ఎవరి సీటుకు ఎసరు?

Nara Lokesh Clears TDP Candidates Kurnool - Sakshi

సాక్షి ప్రతినిధి, కర్నూలు:  రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల కేటాయింపు వ్యవహారం అధికారపార్టీలో కొత్త చర్చను...అంతకు మించిన రచ్చను లేవనెత్తింది. కర్నూలు నియోజకవర్గానికి ఎస్వీ మోహన్‌ రెడ్డిని అభ్యర్థిగా మంత్రి లోకేష్‌ దాదాపుగా ప్రకటించారు. దీనిపై ఇప్పటికే రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్‌ ఒక స్థాయిలో మండిపడగా... మరోవైపు నంద్యాల, ఆళ్లగడ్డ నియోజవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎవరి సీటుకు ఎసరు పడుతుందనే చర్చ అధికారపార్టీలో మొదలైంది. ఒకే కుటుంబానికి మూడు సీట్లు ఇచ్చే అవకాశం లేదని అధికారపార్టీ నేతలే పేర్కొంటున్నారు.

దీంతో ఇప్పటికే కర్నూలు సీటు దాదాపుగా నిర్ణయం కావడంతో మరో సీటు నంద్యాల, ఆళ్లగడ్డలో ఏది కేటాయిస్తారనే చర్చ సాగుతోంది. ముందుచూపుతో ఎస్వీ మోహన్‌ రెడ్డి పావులు కదిపి తన బెర్త్‌ రిజర్వ్‌ చేసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నంద్యాల, ఆళ్లగడ్డలో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా అఖిలప్రియ కొనసాగుతున్నారు. వీరిద్దరిలో ఎవరిపై వేటు పడుతుందోనంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా భారీగా డబ్బులు వెదజల్లడంతో పాటు గెలిచేందుకు సెంటిమెంటు ఆటను కూడా అధికార తెలుగుదేశం పార్టీ బాగా రక్తికట్టించింది. ఇప్పుడు అదే సెంటిమెంటు..అభ్యర్థులకు సంకటంగా మారుతోంది.
 
సెంటిమెంటు పండుతుందా...! 
నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న భూమా నాగిరెడ్డి పార్టీ మారిన కొన్ని నెలల తర్వాత హఠాన్మరణం చెందారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇదే స్థానం నుంచి అదే కుటుంబానికి చెందిన భూమా బ్రహ్మానందరెడ్డిని తెలుగుదేశం పార్టీ నిలబెట్టిన విషయం విదితమే. ఇందుకోసం గత చరిత్రను సైతం ప్రజలకు గుర్తుచేశారు. గతంలో భూమా శేఖర్‌రెడ్డి మరణిస్తేనే నాగిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారని... భూమా నాగిరెడ్డి మరణించడంతో శేఖర్‌రెడ్డి కుమారుడికి ఇవ్వడమే సరైందనే వాదన తీసుకొచ్చారు. అంతేకాకుండా నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా తల్లిదండ్రులు లేని అమ్మాయి అఖిలప్రియ, తండ్రిలేని అబ్బాయి  బ్రహ్మానందరెడ్డి అంటూ తెలుగుదేశం పార్టీ సెంటిమెంటును పండించే ప్రయత్నం చేసింది.

అయితే, ఇప్పుడు అదే సెంటిమెంటును అధికారపార్టీ పాటిస్తుందా? లేదా అన్న విషయం చర్చనీయాంశమవుతోంది. అదే సెంటిమెంటును పాటించి నంద్యాల సీటును బ్రహ్మానందరెడ్డికి, ఆళ్లగడ్డను అఖిలప్రియకు ఇస్తారా అన్న చర్చ అధికారపార్టీలోనే జరుగుతోంది. మరోవైపు.. ఒకే కుటుంబానికి మూడు సీట్లు ఇచ్చే అవకాశమే లేదని ఆ పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. నంద్యాల తమకివ్వాలంటూ ఇప్పటికే ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఒకవేళ సెంటిమెంటును పాటించి బ్రహ్మానందరెడ్డి, అఖిలప్రియకు ఇస్తే ఎస్పీవై రెడ్డితో పాటు ఫరూఖ్‌ వర్గం కూడా సహకరించే పరిస్థితి లేదని సమాచారం. ఈ మొత్తం చర్చ జరిగి ఎక్కడ తనకు ఎసరు వస్తుందనే ముందుచూపుతోనే ఎస్వీ మోహన్‌ రెడ్డి ముందుగానే తన సీటు రిజర్వ్‌ చేసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
  
మూడో సీటు కష్టమే...! 
సెంటిమెంటుతో ఒకే కుటుంబానికి టీడీపీ అధినేత చంద్రబాబు మూడు సీట్లు  కేటాయించేది కష్టమని ఆ పార్టీ నేతలు అంటున్నారు. సెంటిమెంటుతో పార్టీ అధిష్టానం నిర్ణయాలు తీసుకునే అవకాశమే ఉండదనేది వారి అభిప్రాయం. కేవలం ఉప ఎన్నికల కోసమే సెంటిమెంటు ఫ్యాక్టర్‌ను వాడుకున్నారు మినహా... దీని ఆధారంగా వచ్చే ఎన్నికల్లో సీట్లు కేటాయించే అవకాశమేలేదని అంటున్నారు. మరోవైపు అఖిలప్రియ– ఏవీ సుబ్బారెడ్డిల వివాదాల సందర్భంగా సర్వే ప్రకారమే సీటు కేటాయిస్తామంటూ చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తుచేస్తున్నారు. మొత్తం మీద కర్నూలు జిల్లాలో మొదలైన అభ్యర్థుల ప్రకటన వ్యవహారం జిల్లావ్యాప్తంగా అధికారపార్టీలో కొత్త అలజడిని రేపిందని చెప్పవచ్చు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top