బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

బాధ్యతాయుతంగా వ్యవహరించాలి - Sakshi


మీడియాకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సూచన

కామన్‌వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సు ప్రారంభం


 

విశాఖపట్నం: ‘మీడియా స్వతంత్రంగా, నిష్పాక్షికంగా, హేతుబద్ధంగా వ్యవహరించి ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడంలోనూ, ప్రభావితం చేయడంలోనూ కీలక పాత్ర పోషించాలి. ప్రభుత్వ వ్యవస్థలు ప్రజలకు మెరుగైన పాలన, సేవలు అందించేలా మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి..’ అని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఉద్బోధించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లడానికి మీడియా స్వేచ్ఛ అనేది అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేశారు. అయితే అది దేశ సమగ్రత, శాంతియుత ప్రజా జీవనం, ప్రజా సంక్షేమం, నైతిక విలువలకు కట్టుబడి ఉండాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. దానిని ఒక హక్కుగానే కాకుండా గురుతర బాధ్యతగా కూడా అందరూ గమనంలో ఉంచుకోవాలని ఆమె సూచించారు. తన బాధ్యత విస్మరించనంతవరకు, దురుద్దేశపూరితంగా వ్యవహరించనంతవరకు మీడియా మీద ఎలాంటి నియంత్రణలు ఉండాల్సిన అవసరం లేదని మహాజన్ అభిప్రాయపడ్డారు. బాధ్యతాయుతమైన స్వీయ నియంత్రణ మీడియాకే కాకుండా దేశానికి కూడా ప్రయోజనకరమని ఆమె పేర్కొన్నారు. ‘పార్లమెంట్ - మీడియా లా ’ అనే అంశంపై కామన్‌వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ మూడురోజుల సదస్సును బుధవారం ఆమె విశాఖపట్నంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం మీడియా అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది.



ఏది రాయాలో ఏది రాయకూడదో... ఏది ప్రసారం చేయాలో ఏది చేయకూడదో అన్నదానిపై  భిన్నాభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాల పనితీరును పర్యవేక్షించడానికి ప్రస్తుతం వివిధ వ్యవస్థలు ఉన్నాయి. అన్ని మీడియా మాధ్యమాలకు ఒకే పర్యవేక్షక వ్యవస్థ ఉండాలా?... వేర్వేరుగా ఉండాలా? అనేదానిపై విసృ్తతంగా చర్చించి సహేతుకమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని సూచించారు. 9/11 ఉగ్రవాద దాడికి సంబంధించి.. అమెరికా మీడియా కేవలం విమానాలు ట్విన్ టవర్లను కూల్చేసిన దృశ్యాలనే ప్రసారం చేసింది తప్ప.. వందలాది శవాలు, తలలు తెగిన మొండాలు, తెగిపడిన కాళ్లూ చేతులు, రక్తపాతం వంటి బీభత్స దృశ్యాలను ప్రసారం చేయకపోవడాన్ని ఆమె గుర్తు చేశారు. అమెరికా, బ్రిటన్ మీడియా పాటిస్తున్న ఈ స్వీయ నియంత్రణ మన దేశంలో కనిపించడం లేదని విమర్శించారు.

 విలువలకు కట్టుబడి ఉండాలి: చంద్రబాబు

 మీడియా విసృ్తతి పెరగడంతో ప్రజలకు అపరిమితంగా సమాచారం చేరుతోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మీడియా విలువలకు కట్టుబడి ఉండటమే కాక స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. రాజ్యాంగంలోని శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు.. మీడియా మధ్య మరింత సమన్వయం సాధించడం ద్వారానే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అభిప్రాయపడ్డారు. ఏపీ మండలి చైర్మన్ చక్రపాణి మాట్లాడుతూ.. రాజ్యాంగ వ్యవస్థలు సక్రమంగా పనిచేసేలా మీడియా మార్గనిర్దేశం చేయాలన్నారు.



అన్ని రాష్ట్రాల ప్రతినిధులు హాజరు



ఈ సదస్సులో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, జమ్మూ-కశ్మీర్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్,  అరుణాచల్ ప్రదేశ్, మిజోరం తదితర రాష్ట్రాల అసెంబ్లీల ప్రతినిధులు, స్పీకర్లు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ హాజరయ్యారు. అలాగే శ్రీలంక, కెన్యా, ఘనా, మాల్దీవులు, ట్రినిడాడ్-టొబాగో, జమైకా, మలేషియా, బ్రిటిష్ కొలంబియా, సౌత్ ఆస్ట్రేలియా తదితర దేశాల చట్టసభల ప్రతినిధులు హాజరయ్యారు.



కైలాసగిరిపై విందు: కామన్‌వెల్త్ సదస్సుకు హాజరైన వివిధ రాష్ట్రాల, దేశాల ప్రతినిధుల గౌరవార్థం విశాఖపట్నం కైలాసగిరిలో బుధవారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఈ కారణంగా కైలాసగిరిపైకి పర్యాటకులు, మీడియాతోసహా ఎవర్నీ అనుమతించలేదు.

 

గురుతర బాధ్యత నిర్వహిస్తోన్న మీడియా

 

 ‘కామన్‌వెల్త్’ సదస్సులో వక్తలు




ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా గురుతర బాధ్యత నిర్వర్తిస్తోందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. పలు ఇబ్బందులు, సవాళ్ల మధ్య కూడా మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందన్నారు. కామన్‌వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సులో మూడు అంశాలపై ప్రతినిధులు చర్చా గోష్టి నిర్వహించారు. పార్లమెంట్-మీడియా, ఫోర్త్ ఎస్టేట్‌గా మీడియా పాత్ర, పార్లమెంట్- మీడియా-న్యాయ పరిధి అనే అంశాలపై  చర్చించారు.

 

అర్థవంతమైన చర్చలకు  ప్రాధాన్యమివ్వడం లేదు

 

 కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు



 చట్టసభల్లో అర్థవంతమైన చర్చలకు మీడియా తగిన ప్రాధాన్యమివ్వడం లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అలజడి సృష్టించేవారిని, చర్చలను అడ్డుకునేవారిని మీడియా హీరోలు గా చూపించడం ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుందన్నారు. ఏపీ, తెలంగాణ, కేరళ అసెంబ్లీలలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు చట్టసభల ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. ఇందుకు అన్ని పార్టీలూ బాధ్యత వహించాలన్నారు. సి.రాజగోపాలాచారి, ఎన్జీ రంగా, వాజ్‌పేయి వంటి రాజనీతిజ్ఞులు చట్టసభల్లో వ్యవహరించిన తీరును నేటితరం ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు మీడియా కూడా ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top