కేవలం ఐదు గంటల వ్యవధిలో గుంటూరు నుంచి విశాఖకు కిడ్నీ తరలించి నగరవాసి ప్రాణాన్ని నిలిపారు పోలీసులు.
ఓ వ్యక్తికి ప్రాణదానం
విశాఖ మెడికల్ : కేవలం ఐదు గంటల వ్యవధిలో గుంటూరు నుంచి విశాఖకు కిడ్నీ తరలించి నగరవాసి ప్రాణాన్ని నిలిపారు పోలీసులు. మణిపాల్ ఆసుపత్రిలో ఈనెల 31న జరిగిన ఈ కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలో పోలీసులు పోషించిన పాత్ర అమోఘమని ఆసుపత్రి యాజమాన్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. గుంటూరుకు చెందిన 54 సంవత్సరాల వ్యక్తి గత నెల 31న మరణించాడు.
అవయవధానం చేసిన అతని నుంచి అదే రోజు కిడ్నీని సేకరించి అంబులెన్స్ ద్వారా గుంటూరు-విజయవాడ మీదుగా విశాఖ నగరానికి కేవలం ఐదు గంటల వ్యవధిలో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చేసి రప్పించారు. ఆ కిడ్నీని విశాఖకు చెందిన 51 సంవత్సరాల వ్యక్తికి మణిపాల్ ఆసుపత్రి వైద్యులు శస్త్ర చికిత్స ద్వారా అమర్చి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఇందుకు సహకరించిన పోలీసు విభాగానికి కిడ్నీ గ్రహీత కుటుంబ సభ్యులు, మణిపాల్ ఆసుపత్రి యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.