మున్సి‘పోల్స్‌’కు ముందే హోదా పెంపు 

Major Grama Panchayats In Penukonda Uravakonda And Gorantla Ready To Be Designated As Urban Panchayats - Sakshi

నగర పంచాయతీలుగా పెనుకొండ, ఉరవకొండ, గోరంట్ల  

ఈ నెల 31లోపు స్థాయిపెంపుపై నివేదికలివ్వాలని ఆదేశాలు 

సమీప గ్రామాలు, ప్రాంతాలూ మున్సిపాలిటీల్లో విలీనం 

మున్సి‘పోల్స్‌’కు సర్కార్‌ సన్నాహాలు 

సాక్షి, అనంతపురం న్యూసిటీ/కదిరి: మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే జిల్లాలోని పెనుకొండ, ఉరవకొండ, గోరంట్ల మేజర్‌ గ్రామ పంచాయతీలకు నగర పంచాయతీలుగా హోదా కల్పించేందుకు సిద్ధమైంది. ఈనెల 31లోగా ఆయా పంచాయతీల స్థాయి పెంపుపై వివరాలు ఇవ్వాలని మున్సిపల్‌ శాఖ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు జీఓ ఎంఎస్‌ నెం.18 విడుదల చేసింది. అంతేకాకుండా జిల్లాలో ఇప్పటికే ఉన్న మున్సిపాలిటీలతో పాటు కొత్తగా నగర పంచాయతీలుగా ఏర్పడనున్న మూడు పంచాయతీల సమీప గ్రామాలు, ప్రాంతాలను సైతం ఆయా మున్సిపాలిటీల్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు సమాచారం ఇవ్వాలని కోరింది. దీంతో జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ కొత్తగా ఏర్పాటు కానున్న నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లోని సమీప ప్రాంతాలు, గ్రామాల సమగ్ర సమాచారం ఇవ్వాలని పట్టణాభివృద్ధి శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. 

మున్సి‘పోల్స్‌’కు ముందే హోదా పెంపు 
ఎన్నికలకు ముందే కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది.  ప్రస్తుతం అనంతపురం నగర పాలక సంస్థతో పాటు హిందూపురం, గుంతకల్లు, ధర్మవరం, కదిరి, కళ్యాణదుర్గం, పుట్టపర్తి, గుత్తి, పామిడి మున్సిపాలిటీలున్నాయి. ఈ నెల 2వ తేదీతో వీటి పాలకవర్గం గడువు ముగిసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయా మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులను  నియమించింది. వీటికి తిరిగి ఎన్నికలు నిర్వహించేలోపే ఉరవకొండ, గోరంట్ల, పెనుకొండ పంచాయతీలకు నగర పంచాయతీ హోదా కల్పించి వీటికీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. 

గతేడాది ప్రతిపాదనలు 
గతేడాది ఆగస్టు 23న అప్పటి కలెక్టర్‌ ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్‌ టౌన్, కంట్రీ ప్లానింగ్‌ అధికారి జిల్లాలోని ఉరవకొండ, పెనుకొండ, గోరంట్ల, యాడికి మేజర్‌ గ్రామ పంచాయతీలకు నగర పంచాయతీలుగా హోదా కల్పించాలని, అనంతపురం చుట్టూ పది కిలోమీటర్ల దూరంలో ఉండే రాజీవ్‌కాలనీ, ప్రసన్నాయపల్లి, రాప్తాడు, ఏ నారాయణపురం పంచాయతీలను నగరపాలక సంస్థలో విలీనం చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అలాగే ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా అనంతపురం చుట్టు పక్కల ఉన్న బీకేఎస్, ఉప్పరపల్లి, రుద్రంపేట, కక్కలపల్లి కాలనీ, కక్కలపల్లి, అనంతపురం రూరల్‌ గ్రామ పంచాయితీలను విలీనం చేయవద్దని పేర్కొన్నారు. 

హోదా పెరిగితే.. నిధుల వరద 
పెనుకొండ, గోరంట్ల, ఉరవకొండ ప్రాంతాలను నగర పంచాయతీలు హోదా దక్కితే వాటికి భారీగా నిధులు మంజూరవుతాయి.దీంతో  అవి అభివృద్ధి దిశగా ముందుకెళ్లనున్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top