తెలంగాణ ఉద్యమంలో వెయ్యి మందికి పైగా విద్యార్థులు చనిపోతే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక్కమాట కూడా మాట్లాడకపోవటం ఆయనకు మానవత్వం లేదని గుర్తు చేస్తోందని ఎంపీ కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి విమర్శించారు.
పరిగి, న్యూస్‌లైన్: తెలంగాణ ఉద్యమంలో వెయ్యి మందికి పైగా విద్యార్థులు చనిపోతే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక్కమాట కూడా మాట్లాడకపోవటం ఆయనకు మానవత్వం లేదని గుర్తు చేస్తోందని ఎంపీ కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం రాత్రి పరిగిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సోనియా గాంధీ దయతో సీఎం అయిన కిరణ్ ఏ మాత్రం కృతజ్ఞత లేకుండా అధిష్టానం నిర్ణయాన్ని తప్పుబడుతున్నారని మండిపడ్డారు.
బుద్ధి గడ్డితిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఆయనకు సీఎం అయ్యే ఏ ఒక్క అర్హత లేదన్నారు. తెలంగాణ ఏర్పాటును ఆపుతామనడం సీమాంధ్ర నాయకుల భ్రమేనన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ఏర్పాటుకు అడ్డుతగలటం మానుకోవాలని హితవు పలికారు. హైదరాబాద్‌లో స్వేచ్ఛగా బతికేందుకు హామీ ఇస్తున్నామన్నారు. పీసీసీ కార్యదర్శి టి.రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఇస్తున్నారని గుర్తు చేశారు. దీనికి తెలంగాణ ప్రజలంతా పార్టీలకతీతంగా ఆమె పట్ల కృతజ్ఞత తో మెలగాలన్నారు. ఫిబ్రవరిలోపు తెలంగాణ ఏర్పాటు ఖాయమన్నారు. కొత్త రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో పార్టీ పరిగి మండల అధ్యక్షుడు బి.నారాయణ్‌రెడ్డి, గండేడ్ మండల అధ్యక్షుడు వెంకట్‌రాంరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మేఘమాల, మహిళా నాయకులు సురేఖారెడ్డి, విజయలక్ష్మి పాల్గొన్నారు.