేసుకొనేందుకు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ పోలీసు శాఖ ప్రతి ఏటా అక్టోబర్‌ 21న పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. దేశరక్షణలో సైనికుల మాదిరి, దేశ అంతర్గత భద్రత పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమైనది. పోలీసుల అమరవీరుల స్మరణకు వచ్చినప్పుడల్లా రాష్ట్ర చరిత్రలో సంచలనం కలిగించిన చిలకలూరిపేట పోలీస్‌స్టేషన్‌పై దాడి, ఈ సంఘటనలో అమరులైన వారు గుర్తురాకమానరు.

అంతా నిమిషాల వ్యవధిలోనే...
2005 మార్చి 11వ తేదీ రాత్రి సుమారు 11 గంటల సమయంలో  చిలకలూరిపేట పోలీసు స్టేషన్‌పై మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. సుమారు 40 మంది మావోయిస్టులు మూడు గ్రూపులుగా  ఏర్పడి ఈ విధ్వంసానికి దిగారు. పోలీసు స్టేషన్‌ చుట్టూ వలయంగా ఏర్పడిన కొంతమంది రాకపోకలను నిలిపివేశారు. మరికొంతమంది పోలీసు స్టేషన్‌లోకి ప్రవేశించారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ సమయంలో అప్పటి సీఐ ఆర్‌.ప్రసాద్, ఎస్‌ఐ ధర్మేంద్రబాబు కలిసి పోలీసు స్టేషన్‌ పై అంతస్తులో  ఓ కేసు విషయంలో విచారణ నిర్వహిస్తున్నారు. మావోయిస్టులకు  ప్రధాన  టార్గెట్‌గా ఉన్న ఎస్‌ఐ ధర్మేంద్రబాబు కోసం ఈ దాడికి పాల్పడ్డారు.

దాడి జరుగుతున్న విషయం పసిగట్టిన సీఐ, ఎస్‌ఐ ఇద్దరూ కిందికి వచ్చే క్రమంలో మావోయిస్టుల టార్గెట్‌గా ఉన్న  ఎస్‌ఐ  ధర్మేంద్రబాబు ప్రహరీ దూకి  తప్పించుకున్నారు. పోలీసుస్టేషన్‌ వెనుక భాగంలో ఉన్న తన క్వార్టర్స్‌ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సీఐ ప్రసాద్‌  మావోయిస్టుల తూటాలకు నేలకొరిగారు. మావోయిస్టులు అత్యాధునిక ఏకే –47, ఎస్‌ఎల్‌ఆర్‌ ఆయుధాలతో దాడి చేసిన క్రమంలో పోలీసులకు ఎదురుకాల్పులు జరిపే అవకాశం కూడా దక్కలేదు. సీఐతో పాటు హెడ్‌కానిస్టేబుల్‌ జీఎస్‌ఆర్‌ మోహనరావు, కానిస్టేబుల్‌ ఎస్‌ ఉమర్, హోంగార్డు ఆర్‌ వెంకటేశ్వర్లు ఇదే దాడిలో మావోల తూటాలకు బలయ్యారు. సీఐ కోసం పోలీసు స్టేషన్‌కు వచ్చి ఉన్న ఆయన మిత్రుడు కె.వీరారెడ్డి, పరీక్ష పేపర్ల కోసం వచ్చిన సీఆర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల అటెండర్‌  బత్తుల హనుమంతరావు కూడా ఈ కాల్పుల్లో మృతి చెందారు. ఎస్‌ఐ ధర్మేంద్రబాబు  కోసం వెతికే క్రమంలో ఆయన క్వార్టర్స్‌లోకి ప్రవేశించేందుకు సాయుధ నక్సలైట్లు ప్రయత్నించారు.

క్వార్టర్‌ ప్రధాన ద్వారం మూసి ఎస్‌ఐ తల్లి ఉమామహేశ్వరిదేవి తలుపు వెనుక నిలబడ్డారు. లోనికి ప్రవేశించేందుకు మావోయిస్టులు కాల్పులు జరపటంతో చెక్కతలుపు వెనుక ఉన్న ఆమె తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందారు.  ఈ క్రమంలోనే ఇదే ప్రాంగణంలో ఉన్న రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ సిబ్బందిని పలువురిని, మావోయిస్టులు తాళ్లతో కట్టివేసి గ్రెనేడ్‌ను జారవిడిచారు. అయితే అదృష్టవశాత్తు అది పేలకపోవటంతో మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు. ఇదంతా కొన్ని నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది. ఆ రాత్రి చిలకలూరిపేట ప్రజలకు కాళరాత్రిలా ఇప్పటికీ గుర్తుకువస్తూనే ఉంటుంది. నాటి పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఏటా వారి స్పూర్తితో విధులు నిర్వహిస్తామని ప్రతినబూనుతారు. అమరవీరులకు శ్రద్దాంజలి ఘటిస్తూ రక్తదానం, ఓపెన్‌హౌస్, విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, డ్రాయింగ్‌  పోటీలు ప్రతిఏటా నిర్వహిస్తూ వస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement