ఆదుకోండయ్యా!

Man Suffering With Brain Disease Waiting For Help SPSR Nellore - Sakshi

మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నిరుపేద

వైద్యం చేయించుకునే స్తోమత లేక అవస్థలు

దాతల సాయం కోసం ఎదురుచూపులు

వారిది నిరుపేద కుటుంబం.. భర్త ప్రమాదంలో గాయపడి మెదడు సంబంధిత వ్యాధితో మంచం పట్టాడు.. భార్య అన్నీ తానై సేవలు చేస్తోంది.. కనీసం మందులు తెచ్చుకునే ఆర్థిక స్థోమత లేక అవస్థలు పడుతోంది.. భర్తను చంటి పిల్లాడి కన్నా ఎక్కువగా చూసుకుంటూ కష్టించి పనిచేస్తున్నా బువ్వకు కూడా సరిపడడం లేదు. ఖరీదైన మందులు కొనుక్కోలేక అవస్థలు పడుతున్నారు. దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

నెల్లూరు, రాపూరు: నాయుడుపేటకు చెందిన దూర్జటి రవికుమార్‌–లక్ష్మి దంపతులు. వీరికి సంతానం లేరు. రవికుమార్‌ 12 సంవత్సరాల క్రితం అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో గాయపడి తలకు తీవ్రగాయాలు కావడంతో మంచం పట్టాడు. అప్పటి నుంచి మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. అన్ని వైద్యశాలల్లో చూపించారు. లక్ష్మి తమ్ముడికి తెలిసిన, లండన్‌లో ఉంటున్న వైద్యుడు వినోద్‌రెడ్డి నెల్లూరుకు వస్తే రవికుమార్‌ని చూపించారు. ఖరీదైన ఇంజెక్షన్‌ వేసి చూడాలని ఆయన సూచించారు. అలాగే పలు ఆస్పత్రుల వైద్యులు కూడా ఆ జబ్బుకు ఖరీదైన వైద్యం చేయించాలని, లేకపోతే నిత్యం మందులు వాడుతూ ఉండాలని వైద్యులు సూచించారు. మందుల కోసం ప్రతి నెలా సుమారు రూ.7 వేలు ఖర్చవుతోంది.

మందులు వాడితే కొంతమేర మామూలుగా ఉంటాడు.. మందులు వాడకపోతే నడవలేని పరిస్థితి.. మతిస్థిమితం లేని వ్యక్తిలా మంచానికే పరిమితమవుతాడు. రవికుమార్‌ తండ్రి విశ్రాంత ఉపాధ్యాయుడు. అతనికి వచ్చే పెన్షన్‌లో ప్రతి నెలా రూ.5 వేలు ఇచ్చేవాడు. ఆయన గత డిసెంబర్‌ 11న మృతిచెందడంతో ఇక రవికుమార్‌కు సాయం చేసే వారు లేకపోయారు. దీంతో రవికుమార్‌–లక్ష్మి దంపతులు పెంచలకోనలోని ఒక సత్రం పంచన చేరారు. లక్ష్మి సత్రానికి వచ్చి పోయే వారికి అన్నం వండిపెడుతూ భర్తను చూసుకుంటోంది. వీరికి పిల్లలు లేకపోవడంతో లక్ష్మి రవికుమార్‌ను కన్న కొడుకులా చూసుకుంటోంది. ఖరీదైన మందులు వాడితే ప్రయోజనం ఉంటుందన్న వైద్యుల సూచనలు కొంత ఆశ కలిగిస్తున్నాయి. దయ గల దాతలు ముందుకువచ్చి ఆదుకోవాలని వేడుకుంటోంది. దాతలు సాయం చేయదలుచుకుంటే పెంచలకోనలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు అకౌంట్‌ నంబర్‌ – 91107012907కు నగదు సాయం అందించాలని, లేదా 9390190202 నంబర్‌కు ఫోన్‌ చేసి సంప్రదించాలని లక్ష్మి కోరుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top