
సుడిగుండంలో ఉన్నత విద్య
2014లో ఉమ్మడిగా ఎంసెట్‌ను నిర్వహించగా ప్రవేశాల కౌన్సెలింగ్ సమయానికి రాష్ట్ర విభజన జరిగింది.
తొలుత ‘ఎంసెట్’ దుమారం.. తర్వాత ‘విద్యా మండలి’ లొల్లి
ఎంసెట్ కౌన్సెలింగ్‌పై తొలుత ఇరురాష్ట్రాల పట్టు
చివరికి ఎవరికి వారే కౌన్సెలింగ్‌కు నిర్వహించేలా ఏర్పాట్లు
ఎంసెట్‌తో షురూ..
2014లో ఉమ్మడిగా ఎంసెట్‌ను నిర్వహించగా ప్రవేశాల కౌన్సెలింగ్ సమయానికి రాష్ట్ర విభజన జరిగింది. విభజన చట్టం ప్రకారం ఎంసెట్ కౌన్సెలింగ్ కోసం ఏపీ ఉన్నత విద్యామండలి ఉమ్మడి షెడ్యూల్‌ను నిర్ణయించగా.. తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఏపీ మండలి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా... ఆ ఏడాది ఆగస్టు 30కల్లా కౌన్సెలింగ్ పూర్తిచేసి సెప్టెంబర్ ఒకటి నుంచి తరగ తులు ప్రారంభించాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఏపీ మండలి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ పూర్తిచేసే అవకాశమున్నా... వివాదాల నేపథ్యంలో ఇరు రాష్ట్ర్రాల అధికారులతో కమిటీని ఏర్పాటు చేయించారు. ఈలోగానే టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉన్నత విద్యామండలిని ఏర్పాటు చేయడంతో.. ఏరాష్ట్రానికి ఆ రాష్ట్రం కౌన్సెలింగ్ నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేశారు.
ఏపీ కౌన్సిల్ తెలంగాణ పరిధిలోకి..
తెలంగాణ ఉన్నత విద్యామండలి ఏర్పాటుతో రెండు రాష్ట్రాల మధ్య మరో వివాదం మొదలైంది. ఏపీ ఉన్నత విద్యామండలి భవనాల్లోనే తామూ ఉంటామని తెలంగాణ కౌన్సిల్ అధికారులు కోరడంతో.. మండలి భవనంలోని పైఅంతస్తు మొత్తాన్ని వారికి కార్యాలయంగా కేటాయించారు. కొంతమంది కింది స్థాయి సిబ్బందిని ఇచ్చారు. కానీ నిధులు, వాహనాలు, ఫైళ్లు వంటి అంశాల్లో విభేదాలు కొనసాగాయి. తమకు కొత్త వాహనాలు, కార్యాలయ నిర్వహ ణకు రూ.2 కోట్లు కావాలని తెలంగాణ మండలి చైర్మన్ ఏపీ విద్యామండలికి లేఖ రాశారు. అయితే ఆ అధికారం తమకు లేదన్న ఏపీ మండలి.. ప్రభుత్వం అనుమతిస్తే ఇస్తామంటూ ఆ లేఖను ఏపీ సర్కారుకు పంపింది. కానీ ఏపీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. చివరకు ఏపీ మండలి బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయించిన తెలంగాణ మండలి... విభజన చట్టం ప్రకారం పదో షెడ్యూల్ సంస్థలన్నీ తెలంగాణకే చెందుతాయంటూ కోర్టు ను ఆశ్రయించింది. దానిని పరిశీలించిన న్యాయస్థానం... ప్రస్తుతమున్న మండలి, భవనాలు, బ్యాంకు ఖాతాలన్నీ తెలంగాణకే చెందుతాయని ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు ఏపీ విద్యామండలి భవనాలను తెలంగాణ స్వాధీనం చేసుకుని సీలువేసింది. దీనిపై ఏపీ సుప్రీంకోర్టుకెళ్లి సానుకూల ఉత్తర్వులు తెచ్చుకున్నా.. తెలంగాణ వెనక్కి తగ్గలేదు. దీనికన్నా ముందు ఇంటర్ పరీక్షల అంశంలోనూ వివాదం నడిచింది.
నిట్ సీట్లపై పీటముడి..
వరంగల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)లో సీట్లపై వివాదం కొనసాగుతోంది. ఏపీలో నిట్ ఏర్పాటు చేయనున్నా.. వచ్చే విద్యా సంవత్సరానికి అక్కడ 90 నుంచి 120 సీట్లు మాత్రమే ఉండనున్నాయి. స్థానిక కోటా కింద అందులో సగమే ఏపీ విద్యార్థులకు దక్కుతాయి. ఉమ్మడిగా ఉన్నప్పుడు వరంగల్ నిట్‌లోని 370 స్థానిక కోటా సీట్లలో సగానికి పైగా ఏపీకి దక్కేవి. దీంతో వరంగల్ నిట్‌లో తమకూ భాగం ఇవ్వాలని ఏపీ కేంద్ర ప్రభుత్వానికి, నిట్‌కు లేఖలు రాసింది. దీనిపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తమ రాష్ట్రంలోని నిట్‌లో ఏపీకి వాటా సరికాదని స్పష్టం చేసింది.