అడ్రెస్‌ గల్లంతు

Kotla KE Lost In Elections - Sakshi

కోట్ల, కేఈ కుటుంబాలకు ప్రజల గుణపాఠం 

భూమా, బుడ్డా, గౌరు కుటుంబాలదీ ఇదే పరిస్థితి 

పార్టీ మారిన నేతలకు చెంపదెబ్బ 

సాక్షి ప్రతినిధి, కర్నూలు:  జిల్లాలో పేరుపొందిన రాజకీయ కుటుంబాలన్నీ ఇంటిబాట పట్టాయి. తెలుగుదేశం పార్టీలో ఉన్న, చేరిన కేఈ, కోట్ల కుటుంబాలతో పాటు భూమా, బుడ్డా, గౌరు కుటుంబాలకు రాజకీయంగా ప్రజలు సమాధి కట్టారు. కర్నూలు ఎంపీ స్థానానికి పోటీ చేసిన కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి కోలుకోలేని దెబ్బ తగిలింది. గతంలో కోట్ల, కేఈ కుటుంబాల మనుగడ కోసం బలైపోయిన వారి ఆత్మక్షోభ సాక్షిగా నేడు ప్రజాతీర్పు వెలువడటం జిల్లా అంతటా చర్చనీయాంశంగా మారింది. ఇద్దరి నేతల అంతరంగం ఒక్కటేనన్న విషయాన్ని జీర్ణించుకోలేని అభిమానులు తమ ఆత్మాభిమానాన్ని చంపుకోలేమని నిక్కచ్చిగా తేల్చిచెప్పారు. ఓటుతో తగిన బుద్ధి చెబుతూ లోప భూయిష్టమైన రాజకీయాలకు ఇకనైనా  స్వస్తి పలకాలని ఆ నేతలకు ప్రత్యక్షంగా హితవు పలికారు. ఇన్నాళ్ల పాటు జిల్లా రాజకీయాలను శాసించిన నేతలు నేడు ఓటమిపాలు కావడంతో ఇప్పటిదాకా వారి వెంట ఉన్న అభిమానులు, కార్యకర్తలు అంతర్మథనంలో పడిపోయారు.  

పార్టీ మారిన నేతలకు వాత 
2014 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన బుడ్డా రాజశేఖరరెడ్డి, భూమా అఖిలప్రియలకు ఈ ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. అధికార పార్టీ చూపిన డబ్బు సంచులకు, మంత్రి పదవులకు అమ్ముడుపోయిన వారికి ఓటు వేసేది లేదని తెగేసి చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు అఖండ మెజార్టీ ఇచ్చి గెలిపించారు.  

కర్నూలులో టీజీకి ఎదురు దెబ్బ 
పారిశ్రామిక వేత్తగా, వ్యాపారవేత్తగా జిల్లా రాజకీయాలను శాసించే దురంధరులలో టీజీ వెంకటేశ్‌ ఒక్కరు. ప్రత్యర్థులను తన కాసులతోనే మట్టి కరిపించేందుకు పదును పెట్టే వ్యూహాలను రచించే మేధావి. నేడు తన కుమారుడు టీజీ భరత్‌ రాజకీయ అరంగేట్రంతో మరోసారి రాజకీయ చక్రాన్ని తిప్పాలని వ్యూహాలు పన్నారు. డబ్బులు, ప్రలోభాలతో ప్రజలను, నాయకులను మభ్య పెట్టారు. అయినప్పటికీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభజనం ముందు టీజీ కుయుక్తులు పారకపోవడం, ఓటర్లు గట్టిగా బుద్ధి చెప్పడంతో టీజీ భరత్‌ ఓటమి పాలయ్యారు.  

వారసులుగా శిల్పా రవి, గంగుల నాని  
శిల్పా మోహన్‌రెడ్డి కుమారుడు రవిచంద్రకిశోర్‌రెడ్డి నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, గంగుల ప్రభాకర్‌రెడ్డి కుమారుడు బ్రిజేంద్రరెడ్డి (నాని) అళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. వీరిద్దరూ విజయఢంకా మోగించడంతో ఆయా నియోజకవర్గాల్లోని పార్టీ అభిమానుల్లో, కార్యకర్తల్లో హర్షం వ్యక్తమవుతోంది.  

ఓటమి పాలైన కేఈ శ్యాంబాబు 
గత ఎన్నికల్లో పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కేఈ కృష్ణమూర్తి రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. జిల్లాలో సీనియర్‌ బీసీ నేతగా ఉన్న కేఈ కృష్ణమూర్తి ఈ ఎన్నికల్లో తన కుమారుడు కేఈ శ్యాంబాబు గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారు. ఓ వైపు ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ కూడా  శ్యాంబాబు గెలుపు కోసం వ్యూహాలు రచించారు. అయితే ముఠా తగాదాలను జీర్ణించుకోలేని పత్తికొండ నియోజకవర్గ ప్రజలు కేఈ శ్యాంబాబును ఓటమి పాలు చేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top