
'జగన్ అంటే టీడీపీ నేతలకు ఎందుకంత వణుకు'
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే టీడీపీ నేతలకు ఎందుకంత వణుకని ఆపార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు.
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే టీడీపీ నేతలకు ఎందుకంత వణుకని ఆ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేయాలని టీడీపీ నేతలకు హితవు పలికారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేకే ఆరోపణలు చేస్తున్నారని శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు.
70 మంది ఎమ్మెల్యేలు, 9మంది ఎంపీలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమరోత్సాహంతో ముందుకు వెళుతుందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నరేంద్ర మోడీ, వైఎస్ జగన్ మధ్య జరిగిన ఏకాంత చర్చలు ఈనాడు దినపత్రికకు ఎలా తెలిశాయని ఆయన ప్రశ్నించారు. కోర్టులను కించపరిచేలా ఈనాడు కథనం రాసిందన్నారు. అటువంటి రాతలపై న్యాయస్థానాలు చర్యలు తీసుకోవాలని శ్రీధర్ రెడ్డి కోరారు. సభ్య సమాజం తలదించుకునేలా తిరుమలలో టీడీపీ కార్యకర్తలు వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మద్యం సేవించి తిరుమలలో దుకాణదారులపై దాడులు చేసిన విషయం తెలిసిందే.