రుణ స్వాహా | Loans | Sakshi
Sakshi News home page

రుణ స్వాహా

Feb 19 2015 3:11 AM | Updated on Sep 2 2017 9:32 PM

బ్యాంకర్లు సహకరిస్తే ఇబ్బడి ముబ్బడిగా రుణాలు ఎలా పొందవచ్చో చేప్పేందుకు ఆ నాయకుడు వ్యవహారమే చక్కటి ఉదాహరణ.

సాక్షి ప్రతినిధి, కడప: బ్యాంకర్లు సహకరిస్తే ఇబ్బడి ముబ్బడిగా రుణాలు ఎలా పొందవచ్చో చేప్పేందుకు ఆ నాయకుడు వ్యవహారమే చక్కటి ఉదాహరణ. ఉన్న భూమినే కుటుంబ సభ్యులందరి పేర్లతోనూ పట్టాలు తయారు చేశారు. మరికొన్ని సర్వే నంబర్లను గ్రామస్థులవి సైతం వాడుకొన్నారు. ఒకే పేరుపైనే పలు బ్యాంకుల్లో రుణాలు పొందారు. మొత్తంగా ఒకే కుటుంబానికి బ్యాంకర్లు వరుసగా లక్షలాది రుణాలు అందించారు. ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి బ్యాంకర్ల సహకారంలో రుణాలు పొందిన వైనం జిల్లా కలెక్టర్ కేవీ రమణ దృష్టికి చేరింది. విచారణకు ఆదేశిస్తే తీగలాగితే డొంక కదిలినట్లుగా మొత్తం వ్యవహారం బహిర్గతమైంది.
 
 దువ్వూరు మండలం గుడిపాడు గ్రామ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ మండల నేత తుమ్మల వెంకటకొండారెడ్డి కుటుంబంలో ఐదుగురు సభ్యులతో పలు బ్యాంకుల ద్వారా సుమారు రూ.26లక్షల రుణాలు, మరో రూ.10లక్షల మేరకు బంగారు రుణాలు పొందారు. ఒక బ్యాంకులో మార్టిగేజ్ చేయించి రుణం పొందితే, మరికొన్ని బ్యాంకుల్లో పంట రుణాలు పొందారు.
 
  తొలుత కొండారెడ్డి వారికి ఉన్న సర్వే నంబర్ల ద్వారా భూమిపై రుణాలు పొందితే, తర్వాత ఆ సర్వే నంబర్లల్లో కొన్నింటిని కుటుంబ సభ్యులతో రికార్డులు రూపొందించి రుణాలు పొందారు. ఇలా చింతకుంట, దువ్వూరులలో ఉన్న కార్పొరేషన్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డీసీసీబీ, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుల ద్వారా ఇబ్బడి ముబ్బడిగా రుణాలు పొందినట్లు తెలుస్తోంది. తుదకు వ్యక్తిగతంగాను, గ్రామ సర్పంచ్  ఖాతాపై కూడ ఒకే బ్యాంకులో పంట రుణాలు పొందినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో భాగంగా గ్రామకంఠం సర్వే నంబరుతోపాటు, మరో ముగ్గురి గ్రామస్థుల సర్వే నంబర్లుకు చెందిన భూమిని సైతం వాడుకున్నట్లు తెలుస్తోంది.
 
 సామాన్యుడికి రుణం
 దక్కాలంటే....
 సామాన్యుడికి రుణం ఇవ్వాలంటే సవాలక్ష అడ్డంకులు సృష్టించే బ్యాంకు అధికారులు కాస్తా పరపతి ఉన్నవారికి సలక్షణంగా అండగా నిలుస్తున్నారని ఈ వ్యవహారం రూఢీ అవుతోంది. మార్టిగేజ్ చేసి కార్పొరేషన్ బ్యాంకులో రుణం పొందిన సర్పంచ్ కొండారెడ్డి అనంతరం స్టేట్‌బ్యాంకులో రెండు ఖాతాలపై (ఒకటి సర్పంచ్ ఖాతా), డీసీసీబీ బ్యాంకులోనూ పంటరుణాలు పొందారు. ఎన్‌ఓసీ లేనిదే బ్యాంకు రుణం ఇవ్వని యంత్రాంగం కొండారెడ్డికి మాత్రం ఎలా ఇచ్చారన్నది ప్రశ్నార్థకం.
 
  ఆయనకొక్కరికే వివిధ బ్యాంకుల్లో రూ.8.5లక్షల రుణాలు, రూ.9.2లక్షలు బంగారు రుణాలు లభించాయి. అలాగే కుటుంబసభ్యుల పేర్లుపై మరో రూ.16.5 లక్షల రుణాలు అందాయి. అయితే వారు తీసుకున్న రుణాలకు చెందిన సర్వే నంబర్లు 45 గోపిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, సర్వే నంబర్ 23 పోరెడ్డి బాలనరసింహారెడ్డి, 521/1 చెన్నమ్మలకు చెందిన భూములుగా రికార్డులు రూఢీ చేస్తున్నాయి. ఆదర్శంగా ఉండాల్సిన సర్పంచ్ తన పరపతిని వినియోగించుకుని బ్యాంకర్ల ద్వారా విరివిరిగా రుణాలు పొందినట్లు తెలుస్తోంది. అందుకు ఆయా బ్యాంకుల అధికారుల సహకారం కూడాఅంది ఉంటుందనే అనుమానాలు ఉన్నాయి.
 
 విచారణకు ఆదేశించిన కలెక్టర్...
 గుడిపాడు సర్పంచ్ కొండారెడ్డి కుటుంబ సభ్యులు బ్యాంకర్ల సహకారంలో క్రమం తప్పకుండా పలు బ్యాంకుల్లో రుణాలు పొందిన వైనాన్ని కొందరు దువ్వూరు మండల వాసులు జిల్లా కలెక్టర్ కెవీ రమణకు ఆధారాలు సహా ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టాల్సిందిగా ఆయన తహశీల్దారు నరసింహులును ఆదేశించారు. అయితే తహశీల్దారుపై అధికార పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
 
 ఆమేరకు నివేదిక ఇవ్వడంలో ఆలస్యం అవుతోన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయమై తహశీల్దారు వివరణ కోరగా ఎప్పుడు ఎవరి నేతృత్వంలో ఎవరెవరికి పాసుపుస్తకాలు ఇచ్చారు.. ఇప్పుడు ఆ సర్వే నంబర్లు భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి. అడంగళ్, 1బి ఎవరు జారీ చేశారు.. అన్న విషయాలను సమగ్రంగా విచారణ చేస్తున్నట్లు తహశీల్దారు నరసింహులు సాక్షికి వివరించారు. 12 మంది విఆర్వోల పరిధిలో ఈ అంశం ముడిపడి ఉందని, సర్వే నంబర్లు రికార్డులు తెప్పించాల్సి ఉందని, అందుకే కాస్తా ఆలస్యం అవుతోందని చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement