ఇదేమి పద్ధతి | Sakshi
Sakshi News home page

ఇదేమి పద్ధతి

Published Mon, Jan 26 2015 3:11 AM

ఇదేమి పద్ధతి - Sakshi

సాక్షి, కడప : వైఎస్సార్ జిల్లా అవసరాలకు సంబంధించి మంజూరైన యూరియాను ఇక్కడి రైతుల పొట్టకొట్టి నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు తరలించుకుపోవడం ఏమిటని ఎంపీ అవినాష్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వర్షాభావంతో పంటలు ఎండుతున్న నేపధ్యంలో వాటిని కాపాడుకోవడానికి అనేక అవస్థలు పడుతూనే మరోపక్క యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్న వైఎస్సార్ జిల్లా రైతులను విస్మరించి ఇతర ప్రాంతాలకు తరలించడం సరికాదన్నారు.

వ్యవసాయ పంటలకు సంబంధించి యూరియా అవసరం చాలా ఉందని...ప్రభుత్వం మాత్రం యూరియా కొరత లేదని ప్రకటనలు గుప్పిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. వెంటనే జిల్లాకు యూరియాను పంపించి ఎటువంటి కొరత రైతులకు రాకుండా చూడాలన్నారు.  ఆదివారం కడపలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి ఆయన రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ మధుసూదన్‌రావు, జిల్లా జాయింట్ డెరైక్టర్ జ్ఞానశేఖర్‌లతో టెలిఫోన్‌లో సంభాషించారు. ప్రభుత్వ మాటలకు, చేతలకు పొంతన కుదరడం లేదని...వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
 
జిల్లాలో రబీలో సాగు చేసిన పంటలకు సంబంధించి రైతులకు యూరియా కొరత వేధిస్తోందని, ప్రభుత్వం సక్రమంగా సరఫరాచేయకపోవడంతో రైతన్న సతమతమవుతున్నాడన్నారు. అధికారులు యూరియాపై పెద్దగా పట్టించుకోకపోవడంతో సమస్య జఠిలమవుతోందని....వేలాది మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా, పదుల సంఖ్యలో కూడా రాకపోవడం ఏమిటని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
 
బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా చర్యలు తీసుకోండి
ప్రస్తుతం యూరియా ఎక్కడా లభించకపోవడంతో కొంతమంది డీలర్లు బ్లాక్ మార్కెట్‌లో రైతన్నలను నిలువుదోపిడీ చేస్తున్నారని....రూ. 283 విలువ చేసే యూరియా బస్తాను రూ. 350 నుంచి రూ. 400 వరకు వెచ్చించి కొనుగోలుచేయాల్సి వస్తోందని ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కేవలం ఇదంతా ప్రభుత్వం సక్రమంగా యూరియా సరఫరాచేయకపోవడం వల్లనే సమస్య ఎదురవుతోందని ఆయన తెలియజేశారు.

బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా చర్యలు తీసుకోవడంతోపాటు వెంటనే యూరియా కొరత లేకుండా చూడాలని ఆయన కోరారు. జిల్లాలోని ప్రొద్దుటూరు, మైదుకూరు, రాజంపేట, కమలాపురం, కడప తదితర ప్రాంతాలలో వరి పంటలు సాగులోఉన్నాయని..అక్కడికి లారీల్లో నుంచి సరుకు దించుతుండగానే అయిపోతుందంటే యూరియాకు ఎంత డిమాండ్ ఉందో ఇట్టే అర్థమవుతోందన్నారు.
 
ఒకటి,రెండు రోజుల్లో జిల్లాకు యూరియా
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి జిల్లాలో యూరియా కొరత నివారించాలని, వెంటనే వేలాది మెట్రిక్ టన్నుల యూరియాను పంపించాలని కమిషనర్, జేడీలను కోరిన నేపధ్యంలో వారు సానుకూలంగా స్పందించారు.
 కేవలం ఒకటి, రెండు రోజుల్లోనే జిల్లాకు అవసరమైన యూరియాను  సరఫరాచేస్తామని వైఎస్ అవినాష్‌కు హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement