తరుముకొస్తున్న తుపాను

Kakinada Port Announced Third Number Danger Alert - Sakshi

కడలి కల్లోలం 

కాకినాడ పోర్టులో మూడో నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ

ఎగసి పడుతున్న అలలు 

జిల్లాలో నేడు, రేపు భారీ వర్షాలు

అప్రమత్తమైన అధికారులు

ఫొని తుపాను జిల్లా వాసులను హడలెత్తిస్తోంది. కొంతమంది రైతుల పొలాల్లో కోసిన వరి పనలుండిపోయాయి. మరికొంతమంది రైతుల కళ్లాల్లో నూర్పులకు సిద్ధం చేసిన వరి కుప్పలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఓ వైపు తుపాను ఎటు పయనిస్తోందో...తుపాను ముప్పు తప్పినా భారీ వర్షాలు జిల్లాలో కురిస్తే చేతికొచ్చిన పంటల పరిస్థితేమిటోనని ఆందోళన చెందుతున్నారు. వేట నిషేధం కారణంగా మత్స్యకారులు వేటకు దూరంగా ఉండడం కొంత ఊరట. కానీ సముద్రం అలలు ఉవ్వెత్తున లేవడం, సముద్రం కొన్ని మీటర్ల ముందుకు వచ్చేస్తుండడంతో తీరప్రాంతవాసులను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటోంది.

తూర్పుగోదావరి  ,కాకినాడ సిటీ: ‘ఫొని’ తుపాను ప్రభావం ఫలితంగా  అలలు ఉవ్వెత్తున లేస్తుండడంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రతీరం కోత కు గురవుతోంది. తుపాను తీవ్రతను తెలియజేస్తూ కాకినాడ పోర్టులో మూడో నంబర్‌ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి ఆగ్నేయంగా 870 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై... ఇది క్రమేపీ ఆ రాష్ట్ర తీరంవైపు కదులు తోందని, 1, 2 తేదీల్లో ఒడిశా తీరాన్ని తాకుతుందని అధికారులు చెబుతున్నారు.  జిల్లాపై ప్రభావం ఉంటుందని ముందుగా భావించినప్పటికీ వాయవ్య దిశగా పయనిస్తోందని అంచనా వేయడంతో జిల్లాకు ప్రమాదం ఏమీ ఉండదని అధికారులు చెబుతున్నారు. అయినా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, పల్లపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మత్స్యకార గ్రామాల్లో టాంటాం, మైకుల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే తీరప్రాంత మండలాలుగా ఉన్న 14 మండలాల్లో ప్రత్యేక అధికారులను నియమించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అన్ని ఆర్డీవో కార్యాలయాలతోపాటు తహసీల్దార్‌ కార్యాలయాల్లోనూ ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఒడిశా ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించడంతో ఆ ప్రభావంతో జిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

కాకినాడ తీరంలో పది మీటర్ల ముందుకు...
కాకినాడ తీరంలోని సముద్రం పది మీటర్లు ముందుకు చొచ్చుకువచ్చిందని మత్స్యకారులు చెబుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పెద్ద ఎత్తున పర్యాటకులు బీచ్‌కు తరలి వచ్చారు. పోలీసులు బీచ్‌కు వచ్చే పర్యాటకులను సముద్రతీరానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ప్రధాన ద్వారాలను బారికేడ్లతో మూసివేశారు. సముద్రంలో స్నానాలు చేస్తున్న పర్యాటకులకు తుపాను హెచ్చరికలు తెలియజేస్తూ సముద్ర తీరం నుంచి బయటకు పంపే కార్యక్రమాలు చేపట్టారు.  తుపాను గమనం రోజురోజుకూ మారుతుండడంతో అధికారులు కూడా ఫొని తుపానుపై కచ్చితమైన సమాచారం ఇవ్వలేకపోతున్నారు. బుధవారం మధ్యాహ్నానికి స్పష్టత వచ్చే అవకాశం ఉందని కలెక్టరేట్‌ వర్గాలు తెలిపాయి. తుపాను ప్రభావంతో తీరప్రాంతాల్లో 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

తీరంలో అప్రమత్తత...
గత మూడు రోజులుగా సముద్రంలో అలజడి పెరి గింది. జిల్లాలో తీరప్రాంత మండలాలుగా ఉన్న 14 మండలాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. స ముద్ర వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారులు ప్రస్తుతం ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి జూన్‌ 15వ తేదీ వరకు సముద్రంలో వేటపై నిషేధం ఉండటంతో సురక్షిత ప్రాంతాల్లోనే ఉన్నారు. గత మూడు రోజులుగా సముద్రంలో చోటుచేసుకుంటున్న మార్పుల నేపథ్యంలో పడవలు, వలలు తీరం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు మత్స్యకారులు చేపట్టారు. అలల తీవ్రత పెరిగి మూడు మీటర్ల ఎత్తులో ఎగిసి పడుతున్నాయి. జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ముందస్తు హెచ్చరికలతో తీరప్రాంత గ్రామాలను అప్రమత్తం చేశారు.  ప్రత్యేక అధికారులు తహసీల్దార్లతో తీరప్రాంత గ్రామాల పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 39 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదు కావడంతో వడగాలులు కూడా మొదలయ్యాయి.

వేగం తగ్గిన ఫొని పయనం...
బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఫొని తుపాను వేగం తగ్గిందని కాకినాడ పోర్టు అధికారులు తెలిపారు. ఇది ఒడిశా వైపు పయనిస్తుందని, రాష్ట్రం మీదుగా పయనించే సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది బుధ, గురువారాల్లో ఒడిశా తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్టు తెలిపారు.

నేడు, రేపు వర్ష సూచన...
బుధ, గురువారాల్లో జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లా కలెక్టర్‌ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించి ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. అవసరమైతే పోలీస్‌ శాఖ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని పోలీస్‌ అధికారులతో మాట్లాడి సముద్రతీర ప్రాంతాల్లో మెరైన్‌ పోలీసులతో గస్తీ ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే రైతులు పండించిన పంట ను రక్షించుకునే చర్యలు ముమ్మరంగా చేపట్టారు. కళ్లాల్లోనే ధాన్యం ఉండిపోవడంతో వాటిని ఒబ్బిడి చేసుకునే పనిలో తలమునకలయ్యారు.

వర్షాలు రాకపోతే వడగాలులు...
తుపాను దిశను మార్చుకొని వేరే ప్రాంతానికి తరలితే జిల్లాలో బుధవారం నుంచి వడగాలులు వీచే అవకాశముందని, ఎవరికీ వడదెబ్బ తగలకుండా వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఆదేశించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top