ఆది అనుచరులకు భోజ్యం!

Lentils Agricultural Marketing Price In YSR Kadapa - Sakshi

 సాక్షి ప్రతినిధి కడప: ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే బహిరంగ మార్కెట్‌లో తక్కువ రేటుకు కందులు లభిస్తున్నాయి. కాగా కందుల కొనుగోలు గడువు ముగిసింది. నిల్వ ఉన్నవి ప్రభుత్వం కొనుగోలు చేస్తే అధిక ఆదాయం గడించవచ్చు. అదే ఆలోచన మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరులకు తట్టింది. మార్క్‌ఫెడ్‌ ద్వారా కందులు కొనుగోలు చేయాలని ఒత్తిడి పెంచారు.అమరావతి స్థాయిలో చినబాబు నుంచి పైరవీలు చేయించారు. మే 19కే గడువు ముగిసినా జమ్మలమడుగు నియోజకవర్గంలో మాత్రమే 1500 క్వింటాళ్లు కొనుగోలు చేసేందుకు అనుమతులిచ్చారు. వెరసి దాదాపు రూ.30లక్షలు ప్రజాధనం దోపిడీ చేసిన వైనమిది.
జిల్లాలో 22,120 ఎకరాలల్లో కందిపంట సాగుచేశారు. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 77,420 క్వింటాళ్ల దిగుబడి ఉన్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.  ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కందులు క్వింటా రూ.5,450లతో తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి19 నుంచి మే19వరకు  మూడునెలలు పాటు సేకరించింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 60,131 క్వింటాళ్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. తక్కినవి రైతుల అవసరాల రీత్యా కొన్ని, నిల్వ రూపంలో మరికొన్ని ఉండిపోయాయి. కాగా ప్రస్తుతం కందులు క్వింటా ధర రూ.3600 మాత్రమే బహిరంగ మార్కెట్‌లో పలుకుతోంది. ప్రభుత్వం రూ.5,450తో కొనుగోలు చేసిన నేపథ్యంలో రూ.1850 క్వింటాపై తేడా ఉంది. ఈనేపథ్యంలో మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరులు దళారుల అవతారమెత్తారు. గడువు ముగిసినా తాము ప్రభుత్వంతో కొనుగోలు చేయించే చర్యలు చేపడతాం, క్వింటాకు రూ.1000కి మేము తీసుకుంటాం, తక్కిన మొత్తం మీకు అప్పగిస్తాం, మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా  చూసుకుంటామనే తెరవెనుక ఒప్పందానికి వచ్చారు.  ముందుగా 6వేల క్వింటాళ్లు సమీకరించినట్లు సమాచారం. వీటిని మునపటి తేదీలతో కొనుగోలు చేసినట్లు రికార్డులు సవరించాలనే స్థానిక అధికార యంత్రాంగంపై ఒత్తిడి తీసుకవచ్చారు. ఇప్పట్లో తాము ఇలాంటి సాహసం చేయలేమని ఉన్నతస్థాయిలో ఏమైనా చేసుకోండి, మావల్ల కాదంటూ అధికారులు చేతులెత్తేశారు.

చినబాబు డైరెక్షన్‌..కొనుగోలుకు శ్రీకారం..
గడువు ముగిసిన తర్వాత కందులు కొనుగోలు చేయడం సాధ్యపడదని మార్క్‌ఫెడ్‌ జిల్లాస్థాయి అధికారులు వెల్లండిచిన తర్వాత వ్యవహారం రాజధానికి చేరింది. కమిషనర్‌ స్థాయిలో నిబంధనలు అడ్డువస్తాయని వివరించడంతో ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారాలోకేష్‌ జోక్యం అనివార్యమైనట్లు సమాచారం. కమిషనర్‌పై మంత్రి  లోకేష్‌ ఒత్తిడి పెంచి ఒప్పించినట్లు తెలుస్తోంది. మంత్రి ఆది సూచించిన రైతులు (మంత్రి అనుచరులు) కందులు కొనుగోలు చేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. సీఎం తర్వాత స్థానంలో ఉన్న లోకేష్‌ ఆదేశాలతో మార్క్‌ఫెడ్‌ అధికారులు నిబంధనలు విరుద్ధమైనప్పటికీ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. జమ్మలమడుగు, పెద్దముడియం మండలాలకు చెందిన రైతుల పేరిట కొనుగోలు చేపట్టారు. ప్రస్తుతం 1500 క్వింటాళ్లు కొనుగోలుకు అనుమతులు ఇచ్చారు. ఆమేరకు జమ్మలమడుగు మార్కెట్‌ యార్డులో సోమవారం అధికార యంత్రాంగం కందులు సేకరించింది. మంత్రి ఆది అనుచరులను సంతృప్తి పర్చేందుకు ప్రజాధనానికి కన్నం వేశారని పలువురు ఆరోపిస్తున్నారు. దాదాపు రూ.30లక్షలు అనుచరులకు దోచిపెట్టే చర్యలకు పాల్పడ్డారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు.

ఎండీ నుంచి అనుమతులు తీసుకున్నాం 
మార్క్‌ఫెడ్‌శాఖ రాష్ట్ర మేనేజింగ్‌ డైరక్టర్‌ మ«ధుసూదన్‌రెడ్డి నుంచి అనుమతులు తీసుకున్నాం. జమ్మలమడుగు ఏరియాలో ఈ ఏడాది మార్చి నెలలో రైతులు కందులు విక్రయించుకోలేకపోయారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం నిలిపి వేసే సమయంలో వారు మార్క్‌ఫెడ్‌ సంస్థకు అమ్ముకోలేకపోయారు. అందువల్ల అనుమతులు తీసుకుని తూకాలు వేస్తున్నాం.     –రమేష్, జిల్లా మేనేజర్, 
మార్క్‌పెఢ్‌ సంస్థ, కడప

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top