అన్ని ప్రాంతాల గౌరవాన్ని పొందాల్సిన ముఖ్యమంత్రి కుర్చీలో ఉంటూ కిరణ్‌కుమార్‌రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాక్షి, హైదరాబాద్: అన్ని ప్రాంతాల గౌరవాన్ని పొందాల్సిన ముఖ్యమంత్రి కుర్చీలో ఉంటూ కిరణ్‌కుమార్‌రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, తెలంగాణకు పచ్చి వ్యతిరేకిగా మాట్లాడుతున్నాడని విమర్శించారు. ముఖ్యమంత్రి అంటే మూడు ప్రాంతాల ప్రజలు గౌరవించే విధంగా ఉండాలని, ఆయన ఒక ప్రాంతానికి అనుకూలంగా మరొక ప్రాంతానికి వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదని అన్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటే తెలంగాణ ప్రజలకు ఏమీ అభ్యంతరం లేదని పేర్కొన్నారు.
టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం హైదరాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన ‘హైదరాబాద్ సిర్ఫ్ హమారా’ సదస్సులో కోదండరాం మాట్లాడారు. కిరణ్ వ్యవహార శైలిని రాజ్యాంగబద్ధమైన సంస్థలు, న్యాయస్థానాలతో పాటు ఆయన సొంతపార్టీ నేత అయితే దిగ్విజయ్‌సింగ్ కూడా తప్పుబట్టిన విషయాన్ని ఆయన గుర్తుంచుకుంటే మంచిదని సూచించారు. సీఎం సహా ఎవరు అడ్డుపడినా తెలంగాణ ఏర్పాటు ఆగదని ధీమా వ్యక్తం చేశారు.
ఈ నెల 29న జరిగే సకల జనభేరిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మొన్నటివరకూ కిరణ్‌కుమార్‌రెడ్డి అంటే ఎవరో ఎవరికీ తెలియదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు చెప్పారు. ఇప్పటికీ ఆయన నెత్తిమీద రూపాయి పెట్టినా ఆఠాణాకు కూడా అమ్ముడుపోరని ఎద్దేవా చేశారు. దున్నపోతుకు సున్నం వేస్తే ఎద్దుగా మారిపోదని, సీమాంధ్ర నేత కిరణ్‌కుమార్‌రెడ్డిలో తెలంగాణ వ్యతిరేకత పోదని అన్నారు. తెలంగాణను అడ్డుకోవడంలో సీమాంధ్రకు చెందిన వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రబాబు, కిరణ్ అంతా ఒక్కటేనని విమర్శించారు. ఎమ్మెల్సీ కె.స్వామిగౌడ్ మాట్లాడుతూ ఇప్పటిదాకా హైదరాబాద్‌లో కబ్జా చేసుకున్న భూములను క్రమబద్ధీకరించుకోవడానికే యూటీ చేయాలంటున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రవణ్ కుమార్, టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు బాల్క సుమన్, బాబా ఫసియుద్దీన్ ప్రసంగించారు. సదస్సుకు ముందు గన్‌పార్కు వద్ద తెలంగాణ అమర వీరులకు నేతలు నివాళులర్పించారు.
హైదరాబాద్ అంటే చీరేస్తాం: కేటీఆర్
పాలు కావాలంటే ప్రేమతో ఖీర్ ఇస్తామని, హైదరాబాద్‌ను అడిగితే చీరేస్తామని ఏపీఎన్‌జీఓ అధ్యక్షుడు అశోక్‌బాబును కేటీఆర్ హెచ్చరించారు. హైదరాబాద్ అశోక్‌బాబు అయ్య జాగీరు కాదన్నారు. గురువారం హైదరాబాద్ ఆజంపురాలో జరిగిన సకల జనభేరీ సన్నాహక సదస్సులోనూ ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, మహమూద్ అలీ, టీఆర్‌ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.