కేరళ వరదల్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి

Kerala floods should be declared as a national disaster - Sakshi

     కేంద్రం ఇంకా బాధ్యతగా వ్యవహరించాలి 

     రూ.600 కోట్లిచ్చి చేతులు దులుపుకోవడం సరికాదు 

     రాష్ట్రం తరఫున రూ.10 కోట్లు, 2 వేల టన్నుల బియ్యం పంపిస్తున్నాం 

     గోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాలో వర్షాల ప్రభావం  

     సీఎం చంద్రబాబు  

సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ఇంకా బాధ్యతగా వ్యవహరించాలని.. వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం చంద్రబాబు డిమాండ్‌ చేశారు. అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు సహకరించాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందన్నారు. రూ.600 కోట్లిచ్చి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మన రాష్ట్రంలో హుద్‌హుద్‌ తుఫాన్‌ వచ్చినప్పుడు ప్రధాని రూ.వెయ్యి కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారని, కానీ రూ.650 కోట్లే ఇచ్చారని విమర్శించారు.

రాష్ట్రాల్లో జాతీయ విపత్తులు సంభవించినప్పుడు ఖర్చు చేసేందుకు 14వ ఆర్థిక సంఘంలో కేటాయించిన రూ.62 వేల కోట్లు చాలా తక్కువన్నారు. దీన్ని 15వ ఆర్థిక సంఘంలోనైనా పెంచాలని కోరారు. కేరళకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.10 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించినట్లు తెలిపారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కోరిక మేరకు రూ.6 కోట్ల విలువైన మరో 2 వేల టన్నుల బియ్యాన్ని పంపిస్తున్నట్లు తెలిపారు. ఇక ఎన్జీవో జేఏసీ, పెన్షనర్లు, సచివాలయ ఉద్యోగుల జేఏసీ కలిసి రూ.24 కోట్లు.. పోలీసు అధికారులు, ఉద్యోగులు రూ.7 కోట్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రూ.2.5 కోట్లు ప్రకటించారని చెప్పారు. త్వరలో ఆ రాష్ట్రానికి ఒక ప్రతినిధి బృందాన్ని పంపి సంఘీభావం తెలుపుతామని చెప్పారు. 

ఎంత నష్టం జరిగిందో అంచనా వేస్తున్నాం..
మన రాష్ట్రంలోని తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉందని సీఎం చెప్పారు. వర్షాల తీవ్రత ఎక్కువగా ఉన్న 15 గ్రామాల్లో 16 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 6,336 మందిని తరలించినట్లు తెలిపారు. ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్న ప్రాంతాలకు పంపించేందుకు నిత్యావసర వస్తువులు సిద్ధం చేశామన్నారు. పంటలు దెబ్బతిన్న చోట ఎంత నష్టం జరిగిందో అంచనా వేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. 

ఇంకా రూ.33 వేల కోట్లు కావాలి.. 
నాలుగేళ్లలో సాగునీటి రంగంపై రూ.56 వేల కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. వచ్చే జూన్‌ నాటికి 29 ప్రాజెక్టులు పూర్తవుతాయన్నారు. ప్రాజెక్టులన్నీ పూర్తికావాలంటే ఇంకా రూ.33,760 కోట్లు అవసరమని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇంకా రూ.2,620 కోట్లు ఇవ్వాల్సి ఉందని, డీపీఆర్‌ పంపించినా దాన్ని క్లియర్‌ చేయలేదని చెప్పారు. చిత్రావతి ద్వారా పులివెందులకు నీళ్లిచ్చినట్లు తెలిపారు. జలవనరుల శాఖ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు ప్రాజెక్టుల కోసం బాగా కష్టపడుతున్నారని, అందుకే ఆయన పేరును పద్మశ్రీకి సిఫారసు చేశామని సీఎం చెప్పారు. కానీ అధికారులకు ఇవ్వబోమంటూ కేంద్రం తిరస్కరించిందని తెలిపారు. వచ్చే ఏడాది కృష్ణానదిపై వైకుంఠపురం బ్యారేజీని పూర్తి చేసి.. ఆ తర్వాత ప్రకాశం బ్యారేజీ దిగువన చోడవరం వద్ద మరో చిన్న బ్యారేజీ కడతామని తెలిపారు. 

సీఎంను సన్మానించిన కుల సంఘాల నేతలు
బ్రాహ్మణ సంక్షేమ సంస్థ, అఖిల భారత కాపు ఫెడరేషన్‌ ప్రతినిధులు సోమవారం ఉండవల్లి గ్రీవెన్స్‌ హాలులో ముఖ్యమంత్రి చంద్రబాబును సన్మానించారు. ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ఆ సంస్థ చైర్మన్‌ వేమూరి ఆనంద సూర్య చంద్రబాబును గజమాలతో సత్కరించారు. బలిజలను బీసీల్లో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు అఖిల భారత కాపు ఫెడరేషన్‌ ప్రతినిధులు చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top