ఆలయ పవిత్రతను భ్రష్టు పట్టిస్తారా: ఎమ్మెల్యే ఫైర్‌

Kovur MLA Nallapareddy Prasanna Kumar Reddy Is Outraged - Sakshi

భక్తుల మనోభావాలను కించపరిస్తే సహించను 

ఉద్యోగిని వెంటనే తొలగించాలని ఆదేశం

సాక్షి, బుచ్చిరెడ్డిపాళెం: పవిత్రమైన కామాక్షితాయి ఆలయ పవిత్రతను భ్రష్టు పట్టిస్తారా, భక్తుల మనోభావాలను గౌరవించరా అంటూ ఈఓ కృష్ణారెడ్డిపై కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయంలో సోమవారం రాత్రి మహిళలు వెలిగించిన కార్తీకదీపాలను తాత్కాలిక ఉద్యోగి శేషురెడ్డి నీళ్లతో ఆర్పివేసిన విషయం సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేసింది. దీనిపై మంగళవారం ఉదయం ఎమ్మెల్యే ఆలయానికి విచ్చేశారు. కార్తీకదీపాలు ఆర్పివేసిన ప్రాంతాన్ని పరిశీలించా రు. కార్తీకదీపాలు ఆర్పివేయాలని ఎవరు చెప్పారని శేషురెడ్డిని ప్రశ్నించారు. కార్తీకమాసం మహిళలకు ఎంతో పవిత్రమని, ఈ క్రమంలో భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ వెలిగించిన కార్తీకదీపాలను ఆర్పివేయడం ఏమిటని మండిపడ్డారు.

వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారి ఆలయానికి వచ్చిన భక్తుల విషయంలో ఇలా వ్యవరిస్తారా అని ప్రశ్నించారు. అమ్మవారు ఎంతో శక్తివంతమైనదన్నారు. పూజారులు, ఉద్యోగులు రాజకీయాలు చేస్తూ ఆలయాని అభాసుపాలుచేస్తున్నారన్నారు. కామాక్షితాయి అమ్మవారిని కొలిచేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నారన్నారు. భక్తుల మనోభావాలు కించపరిస్తే సహించేది లేదని తేల్చిచెప్పారు. వెంటనే శేషురెడ్డిని ఉద్యోగం నుంచి తొలగించాలన్నారు. ఇంత జరుగుతున్నా ఎందుకు నిర్లక్ష్యం వహించారని కృష్ణారెడ్డిపై మండిపడ్డారు. ఉద్యోగి శేషురెడ్డిని తొలగిస్తున్నట్లు ఈఓ తెలిపారు. 

పరిశుభ్రత పాటించరా 
ఆలయం పరిసరాలతో పాటు చుట్టుపక్కల అపరిశుభ్రంగా ఉండడంపై ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఈఓను ప్రశ్నించారు. ఆలయంలో పగిలిన చెత్తకుండీలుండడం, పెన్నానదికి వెళ్లేమార్గంలో పారిశుద్ధ్యం తిష్టవేసి దుర్గంధం వెదజల్లడం, ఆలయ వ్యర్థపు నీరు పెన్నానదిలో కలవడంపై ఎమ్మెల్యే ఈఓపై మండిపడ్డారు. పూజాసామగ్రి తదితరాలకు చెందిన సామగ్రి వేసేందుకు పగిలిన చెత్తకుండీలు ఏర్పాటు చేయడం ఏమిటని అడిగారు. కొత్త కుండీలు ఎక్కడని ప్రశ్నించారు. ఆలయం ముందు పెన్నానదికి వెళ్లే మార్గంలో ఉన్న దుర్గంధం వెదజల్లుతున్న చెత్తను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన పెన్నానదిలో ఆలయం నుంచి వ్యర్థపునీరు కలవడంపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఆలయం పరిసరాలతో పాటు బ్రిడ్జిపై మందుబాబుల జోరు ఎక్కువగా ఉంటే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని అడిగారు. ఎమ్మెల్యే వెంట సీఐ సురేష్‌ బాబు, ఎస్సై జిలానీబాషా, పార్టీ నాయకులు సూరా శ్రీనివాసులురెడ్డి, చీమల రమేష్‌బాబు, టంగుటూరు మల్లికార్జున్‌ రెడ్డి, షేక్‌ అల్లాభక్షు, పిల్లెళ్ల మోహన్‌మురళీకృష్ణ, దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబురెడ్డి, నాపా వెంకటేశ్వర్లు నాయు డు, పిల్లెళ్ల సాగర్, నాటారు బాలకృష్ణ ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top