
తెలంగాణ కన్నా దళితులకు సంక్షేమమే ముఖ్యం
తెలంగాణకన్నా దళితలకు సంక్షేమమే ముఖ్యమని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్య ప్రకాశరావు అన్నారు.
వైఎస్సార్ సీపీ నేత నల్లా సూర్యప్రకాశరావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకన్నా దళితలకు సంక్షేమమే ముఖ్యమని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్య ప్రకాశరావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని దళితుల ప్రయోజనాలను ఏ విధంగా పరిరక్షిస్తారో రాష్ట్ర విభజనకు ముందే కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన దీక్ష తెలంగాణకు వ్యతిరేకం కాదని, అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగడానికేనని స్పష్టంచేశారు.
విభజన ప్రకటనతో సీమాంధ్రులు భయాందోళనలకు గురవుతున్నారని చెప్పారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, జేఏసీ నాయకులు మాట్లాడుతున్న భాష దారుణంగా ఉందన్నారు. ‘తెలంగాణలో సీమాంధ్రులకు రక్షణ కల్పించడం మా బాధ్యత అంటున్నారు. ఇంతకు రక్షణ కల్పించడానికి వారెవరు?’ అని ప్రశ్నించారు. విభజన జరిగితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు కాకుండా పోతాయనే భయం కలుగుతుందన్నారు. తెలంగాణ వచ్చినా, రాకున్నా దళితులకు కావాల్సింది సంక్షేమ పథకాలేనని చెప్పారు.