కర్నూలు జిల్లాలో టీడీపీకి షాక్‌

kurnool district president doctor ram reddy resigns to TDP - Sakshi

ఆ పార్టీకి డాక్టర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రామిరెడ్డి గుడ్‌బై

అదే దారిలో అనుచరులు

కర్నూలు జిల్లా : అధికార తెలుగుదేశం పార్టీకి షాక్‌ తగిలింది. కోవెలకుంట్ల పట్టణానికి చెందిన డాక్టర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు, పార్టీ సీనియర్‌ నాయకుడు  డాక్టర్‌ రామిరెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. సంజామల మండలం కమలపురి గ్రామానికి చెందిన ఈయన 40 సంవత్సరాలుగా కోవెలకుంట్ల పట్టణంలో డాక్టర్‌గా ప్రజలకు సేవలందిస్తున్నారు. రామిరెడ్డి సేవా సమితి ఏర్పాటు చేసి కొన్ని సంవత్సరాల నుంచి పేద  కుటుంబాల జీవనోపాధికి, పేద యువతుల వివాహానికి ఆర్థికసాయం అందిస్తున్నారు.  1987వ సంవత్సరం  స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఎంపీపీ స్థానాన్ని కేటాయిస్తూ  ఎంపీటీసీ టికెట్‌ ఇవ్వగా ఆ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందారు.

అప్పటినుంచి పార్టీలో కొనసాగుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేశారు. గత ఎన్నికల్లో బీసీ జనార్దన్‌రెడ్డికి కోవెలకుంట్ల పట్టణంలో భారీ మెజార్టీ వచ్చేలా చేశారు.  దశాబ్దాల కాలం నుంచి తెలుగుదేశానికి సేవలందిస్తున్న రామిరెడ్డికి  ఇటీవలి  కాలంలో పార్టీలో  గుర్తింపు లేకపోవడం, కొందరి నాయకుల ప్రోద్బలంతో ప్రాధాన్యత తగ్గించడం, తదితర పరిణామాలతో మనస్తాపానికి గురయ్యారు. దీంతో ఆయన తన ముఖ్య అనుచరులు, కార్యకర్తలు, అభిమానుల సూచనలు, సలహాలు తీసుకుని ప్రాధాన్యత ఇవ్వని పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు.

 ఆయనతోపాటు మార్కెట్‌యార్డు మాజీ డైరెక్టర్, గిరిజన సంఘం రాష్ట్ర నాయకుడు శ్రీనివాసనాయక్, మాజీ ఎంపీటీసీ కుమారి, నాగభూషణంరెడ్డి, పాండురంగస్వామి దేవాలయ కమిటీ సభ్యుడు కంభంపాటి నాగేష్,  మాజీ వార్డు మెంబర్‌ బాలరాజు, రామిరెడ్డి సేవా సమితి సభ్యులు బాలరాజు, రఘు, వేణు, నాగార్జున, జిలాని, సంజన్న, వలి, తదితరులు రామిరెడ్డి బాటలో నడవనున్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ రామిరెడ్డి మాట్లాడుతూ 30 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీకి సేవలందించానని, ప్రస్తుతం అక్కడ గుర్తింపు లేకపోవడంతో కలత చెంది పార్టీ వీడినట్లు పేర్కొన్నారు. తనవర్గంలోని ముఖ్యనేతలు, కార్యకర్తలు, అభిమానులతో చర్చించి భవిష్యత్‌ కార్యచరణ ప్రకటిస్తానని  చెప్పారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top