1980 నుంచి టీడీపీ గెలవలేదు! | Nara Lokesh once again tongue slip | Sakshi
Sakshi News home page

1980 నుంచి టీడీపీ గెలవలేదు!

Mar 15 2019 3:04 AM | Updated on Mar 23 2019 8:59 PM

Nara Lokesh once again tongue slip - Sakshi

మంగళగిరి/తాడేపల్లిరూరల్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేష్‌ మరోసారి తన ప్రసంగంలో తత్తరపాటు పడ్డారు. టికెట్‌ ఆశించిన పార్టీ నాయకుడు గంజి చిరంజీవిని బుజ్జగించడానికి వచ్చిన లోకేష్‌ విలేకరులతో మాట్లాడుతూ..1980వ సంవత్సరం నుంచి మంగళగిరిలో టీడీపీ గెలవలేదని.. నేను గెలవాలో లేదో ప్రజలే నిర్ణయిస్తారంటూ వ్యాఖ్యానించడం పార్టీ నాయకులను కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. 1980లో తెలుగుదేశం  పార్టీయే స్థాపించలేదు కదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటూ పలువురు టీడీపీ నాయకులు లోలోపల మధనపడ్డా లోకేష్‌కు  చెప్పలేకపోయారు. వాస్తవానికి ఎన్టీఆర్‌ పార్టీ స్థాపించింది 1982లో కాగా 1980 సంవత్సరం నుంచే మంగళగిరిలో టీడీపీ గెలవలేదు నేను గెలుస్తానో లేదో ప్రజలే నిర్ణయించాలి అని చెప్పడంతో పార్టీ నాయకులతో పాటు టీడీపీ శ్రేణులు నిరుత్సాహానికి గురయ్యారు. ఇలాంటి మాటలతోనే పార్టీ నష్టపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. మంగళగిరి టీడీపీ అభ్యర్థిగా అధిష్టానం లోకేష్‌ను ప్రకటించడంతో అప్పటివరకు టికెట్‌పై ఆశలు పెట్టుకున్న పలువురు నేతలు కంగుతిన్నారు. దీంతో వారంతా  పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారనే సమాచారంతో లోకేష్‌ అసంతృప్తులను స్వయంగా బుజ్జగించేందుకు గురువారం రాత్రి మంగళగిరి పట్టణం చేరుకున్నారు. టీడీపీ నాయకుడు గంజి చిరంజీవి ఇంటికి చేరుకున్న లోకేష్‌ ఆయనతో ఏకాంతంగా సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ఇక్కడ 1985 నుంచి గెలిచిన చరిత్ర లేకపోయినా.. అధినేత ఆదేశాలతో పోటీ చేస్తున్నానని తెలిపారు.

పద్మశాలీయులకు టికెట్‌ ఇవ్వకుండా మోసం చేసినందున పద్మశాలి సంఘాలు  ఆందోళన బాటపట్టాయని.. వారిని ఎలా సంతృప్తి పరుస్తారని విలేకరులు ప్రశ్నించగా.. ఏ సంఘాలను తృప్తి పరిచేందుకు తాను ఇక్కడకు రాలేదన్నారు. తమ పార్టీ అధినేత ఆదేశంతో పోటీ చేస్తున్నానని, చిరంజీవి రాజకీయ భవిష్యత్తును పార్టీ చూసుకుంటుందని చెప్పారు. మీరు పోటీ చేయాలని ముందే ప్రణాళిక సిద్ధం చేసుకుని ఐటి కంపెనీలను మంగళగిరి చుట్టూ పెట్టారా అని ప్రశ్నించగా, అదేమీ లేదని తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు, మాజీ ఇన్‌చార్జి పోతినేని శ్రీనివాసరావు నివాసాలకు వెళ్లి నేతలను బుజ్జగించారు. కాగా, తమ సామాజిక వర్గానికి రాష్ట్రంలో ఎక్కడా టీడీపీ సీటు కేటాయించకపోవడంతో మంగళగిరి పట్టణానికి చెందిన పద్మశాలీయ సామాజిక వర్గం వారు శుక్రవారం తమ వ్యాపార సముదాయాల బంద్‌కు పిలుపునిచ్చారు. 

భగ్గుమంటున్న బీసీ సంఘాలు..
మంగళగిరి నియోజకవర్గంలో  మొదటి నుంచి బీసీలకు టికెట్‌ ఇస్తామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చెబుతూ వస్తూ..చివరి నిముషంలో  తన తనయుడు నారా లోకేష్‌కు ప్రకటించడంతో   బీసీలతో పాటు ఇతర సామాజిక వర్గాల్లో టికెట్టు ఆశించినవారు డీలా పడ్డారు. ఎప్పుడైతే మంగళగిరి సీటు బీసీలకు లేదని అన్నారో, వెంటనే ఆ సామాజికవర్గానికి చెందినవారు సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడం, సామాజిక మాధ్యమాల ద్వారా గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడినటువంటి గంజి చిరంజీవి జనసేనలోకి వెళ్తున్నారంటూ ప్రచారం చేయడం తదితర పరిణామాలు చోటు చేసుకున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement