క్షీణించిన ఎంపీ వరప్రసాద్‌ ఆరోగ్యం

MP Varaprasad Falls Sick, Reluctant To Stop Indefinite Fast - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హెదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్‌ సీపీ ఎంపీల ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తోంది. శనివారం మేకపాటి ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా తిరపతి ఎంపీ వరప్రసాద్‌ ఆరోగ్యం కూడా క్షీణించింది. ఆయన శనివారం సాయంత్రం నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు.​ దీనితో పాటు డీ హైడ్రేషన్‌కు గురయ్యారు. పలు పరీక్షలు జరిపిన రామ్‌మనోహర్‌లోహియా వైద్యులు పరిస్థితి ఆందోళన కరంగా ఉందని, దీక్ష వెంటనే విరమించాలని వరప్రసాద్‌కు సూచించారు. రక్తంలో షుగర్‌ లెవల్స్‌ 72కు పడిపోయాయని, దీక్ష కొనసాగించడం ప్రమాదకరం అని డా. భల్లా వైద్య బృందం తెలిపింది. 

ఈ పరిస్థితులపై ఏపీ భవన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ స్పందించారు. వైస్సార్‌ సీపీ ఎంపీలు దీక్ష విరమించాలని కోరారు. ఇప్పటికే మేకపాటి ఆరోగ్యం క్షీణించిందని తాజాగా వరప్రసాద్‌ సైతం అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. వైద్యుల సూచన మేరకు దీక్ష విరమించాలని, వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అయితే వైద్యుల విన్నపాన్ని వరప్రసాద్‌ సున్నితంగా తిరస్కరించారు. దీంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన దీక్షాస్థలికి చేరుకున్నారు. బలవంతంగా ఆస్పత్రికి తరలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top