ప్రేమ పేరుతో ఎంబీఏ విద్యార్థిని హత్య | MBA Student killed by boy friend at Devarakonda | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో ఎంబీఏ విద్యార్థిని హత్య

Nov 15 2013 9:01 AM | Updated on Oct 16 2018 2:53 PM

ప్రేమ పేరుతో ఎంబీఏ విద్యార్థిని హత్య - Sakshi

ప్రేమ పేరుతో ఎంబీఏ విద్యార్థిని హత్య

చదువుకు పేదరికం అడ్డుకాలేదు.. కష్టాల్లోనూ కష్టపడి చదివింది.. ఎంబీఏలోనూ మెరిట్ స్టూడెంట్. ప్రేమించానన్న యువకుడిని నమ్మింది..పెళ్లి చేసుకుంటానన్న కల్లబొల్లి మాటలకు మురిసిపోయింది.

చదువుకు పేదరికం అడ్డుకాలేదు.. ఎంబీఏలోనూ మెరిట్ స్టూడెంట్. ప్రేమించానన్న యువకుడిని నమ్మింది..పెళ్లి  చేసుకుంటానన్న కల్లబొల్లి మాటలకు మురిసిపోయింది. తీరా.. ప్రేమించినవాడు కాదన్నాడు.. పెద్దలు సర్దిచెప్పడంతో మనసు మార్చుకుని మరో పెళ్లికి సిద్ధమైంది. ఇంతలోనే ప్రేమించిన యువకుడు మళ్లీ వచ్చాడు. నీతో మాట్లాడాలంటూ పిలిస్తే వెళ్లింది. కానీ.. ఇక తిరిగిరాలేదు. ఆ మృగాడి చేతిలో క్రూరంగా హత్యకు గురైంది. ఈ ఉదంతం నల్లగొండ జిల్లా కాసారం గుట్టల్లో వెలుగుచూసింది.

దేవరకొండకు చెందిన గోలి రాములు కుమార్తె కవిత(22) స్థానిక ఖాదర్ మెమోరియల్ కళాశాలలో గత నెలలోనే ఎంబీఏ పూర్తి చేసింది. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన సోమిదేవిపల్లి బాలకృష్ణ దేవరకొండలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ ఇదే కళాశాలలో గతేడాది ఎంబీఏ పూర్తి చేశాడు. వీరిద్దరి మధ్య కొంతకాలం ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే బాలకృష్ణ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కవిత ప్రైవేట్‌గా ట్యూషన్లు చెబుతోంది.

కాగా, ఇటీవల తాను ప్రేమించిన బాలకృష్ణ కాదనడంతో కవిత వేదనకు గురైందని, కుటుంబసభ్యులు ఆమెకు నచ్చజెప్పడంతో వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించగా నిశ్చితార్థం జరిపారని, ఈనెలలో పెళ్లి జరగాల్సి ఉందని సమాచారం. ఈ క్రమంలో సోమవారం దేవరకొండకు వచ్చిన బాలకృష్ణ కవితకు ఫోన్ చేసి నీతో మాట్లాడాలంటూ పిలిచాడు. ఇద్దరూ కలిసి కాసారం గుట్టల్లోకి వెళ్లారు. కలిసి ఉండటం వీలుకాలేని మనం కలిసైనా  ఆత్మహత్య చేసుకుందామంటూ ఆమెను ప్రేరేపించాడు.

తమ వెంట తీసుకెళ్లిన పురుగుల మందును ఆమెకు తాగించి, తాను కూడా కొంచెం సేవించాడు. ఆమె ప్రాణం పోకపోవడంతో తనవెంట తీసుకెళ్లిన కత్తితో దారుణంగా కవిత గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం  దేవరకొండకు చేరుకున్న బాలకృష్ణ పురుగుల మందు ప్రభావంతో తాను చదువుకున్న కళాశాల అధ్యాపకుడు శ్రవ ణ్ ఇంటిఎదుట పడిపోయాడు. గమనించిన శ్రవణ్ చికిత్స అతడిని దేవరకొండ ఆస్పత్రికి, అనంతరం హైదరాబాద్  ఆస్పత్రికి తరలించాడు.
     
ఇదిలా ఉండగా, సోమవారం రాత్రి 9గంటలు దాటినా కవిత ఇంటికి చేరలేదు. రోజూ ట్యూషన్ చెప్పే ఇంటికి వెళ్లి కవిత గురించి తండ్రి రాములు వాకబు చేశాడు.  అక్కడకు రాలేదని వారు చెప్పారు. దీంతో కళాశాలకు చెందిన అధ్యాపకుడి ఫోన్ చేసి, ఆ తర్వాత శ్రవణ్ ఇంటికి వెళ్లాడు. అతను అక్కడ లేకపోవడం, ఫోన్ చేసినా ఏ సమాచారం లేదు. దీంతో కవిత తండ్రి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. బాలకృష్ణపై అనుమానం వ్యక్తం చేశాడు. 

మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు.. స్నేహితులు, అధ్యాపకులను విచారించడంతో బాలకృష్ణ విషయం బయటపడింది. దీంతో వారు వెంటనే హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న బాలకృష్ణను అదుపులోకి తీసుకుని విచారించగా, కవితను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే, వీరి ప్రేమ విషయం కళాశాల అధ్యాపకుడు శ్రవణ్‌కు ముందే తెలుసని కవిత తండ్రి రాములు ఆరోపిస్తుండగా, ప్రాణాపాయ స్థితిలో తన ఇంటిముందు విద్యార్థి పడిఉండటంతో ఆస్పత్రిలో చేర్చాడని ఆయన బంధువులంటున్నారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేవరకొండ సీఐ భాస్కర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement