ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు అనుబంధ సభ్యులుగా పాల్గొనే అవకాశాన్ని కల్పించాలని ఖమ్మం జిల్లా భద్రాచలం, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, తాటి వెంకటేశ్వర్లు సోమవారం గవర్నర్ నరసింహన్‌ను కలసి విజ్ఞప్తి చేశారు.
గవర్నర్‌కు ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, తాటి వెంకటేశ్వర్లు విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు అనుబంధ సభ్యులుగా పాల్గొనే అవకాశాన్ని కల్పించాలని ఖమ్మం జిల్లా భద్రాచలం, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, తాటి వెంకటేశ్వర్లు సోమవారం గవర్నర్ నరసింహన్‌ను కలసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పునర్విభజనలో భాగంగా జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలిపివేయడంతో ఆ మండలాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తాము స్థానిక ప్రజాసమస్యల పరిష్కారం కోసం అక్కడి ప్రభుత్వం, పాలన యంత్రాంగంతో సంప్రదింపులు జరుపలేకపోతున్నామని గవర్నర్ దృష్టికి తెచ్చారు.
ఏపీ ఐటీడీఏ పాలక మండలి, జిల్లాస్థాయి సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం కల్పించాలని కూడా వారు కోరారు. నిధులు, విధులు, సంక్షేమ పథకాల్లో భాగస్వామ్యం కల్పించేలా ఏపీ సర్కార్‌కు తగు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యేలు రాజయ్య, తాటి వెంకటేశ్వర్లు విలేకరులతో మాట్లాడుతూ, తమ విజ్ఞప్తికి గవర్నర్ సానుకూలంగా స్పందించి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.