ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయుల ఘర్షణ | MP, MLA, community conflict | Sakshi
Sakshi News home page

ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయుల ఘర్షణ

Nov 11 2013 3:46 AM | Updated on Mar 18 2019 7:55 PM

ఆలేరు నియోజకవర్గంలో ఇప్పటికే రెండు వర్గాలుగా చీలిన కాంగ్రెస్ పార్టీ మరోమారు రోడ్డు న పడింది. ఆత్మకూర్.ఎం మండలకేంద్రంలో ఆదివారం భువనగిరిఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ వర్గీయులు వీరంగం సృష్టిం చారు.

ఆత్మకూరు(ఎం), న్యూస్‌లైన్ : ఆలేరు నియోజకవర్గంలో ఇప్పటికే రెండు వర్గాలుగా చీలిన కాంగ్రెస్ పార్టీ మరోమారు రోడ్డు న పడింది. ఆత్మకూర్.ఎం మండలకేంద్రంలో ఆదివారం భువనగిరిఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ వర్గీయులు వీరంగం సృష్టిం చారు. పరస్పరం ఘర్షణకు దిగా రు. చొక్కాలు పట్టుకొని, కుర్చీలు విసురుకున్నారు. దీంతో సుమారు మూడు గంటలపాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
 
 వివరాల్లోకి వెళితే.. ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు మచ్చ చంద్రమౌళి గౌడ్ గుండాల మండలంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతూ మండల కేంద్రంలోని ఎమ్మెన్నార్ ఫంక్షన్ హాల్‌లో ఆగా రు. ఆయనను కలుసుకునేందుకు  యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీను నాయకత్వంలో సుమారు 120 మంది కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. చంద్రమౌళిగౌడ్ స్థానిక విలేకరులతో మాట్లాడడం ముగియగానే ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ అనుచరులైన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కె. నరేందర్ గుప్తా ఆధ్వర్యంలో కొందరు కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు.  ‘మాకు తెలియకుండా మండలంలో సమావేశం నిర్వహించడానికి మీ రెవరూ’ అంటూ చంద్రమౌళి గౌడ్‌ను నిలదీశారు.
 
 తాను సమావేశం నిర్వహించడం లేదని, కార్యకర్తలను కలుసుకునేందుకు మా త్రమే వచ్చానని చంద్రమౌళిగౌడ్ సమాధానమిచ్చారు. తమ మండలంలో ఎలాంటి సమావేశం పెట్టడానికి వీల్లేదని, ఫంక్షన్ హాల్‌ను విడిచి వెళ్లాలంటూ ఎమ్మెల్యే వర్గీయులు డిమాండ్ చేశారు. అందుకు వారు నిరాకరించారు. దీంతో ఇరువర్గాల నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఒక వర్గం వారు ఎమ్మెల్యే జిందాబాద్ అంటూ నినదించగా మరో వర్గం వారు ఎంపీ జిందాబాద్ అంటూ ప్రతి నినాదాలు చేశారు.
 
 ఎమ్మెల్యే వర్గానికి చెందిన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు లోడి శ్రీను, ఎంపీ వర్గానికి చెందిన ఆకుల శ్రీను, ఏకు సుమన్ రెడ్డిలు చొక్కాలు పట్టుకొని ఘర్షణ పడ్డారు. దీంతో ఇరు వర్గాల వారు పరస్పరం కుర్చీలు విసురుకున్నారు. ఈ దశలో ఫంక్షన్‌హాల్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.  పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాల వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. తాము ఫిర్యాదు చేయనిదే పోలీసులు ఎందుకు వచ్చారంటూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరేందర్ గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే ఫంక్షన్‌హాల్‌లో ఇరు వర్గాల వారు వేరు వేరుగా కూర్చొని సాయంత్రం వరకు నినాదాలు చేసుకున్నారు. చీకటి పడడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
 
 ఇద్దరూ సమానమే..
 తమకు ఎంపీ రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ ఇద్దరూ సమానమేనని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కె. నరేందర్ గుప్తా అ న్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా సమావేశం నిర్వహించినందుకు అడ్డుకున్నామని చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement