
వానాకాలం పంటలపై యూరియా కొరత ప్రభావం
సాక్షి ప్రతినిధి, వరంగల్/నెట్‌వర్క్ : రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత పర్యవసానాలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. వానాకాలంలో పంటలు వేసిన మెజారిటీ రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలంలో యూరియా అందకపోవడంతో మొక్కజొన్న కంకులు ఎదగడం లేదు. పత్తి చేలల్లో పూత కన్పించడం లేదు. వరి ఎర్రబారిపోతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే పంటలకు తీవ్ర నష్టం తప్పదని, పెట్టుబడి సైతం దక్కకుండా పోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పంటల ఎదుగుదల సమయంలో యూరియా కొరత దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందంటూ వాపోతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు కూడా పంటల ఎదుగుదల నుంచి దిగుబడి వరకు అన్నింటిపై యూరియా కొరత ప్రభావం ఉంటుందని చెబుతుండటం గమనార్హం.
అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి
వానాకాలం ఆరంభం నుంచే మొదలైన యూరియా కొరత.. ఇప్పుడు ప్రధాన పంటలైన పత్తి, వరి, మొక్కజొన్నలకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ‘సాక్షి నెట్‌వర్క్’ జరిపిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ అంశాలు వెలుగుచూశాయి. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, కామారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట, మెదక్, మహబూబ్‌నగర్, అదిలాబాద్ తదితర జిల్లాల్లో రైతులు ఎదుగూ బొదుగు లేని పంటలను చూసి గుండెలు బాదుకుంటున్నారు.
ఆకుపచ్చగా ఉండాల్సిన పంటలు ఎర్రబారి, పసుపుపచ్చగా కన్పిస్తున్నాయి. యూరియా సరైన సమయంలో అంది ఉంటే.. పంటలు పచ్చగా ఉండి ఏపుగా పెరిగేవని రైతులు అంటున్నారు. కానీ సకాలంలో వేయకపోవడంతో వరి, పత్తి పంటలు దెబ్బతింటున్నాయని, వరి పైరులో ఆశించిన స్థాయిలో ఎదుగుదల లేదని, పచ్చదనం కూడా కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల మున్ముందు చీడపీడలు సైతం ఎక్కువగా సోకే ప్రమాదం ఉందని రైతులతో పాటు అధికారులుచెబుతున్నారు.
వరి.. ఎదిగితే ఒట్టు!
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రైతు ఇస్తారిగల్ల ఆశోక్ 12 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నాడు. ఆగస్టు 8న వరి నాట్లు వేయగా అప్పటి నుంచి యూరియా లభించక పోవడంతో చల్లలేదు. దీంతో ఈ సమయానికి ఏపుగా పెరగాల్సిన వరి.. నాట్లు వేసినప్పుడు 8 అంగుళాల ఎత్తు ఉండగా.. నెల రోజుల తర్వాత కూడా అదే విధంగా ఉంది. ఎదుగు లేదు.. బొదుగు లేదు.
యూరియా కోసం 10 సార్లు క్యూలో నిల్చున్నా దొరకలేదు. దీంతోరూ. 950 చొప్పున 13 అమ్మోనియా బస్తాలు కొని చల్లినట్టు చెప్పాడు. ఇప్పటికే రూ.2 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టానని.. మొత్తం నష్టపోయే పరిస్థితి ఉందని వాపోతున్నాడు.
పత్తి చేను దున్నేస్తా..
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేటకు చెందిన రైతు ఇడంపాక స్వామికి మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. రెండు ఎకరాల్లో పత్తి, ఒక ఎకరంలో పసుపు పంట సాగు చేస్తున్నాడు. పంట ఎదుగుదల సమయంలో సరిపడా యూరియా దొరకడం లేదు. యూరియా కోసం నెక్కొండ.. రెడ్లవాడ పీఏసీఎస్‌ల వద్ద వెళ్లినా దొరకలేదు. మరో వారం రోజులు చూసి పత్తి చేను దున్ని మొక్కజొన్న సాగు చేస్తానని అంటున్నాడు. ఇప్పటివరకు ఎకరా పత్తికి రూ.20 వేల చొప్పున చేసిన రూ.40 వేలు ఖర్చు వృధా అయినట్టేనని వాపోతున్నాడు.
మూడు పంటలకు ఒక్క బస్తా దొరికింది
నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. ఒకఎకరంలో వరి, ఒక ఎకరంలో పత్తి, మరోఎకరంలో మిరప వేశా. వీటికి అవసరమైన యూరియా కోసం 15 రోజుల పాటు కాళ్లరిగేలా తిరిగా. కేవలం ఒకే ఒక బస్తా యూరియా దొరికింది. దీంతో వరి పంటఎదుగుదల లేక గిడస బారింది. మిరప పంట వేసి 40 రోజులైంది. ఇప్పటికి కనీసం రెండు అడుగుల ఎత్తు ఎదగాలి. కానీ ఒక్క అడుగు కూడా ఎదగలేదు. – పులిచింత మల్లేష్ , రైతు,దేవబండ గ్రామం, అయిజ, జోగుళాంబ గద్వాల
పంటలకు అన్నివిధాలా మేలు చేస్తుంది
యూరియా అనేది పంటలకు నత్రజనిని అందించే ఎరువు. అన్ని రకాల నేలలకు, వివిధ పంటలకు ఇది అనుకూలంగా ఉంటుంది. త్వరగా నీటిలో కరిగిపోతుంది కాబట్టి మొక్కలకు నత్రజని వేగంగా అందుతుంది. దీనివల్ల ఎక్కువ సంఖ్యలో పిలకలు ఏర్పడతాయి. మొక్కలు, కాండాలు బలంగా, వేగంగా పెరుగుతాయి.
తద్వారా పంటలు దృఢంగా ఉంటాయి. అలాగే మొక్కలు ఆకుపచ్చగా మారేందుకు, వాటి ఎదుగుదలకు యూరియా ఉపకరిస్తుంది. వెన్నులు బాగా రావడానికి సహాయ పడుతుంది. వీటన్నిటి వల్ల అధిక దిగుబడి వస్తుంది. అందుకే రైతులు ఎక్కువగా యూరియా వినియోగానికి మొగ్గు చూపుతారు. – డాక్టర్ అనిల్‌కుమార్,భువనగిరి ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త
దిగుబడిపై తీవ్ర ప్రభావం
తొలి దశలో యూరియా కొరత వల్ల వరి సాధారణ దిగుబడితో పోల్చితే 25–35 శాతం తగ్గే అవకాశం ఉంటుందని అంచనా. కాగా ఈ కొరత ఇలాగే కొనసాగితే మరో 10 శాతం వరకు దిగుబడి తగ్గే అవకాశం ఉంటుందనే ఆందోళన రైతుల్లో వ్యక్తం అవుతోంది. ‘వానాకాలంలో సీజన్‌లో వరికి సాధారణంగా మూడు దఫాల్లో యూరియా చల్లుతాం.. ఇప్పటికి ఒక్కసారే వేశాం. కొద్దిమంది ఇప్పుడిప్పుడే రెండుసార్తు వేస్తున్నారు.
కానీ మెజార్టీగా రైతులకు యూరియా పాట్లు తప్పడం లేదు..’ అని వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల పేటకు చెందిన రైతు యాళ్ల సుధాకర్‌రెడ్డి చెప్పారు. వరినాట్లు వేసిన 20–25 రోజుల్లో ఒకసారి, 45 రోజుల్లో రెండోసారి, 65–70 రోజుల్లో మూడోసారి యూరియా చల్లాల్సి ఉండగా.. గత రెండు మాసాలుగా యూరియాకు తీవ్ర కొరత నెలకొందని రైతులు చెబుతున్నారు.