తెలియని రోజా ఆచూకీ! | MLA Roja missing after police take her into custody | Sakshi
Sakshi News home page

తెలియని రోజా ఆచూకీ!

Feb 11 2017 12:16 PM | Updated on Oct 29 2018 8:10 PM

పోలీసులు అదుపులోకి తీసుకున్న వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా ఆచూకీ తెలియడం లేదు.

పోలీసులు అదుపులోకి తీసుకున్న వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా ఆచూకీ తెలియడం లేదు. గుంటూరు జిల్లా మేడికొండూరు దాటిన తర్వాత నుంచి ఫోన్‌కు కూడా అందుబాటులో లేకుండా పోయారు. పేరేచర్ల జంక్షన్ వద్ద పోలీసులు ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసింది. మధ్యలో ఒకచోట రోజా పెద్దగా కేకలు పెట్టారని, రక్షణ కోసం పోలీసు వాహనం నుంచి కిందకు దిగేందుకు కూడా ప్రయత్నించారని కొందరు అంటున్నారు. ఆ ప్రయత్నంలో ఆమె కింద పడిపోయారని, కన్నీళ్లు కూడా పెట్టుకున్నారని చెబుతున్నారు. ఆ సమయంలో పోలీసులు బలవంతంగా ఆమెను మళ్లీ వాహనంలోకి తోసేశారని సమాచారం. తన పట్ల పోలీసుల దుష్ప్రవర్తనపై రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు.
 
విజయవాడలో బస చేయాల్సిన హోటల్‌కు తీసుకెళ్తున్నామని చెప్పి ఆమెను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మేడికొండూరు పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్తున్నట్లు చెప్పినా, తీరా అక్కడ చూస్తే ఆమె లేరు. మళ్లీ రోజాను సత్తెనపల్లి వైపు తీసుకెళ్తున్నట్లు సమాచారం అందింది. ఎక్కడో గన్నవరం విమానాశ్రయం నుంచి ఇప్పుడు సత్తెనపల్లి వరకు అంటే.. దాదాపు 90 కిలోమీటర్లకు పైగా దూరం ఒక మహిళా ఎమ్మెల్యేను ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చిందన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకట్లేదు. 
పోలీసులే రోజాను కిడ్నాప్ చేసి ఉంటారని వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై డీజీపీ సాంబశివరావును కలిసేందుకు నాయకులు వెళ్తున్నారు. మహిళా పార్లమెంటు సదస్సుకు హాజరయ్యేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రోజాను పోలీసులు అక్కడే అడ్డుకుని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమెను ఎక్కడకు తీసుకెళ్తున్నదీ కూడా చెప్పకుండా పోలీసు వాహనంలో తరలించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement