రచ్చబండ.. ప్రచారమే అజెండా! | 'No Rachachabanda.. Only Campaign agenda' | Sakshi
Sakshi News home page

రచ్చబండ.. ప్రచారమే అజెండా!

Nov 18 2013 2:34 AM | Updated on Sep 2 2017 12:42 AM

రచ్చబండ రాజకీయం అవుతోంది. అంతా అధికార పార్టీ మార్కుతోనే జరుగుతోంది. ఇది ప్రభుత్వ కార్యక్రమమా? లేక కాంగ్రెస్ పార్టీ సమావేశమా

విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రచ్చబండ రాజకీయం అవుతోంది. అంతా అధికార పార్టీ మార్కుతోనే జరుగుతోంది. ఇది ప్రభుత్వ కార్యక్రమమా? లేక కాంగ్రెస్ పార్టీ సమావేశమా? అన్న సందిగ్ధత ప్రజల్లో నెలకొంటోంది. వాస్తవానికి ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల నుంచి తేదీలు తీసుకోవాలని సూచించినప్పటికీ.. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నచోట అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకే తేదీలు నిర్ణయిస్తున్నారు. రెండేళ్లుగా ప్రజల సంక్షేమం పట్టని సర్కారు.. ఎన్నికల వేళ ప్రజల్లో కాంగ్రెస్ మార్కుకోసం  రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాలు ఎలా ఉన్నప్పటికీ జిల్లాలో రచ్చబండ జరుగుతున్న తీరు విమర్శలపాలవుతోంది. ప్రజల సమస్యలను విన్నవించేందుకు రచ్చబండకు వెళ్తున్న నాయకులను సైతం అడ్డుకోవడం విస్మయానికి గురి చేస్తోంది.
 
 వాస్తవానికి గ్రామీణప్రాంత ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి రచ్చబండ కార్యక్రమానికి స్వీకారం చుట్టారు.అయితే ప్రస్తుత పాలకులు ఆ కార్యక్రమాన్ని ప్రజా సమస్యల కంటే పార్టీ ప్రచారానికి వేదికలుగా మల్చుకుంటున్నారు. కమిటీ సభ్యులతోపాటూ అంతా అధికార పార్టీ నేతల సూచనల మేరకే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా జరుగుతోంది. వేదికలను సైతం అధికార పార్టీ నేతలు తమ ప్రచారానికి, రాజకీయ ప్రసంగాలకు అనుకూలంగా మల్చుకుంటున్నారు. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్న చోట సైతం వారికి తెలియకుండానే రచ్చబండ తేదీలు నిర్ణయించడం గమనార్హం. విజయనగరంలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పూసపాటి అశోక్‌గజపతిరాజు ప్రమేయం లేకుండానే తేదీలు ప్రకటించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రచ్చబండ సభల్లో కొంతమందికి మాత్రమే రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేసి చేతులు దులుపుకొంటున్నారు. కనీసం సామాజిక సమస్యలపైనైనా దృష్టి సారించకపోవడం పట్ల ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
 
 8 మండలాల్లో రచ్చబండ పూర్తి..
 జిల్లాలో ఈ నెల 11 నుంచి ప్రారంభమైన రచ్చబండ సాలూరు మున్సిపాలిటీతోపాటు, ఎనిమిది మండలాల్లో పూర్తయింది. 114 గ్రామ పంచాయతీలతోపాటు 29 వార్డుల్లో ర చ్చబండ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. పూర్తయిన వాటిలో గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, రామభద్రపురం, కొమరాడ, జియ్యమ్మవలస, పార్వతీపురం, మక్కువ, నెల్లిమర్ల మండలాలు ఉన్నాయి.
 
 వేలాది వినతులు..
 రచ్చబండ కార్యక్రమాల్లో పలు సమస్యల పరిష్కారం కోరుతూ వే లాది వినతులు అందాయి. కొత్తగా రేషన్ కార్డుల కోసం 7,348 దరఖాస్తులు, పింఛన్ల కోసం 5,378, ఇళ్ల కోసం 6,630 దరఖాస్తులు అందాయి. అయితే ఈ వినతుల పరిష్కారంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరు మాసాల్లోపు సాధారణ ఎన్నికలు వస్తున్న వేళ.. ప్రస్తుతం ఇస్తున్న దరఖాస్తులకు  మోక్షం లభిస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న రచ్చబండ కార్యక్రమం ఎటువంటి ప్రాధాన్యతా లేకుండా ప్రచారమే అజెండాగా జరుగుతోంది. కొంతమంది లబ్ధిదారులను తీసుకొచ్చి ‘మమా’ అనిపించేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement