ఆర్వీఎం పీవోగా శ్రీనివాస్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

ఆర్వీఎం పీవోగా శ్రీనివాస్‌రెడ్డి

Published Tue, Jan 7 2014 2:02 AM

now rajiv vidya mission po srinivas reddy

 ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం) రెగ్యులర్ పీవోగా కరీంనగర్ జిల్లా పెద్దపెల్లి ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు రోజుల కిందట కలెక్టర్ అహ్మద్‌బాబు ఆర్వీఎం పీవోగా విధులు నిర్వహిస్తున్న పెర్క యాదయ్యను తప్పించి వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ నారాయణకు బాధ్యతలు అప్పగించారు. పదిహేను నెలల్లో తొమ్మిది మంది పీవోలు మారగా, మళ్లీ సోమవారం రెగ్యులర్ పీవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇదివరకు రెగ్యులర్ పీవోగా పనిచేసిన విశ్వనాథ్ బదిలీ అయిన తర్వాత పీవోలుగా పరిశ్రమల శాఖ మేనేజర్ రవీందర్, జెడ్పీ సీఈవో వెంకటయ్య, ఆర్డీవో రవినాయక్‌లు ఇన్‌చార్జి పీవోలుగా పనిచేశారు. ఆ తర్వాత మెప్మా పీడీ రాజేశ్వర్ రాథోడ్, సీపీవో షేక్ మీరాకు బాధ్యతలు అప్పగించినప్పటికీ వారు తిరస్కరించారు. ఆ తర్వాత ఎస్సీ కార్పొరేషన్ ఏడీ పెర్క యాదయ్యను అప్పటి కలెక్టర్ అశోక్ నియమించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో కలెక్టర్ అహ్మద్‌బాబు యాదయ్యను తప్పించి నారాయణను నియమించారు. బాధ్యతలు అప్పగించి రెండు రోజులు గడవకముందే ప్రభుత్వం రెగ్యులర్ పీవోను నియమించింది.
 
 ఆర్వీఎం గాడిలో పడేనా?
 ఆర్వీఎంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. పరిపాలన గాడి తప్పింది. ఇప్పటికైనా రెగ్యులర్ పీవోగా నియామకమైనా శ్రీనివాస్‌రెడ్డి గాడిలో పెట్టేనా అని పలువురు చర్చించుకుంటున్నారు.  
 
 

Advertisement
Advertisement