
ప్రత్యేక పూజలకూ అనుమతులు కావాలా?
జగన్ ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక పూజలు కూడా చేయనివ్వకపోవడం దారుణమని వైఎస్సార్ సీపీ నాయకులు
వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకుని బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు
{పభుత్వ తీరుపై ధ్వజమెత్తిన పార్టీ నాయకులు
డాబాగార్డెన్స్ : జగన్ ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక పూజలు కూడా చేయనివ్వకపోవడం దారుణమని వైఎస్సార్ సీపీ నాయకులు చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆరోరోజూ నిరశన దీక్ష కొనసాగిస్తున్న వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో సోమవారం సంపత్ వినాయగర్ ఆలయంలో పూజలు నిర్వహించేందుకు బయలుదేరిన పార్టీ నేతల్ని పోలీసులు అడుగడుగున అరెస్టులు చేశారు. పోలీసులు నేతల్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తుండడంతో పోలీసులను తప్పించుకుని నేతలు పరుగులు తీశారు. అయినప్పటికీ పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని నాయకుల్ని అదుపులోకి తీసుకున్నారు.
వీరిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు, నియోజకవర్గ సమన్వయకర్తలు కోలా గురువులు, తైనాల విజయ్‌కుమార్, సి.హెచ్.వంశీకృష్ణ, మళ్ల విజయప్రసాద్ పలువురు నాయకుల్ని భీమలి పోలీస్ స్టేషన్‌కు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, ఎస్సీ సెల్ రాష్ట్ర సభ్యుడు బోను దేవా, సూరాడా తాతారావు, పీతల వాసు, మాసిపోగు రాజు, శ్రీహరిరెడ్డి, సేనాపతి అప్పారావు, రవికుమార్, నీలాపు మురళీ తదితరుల్ని పోతిన మల్లయ్యపాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ సమన్వయకర్తలు మాట్లాడుతూ ప్రతిపక్ష నేత ఆరోగ్య పరిస్థితి విషమిస్తుంటే ప్రత్యేక పూజలు కూడా చేసుకోనివ్వని చేతగాని ప్రభుత్వమని మండిపడ్డారు. ప్రత్యేక హోదాని చంద్రబాబు నరేంద్ర మోదీ వద్ద తాకట్టు పెట్టి ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అంటూ ధ్వజమెత్తారు. ఎంతసేపూ జేబులు నింపుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం ఉందన్నారు. చంద్రబాబు, ఆయన మంత్రి వర్గానికి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా సాధనకు కృషి చేయాలన్నారు.
సింహగిరిపై వైఎస్సార్ సీపీ నేతల పూజలు
సింహాచలం : ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం కోసం ఆ పార్టీ నేతలు శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి సోమవారం ప్రత్యేకపూజలు చేశారు. తొలుత స్వామి సన్నిధిలో 101 కొబ్బరికాయలు కొట్టారు. పూజలు చేసిన వారిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, భీమిలి సమన్వయకర్త కర్రి సీతారాం, కొయ్య ప్రసాద్‌రెడ్డి తదితరులు ఉన్నారు.