ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తన మంత్రి వర్గంలో ఫిరాయింపుదారులకు చోటివ్వడంపై లోక్‌సత్తా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాక్షి, హైదరాబాద్: ఏపీ కేబినెట్‌లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై విమర్శలు వెళ్లువెత్తున్నాయి. రాజీనామా చేయించకుండా మంత్రి పదవులు ఇవ్వడంపై పలు రాజకీయపార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తన మంత్రి వర్గంలో ఫిరాయింపుదారులకు చోటివ్వడంపై లోక్‌సత్తా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై హైడ్రామా చేసిన చంద్రబాబు, ఏపీలో ఫిరాయించిన నేతలకు మాత్రం ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ అనైతికత, ప్రజాస్వామ్య అపహాస్యానికి ప్రస్తుత పరిస్థితి స్పష్టం చేస్తోందని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించే స్పీకర్, గవర్నర్‌లు సైతం ఈ ఫిరాయింపులను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వాలకు ప్రజలు తగిన విధంగా బుద్ది చెబుతారని ఆయన అన్నారు.