వర్షపు నీటిని సద్వినియోగం చేసుకుంటే ఇండియా లాంటి దేశాల్లో నీటి కరువును ఎదుర్కోవచ్చని జర్మనీ, డ్యూస్‌బర్గ్ ఎస్సెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్...
నిట్‌క్యాంపస్, న్యూస్‌లైన్ : వర్షపు నీటిని సద్వినియోగం చేసుకుంటే ఇండియా లాంటి దేశాల్లో నీటి కరువును ఎదుర్కోవచ్చని జర్మనీ, డ్యూస్‌బర్గ్ ఎస్సెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్, వాటర్ మేనేజ్‌మెంట్ యునెస్కో మాజీ చైర్‌పర్సన్ డాక్టర్ డబ్ల్యూఎఫ్ గైగర్ సూచించారు. అర్బన్ స్ట్రామ్ వాటర్ మేనేజ్‌మెంట్‌పై టెక్నికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఒకరోజు జాతీయ స్థాయి వర్క్‌షాపు వరంగల్ నిట్‌లోని న్యూ కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం జరిగింది.
ఈ సందర్భంగా గైగర్ మాట్లాడుతూ డ్రెయినేజీ నీటిపై 1987లో తొలిసారిగా యునెస్కోకు మాన్యువల్‌ను తయారు చేసి ఇచ్చానన్నారు. 1992లో జర్మనీలో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో మరో మాన్యువల్‌ను రూపొందించి ఇచ్చానన్నారు. 1996లో ఇండియాలో జరిగిన అర్బన్ డ్రెయినేజీ సిస్టమ్‌పై స్టడీ చేసి మూడో మాన్యువల్‌ను, 2001లో డ్రెయినేజీ నీటిని తిరిగి వాడటంపై కేస్ స్టడీ చేశానని తెలిపారు.
ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వర్షపు నీటిని ఒడిసిపట్టుకుంటేనే నీటి కరువును ఎదుర్కోవచ్చన్నారు. ప్రొఫెసర్ డాక్టర్ కేవీ.జయకుమార్ ఇండియాలో ఉన్న నీటి మేనేజ్‌మెంట్ విధానాన్ని వివరించారు. ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ అర్బన్ డెవలప్‌మెంట్‌లో భాగంగా పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. వర్క్‌షాపులో నిట్ డైరక్టర్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసరావు, రాష్ట్రంలోని 21మంది పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీర్లు, 9 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, 150 మంది విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.