వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు స్థానం నుంచి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు, సోనియా తనయుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తారా?
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు స్థానం నుంచి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు, సోనియా తనయుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తారా? వ్యూహంలో భాగంగానే టీఆర్‌ఎస్ బహిష్కృత ఎంపీ విజయశాంతిని పార్టీలో చేర్చుకున్నారా? అవుననే అంటున్నాయి అధికార కాంగ్రెస్ పార్టీ వర్గాలు. ఇటీవల జిల్లాకు చెందిన కాంగ్రెస్ కీలక నేతలు ఢిల్లీకి వెళ్లిన సందర్భంలో రాహుల్ పోటీపై పార్టీ ఉన్నతస్థాయి వర్గాల్లో చర్చ జరిగినట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్ర విభజనకు అనుకూలంగా సీడబ్ల్యూసీ ప్రకటన నేపథ్యంలో మెజారిటీ లోక్‌సభ స్థానాలు సాధించడం లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఆయనను కట్టడి చేసేందుకు విజయశాంతిని పార్టీలో చేర్చుకునేలా పార్టీ వ్యూహం రచించించినట్టు సమాచారం. విజయశాంతికి కేంద్రంలో సముచిత స్థానం కల్పిస్తామనే హామీ లభించిందని ఢిల్లీలో జరుగుతున్న పరిణామాల సారాంశాన్ని అధికార పార్టీ నేత ఒకరు వెల్లడించారు. ఇందిరమ్మ బాటలో రాహుల్ కూడా మెదక్ నుంచి పోటీ చేయడం ఖాయమని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.