క్షీరం..క్షీణం | milk production growth downfall in krishna and guntur | Sakshi
Sakshi News home page

క్షీరం..క్షీణం

Oct 18 2017 10:53 AM | Updated on Aug 24 2018 2:36 PM

milk production growth downfall in krishna and guntur - Sakshi

రాజధాని ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పాడి పరిశ్రమ వట్టిపోతోంది. ప్రభుత్వ రాయితీలు, ప్రోత్సాహకాలతో ఈ పరిశ్రమ వర్ధిల్లుతోందని అధికారులు చెబుతున్న లెక్కలను వెక్కిరిస్తూ ఇతర రాష్ట్రాల నుంచి రోజూ పాలను దిగమతి చేసుకోవాల్సి వస్తోంది. మూడేళ్లుగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో గ్రాసం లేక పాడిపశువులు బక్కచిక్కుతున్నాయి. మూగజీవాలకు రైతులు మేత అందించలేక, వాటిని పోషించలేక మనసుకు కష్టంగా ఉన్నా కబేళాలకు విక్రయిస్తున్నారు.

సాక్షి, అమరావతిబ్యూరో : ప్రజల అవసరాల మేరకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పాల ఉత్పత్తి జరగడం లేదు. ప్రభుత్వ పథకాలు, రాయితీల వల్ల పాల ఉత్పత్తి వృద్ధి రేటు పెరిగిందని అధికారుల గణాంకాలు పేర్కొంటున్నా, వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. రోజూ ప్రభుత్వ రంగ, ప్రైవేటు డెయిరీలు ఇతర రాష్ట్రాల నుంచి సుమారు పదిలక్షల లీటర్ల పాలను దిగుమతి చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. మూడేళ్లుగా రెండు జిల్లాల్లో వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయి. వరిసాగు విస్తీర్ణం తగ్గిపోయింది. ఫలితంగా ఎండు గడ్డి కూడా కరువై రైతులకు పశుపోషణ కష్టంగా మారింది. ఈ క్రమంలో పశువులను పోషించలేక, బక్కచిక్కుతున్న వాటిని చూడలేక రైతులు పశువులను విక్రయిస్తున్న దీన పరిస్థితి పల్లెల్లో కన్పిస్తోంది.
కృష్ణా జిల్లాలో ప్రస్తుతం పాలిచ్చే పశువులు (గేదెలు) 3.15 లక్షలు ఉన్నాయి. వాటి నుంచి రోజూ సగటున 18.9 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. గుంటూరు జిల్లాలో 2.89 లక్షల పశువులు రోజూ 17.34 లక్షల లీటర్ల పాలు ఇస్తున్నాయని అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి. కృష్ణా జిల్లాలో 17, గుంటూరు జిల్లాలో 27 కంపెనీలు రోజువారీగా పాడి రైతుల నుంచి పాలను సేకరిస్తున్నాయి. వ్యవస్థీకృత రంగంలో 9.5 లక్షల లీటర్ల సేకరణ జరుగుతోంది. పాడి రైతులు సొంత అవసరాలకు వాడుకోవడం, డెయిరీలకు కాకుండే నేరుగా పట్టణ ప్రాంతాల్లో విక్రయించడం, ఇరుగుపొరుగు విక్రయించడం అవ్యవస్థీకృత రంగంలోకి వస్తాయి.

ప్రస్తుతం పాల ఉత్పత్తి ఇలా..
సగటున రోజుకు ఒక పశువు గతంలో 6 లీటర్లు పాలు ఇచ్చేది. రాయితీ పథకాలు, ప్రోత్సాహకాల కారణంగా 6.75 లీటర్ల పాలు ఇస్తోందని అధికారులు చెబుతున్నారు. అయితే మూడేళ్లగా పాడి సంపద ఒట్టిపోయింది. వర్షభావ పరిస్థితుల నేప«థ్యంలో వరిసాగు విస్తీర్ణం తగ్గింది. వరి కోతల సమయంలో వర్షాల కారణంగా యంత్రాలతో రైతులు కోతలను పూర్తిచేస్తున్నారు. ఇలా కోసిన వరిగడ్డి మేతకు పనికిరావడంలేదు. ఫలితంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో  పశుగ్రాసం కొరత నెలకొంది. ఇతర జిల్లాల నుంచి గ్రాసం కొనుగోలు చేయాల్సి వచ్చింది. దీంతో గ్రాసం ధర పెరిగింది. మరోవైపు ప్రభుత్వ పథకాల్లో మితిమీరిన రాజకీయ జోక్యం, అమలులో అవినీతి పెరగడంతో పాడి రైతులకు లబ్ధిచేకూరడంలేదు. దీంతో పశు పోషణ కష్టంగా మారింది. ఆరు లీటర్ల పాలు ఇవ్వాల్సిన పశువులు 4 లీటర్లు కూడా ఇవ్వడంలేదు. దీంతో మూగజీవాలను పోషించలేక రైతులు వాటిని దళారులకు విక్రయిస్తున్నారు. దళారులు కబేళాలకు తరలిస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని రెండు జిల్లాల్లో ఒక్క ఏడాదిలోనే సుమారు లక్షకు పైగా పశువుల విక్రయాలు జరిగి కబేళాలకు తరలించినట్లు ఓ అధికారి వెల్లడించారు.

రోజుకు 10 లక్షల లీటర్లు దిగుమతి
రాజధాని ప్రాంతంలో వినియోగదారుల అవసరాల మేరకు పాల ఉత్పత్తి జరగడం లేదు. రాజధాని నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఉద్యోగులు తరలివచ్చారు. వివిధ పనుల నిమిత్తం వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇలా వేల కుటుంబాలు రెండు జిల్లాల్లో నివసిస్తున్నాయి. పెరిగిన ప్రజల అవసరాలకు తగినట్లుగా డెయిరీలు స్థానికంగా పాల సేకరణ చేయలేక పోతున్నాయి. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి పాలు దిగుమతి చేసుకుంటున్నాయి. ఒక్క విజయవాడలోనే రోజుకు 2.30 లక్షల లీటర్లు అవసరం. పండుగలు పబ్బాలకు మరో 70 వేల లీటర్లు అదనంగా అవసరమవుతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటకలోని కోలార్‌ ప్రాంతం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు డెయిరీలు పాలు దిగుమతి చేసుకుంటున్నాయి. కృష్ణా జిల్లాకు సంబంధించి విజయ డెయిరీ రోజుకు 2.5 లక్షల లీటర్ల మేర కోలార్‌ నుంచి పాలు దిగుమతి చేసుకుంటున్నారని సమాచారం. ప్రైవేటు డెయిరీలు కూడా ఇలానే పాలు కొనుగోలు చేసి, విక్రయిస్తున్నాయి. అయితే ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యే పాలల్లో అధిక శాతం ఆవు పాలు సేకరిస్తున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement