భారత నావికులకు వలపు వల

Navy Personnel Arrested On Spying Charge - Sakshi

పాకిస్తాన్‌కు భారత నౌకాదళ రహస్య సమాచారం చేరవేత

హనీట్రాప్‌లో చిక్కిన ఏడుగురి సెయిలర్ల అరెస్ట్‌

ఈ ఏడాది జనవరిలో.. ఫేస్‌బుక్‌లో అనితా చోప్రా అనే పాక్‌ యువతి వేసిన వలలో ఆర్మీ జవాన్లు చిక్కుకుని మన సైనిక సమాచారాన్ని శత్రు దేశానికి చేరవేసిన ఘటన ప్రకంపనలు సృష్టించింది. దాయాది దేశమైన పాకిస్తాన్‌ భారత నౌకాదళ సమాచారాన్ని దోచుకున్న వైనం తాజాగా వెలుగు చూసింది. భారత నావికులకు ఫేస్‌బుక్‌ ద్వారా అమ్మాయిల్ని పరిచయం చేసి.. వారితో ఏకాంతంగా ఉన్నప్పటి సెక్స్‌ వీడియోలు తీసిన పాక్‌ గూఢచారి విభాగం.. వాటితో బెదిరింపులకు పాల్పడి.. నౌకాదళ సమాచారం సేకరిస్తూ దేశద్రోహ చర్యలకు పాల్పడింది. దీనిపై ఉప్పందడంతో నిఘా వర్గాలు నెల రోజుల పాటు నిర్వహించిన ‘ఆపరేషన్‌ డాల్ఫిన్‌ నోస్‌’లో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఏడుగురు ఇండియన్‌ నేవీ సెయిలర్స్‌ (నావికులు)తో పాటు ఒక హవాలా ఆపరేటర్‌ను అరెస్ట్‌ చేశారు.

హనీట్రాప్‌ ఇలా!
నౌకాదళ సమాచారాన్ని తెలుసుకునేందుకు శత్రు దేశమైన పాకిస్తాన్‌ కుట్ర పన్నింది. ఇందుకు 2017లో భారత నావికులను లక్ష్యంగా చేసుకుంది. ఫేస్‌బుక్‌ను ఉపయోగించుకుని కొందరు యువతులతో హనీ ట్రాప్‌ (వలపు వల) వేసింది. ఇలా కొందరు యువతులు ఫేస్‌బుక్‌ ద్వారా నావికులతో పరిచయం పెంచుకున్నారు. తాము వ్యాపార వేత్తలమంటూ వారు నావికుల్ని నమ్మించి వారితో శారీరక సంబంధం వరకు వెళ్లారు. నావికులతో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో పాక్‌ ఏజెంట్లు ఆ దృశ్యాలను రహస్యంగా వీడియోలు చిత్రీకరించారు. వాటిని చూపించి పాక్‌ గూఢచర్య విభాగం భారత నావికుల్ని బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలు పెట్టింది. భారత నౌకాదళ సమాచారం తమకు చేరవేయాలని, ఇందుకు ప్రతిఫలంగా హవాలా ద్వారా సొమ్ము కూడా ఇస్తామని ఆశ చూపడంతో నేవీ సెయిలర్స్‌ వారికి లొంగిపోయారు.

ఏడాది నుంచి సమాచారం
ఈ సెయిలర్స్‌ 2018 అక్టోబర్‌ నుంచి పాకిస్తాన్‌కు సమాచారం అందించడం ప్రారంభించినట్లు నిఘా వర్గాలు గుర్తిం చాయి. యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్ల సమాచా రాన్ని శత్రు దేశానికి చేరవేసినట్లు సమాచారం. ఏ యుద్ధ నౌక ఎక్కడ ఉంది, వివిధ జలాంతర్గాముల ప్రెజెంట్‌ స్టేటస్‌ ఏమిటి.. తదితర కీలక సమాచారం సెయిలర్లు దాయాది దేశానికి చేరవేశారు. సమాచారం ఇచ్చిన ప్రతి నెలా వారికి పాక్‌ ఏజెంట్లు హవాలా రూపంలో డబ్బులు అందజేసేవారు. ఇందుకోసం ఒక హవాలా ఆపరేటర్‌ను సైతం నియమించారు. ఒకరికి తెలియకుండా మరొకరి ద్వారా ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారు.

‘ఆపరేషన్‌ డాల్ఫిన్‌ నోస్‌’తో బట్టబయలు
భారత నౌకాదళంలో కొందరు దేశద్రోహులున్నారని అధికారిక వర్గాలకు రహస్య సమాచారం అందింది. నౌకాదళ నిఘా వర్గాలు 4 నెలల క్రితం ఓ సెయిలర్‌ ఫోన్‌ మాట్లాడుతుండగా.. రహస్య సమాచారాన్ని చేరవేస్తున్నట్లు గుర్తించాయి. దీనిపై  దర్యాప్తు చేపట్టాయి. మిగిలిన వారిపైనా నిఘా పెంచగా.. ఏడుగురు నావికులు వేర్వేరు మహిళలతో మాట్లాడుతున్నట్లు గుర్తించారు. వారి ఫేస్‌బుక్‌ సంభాషణల్నీ గమనించారు. దీంతో ఎన్‌ఐఏ (నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ), ఏపీ ఇంటెలిజెన్స్, సెంట్రల్‌ ఇంటెలిజెన్స్, నేవీ ఇంటెలిజెన్స్‌ సంయుక్తంగా ‘ఆపరేషన్‌ డాల్ఫిన్‌ నోస్‌’ మొదలు పెట్టాయి. హవాలా ద్వారా డబ్బులు తీసుకుంటున్న సమయంలో నావికుల్ని వివిధ ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు.

7 నేవీ సెయిలర్స్‌తో పాటు ఒక హవాలా ఆపరేటర్‌ను శుక్రవారం అరెస్ట్‌ చేశారు. వీరిని గూఢచర్యం కేసులో అరెస్ట్‌ చేసి.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.వారిలో కర్ణాటకకు చెందిన ఇద్దరు, ముంబైకి చెందిన ఇద్దరు, విశాఖకు చెందిన ముగ్గురు నౌకాదళ సిబ్బందితోపాటు ముంబైకి చెందిన ఒక హవాలా ఏజెంట్‌ ఉన్నారు. మరికొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. నిందితుల్ని విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టుకు తరలించగా.. జనవరి 3 వరకూ రిమాండ్‌ విధించినట్లు తెలుస్తోంది. వీరి నుంచి పెద్ద మొత్తం లో హవాలా సొమ్మును  స్వాధీనం చేసుకున్నట్లు  విశ్వసనీయ సమాచారం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top