
దీక్షా సమరం
జననేత జగన్‌మోహన్‌రెడ్డి దీక్షాస్త్రం రాష్ట్రంలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయన నిరవధిక నిరశనకు సంఘీభావంగా జిల్లాలో దీక్షాయజ్ఞం మొదలైంది.
జననేత జగన్‌మోహన్‌రెడ్డి దీక్షాస్త్రం రాష్ట్రంలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయన నిరవధిక నిరశనకు సంఘీభావంగా జిల్లాలో దీక్షాయజ్ఞం మొదలైంది. సమన్యాయమా.. సమైక్యమా తేల్చాలంటూ అధినేత బాటలో మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్, యువనాయకుడు జ్యేష్ఠ శ్రీనాథ్ మైలవరంలో ఆమరణ దీక్ష చేపట్టారు. వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం ఆధ్వర్యంలో వైద్యులతో పాటు వివిధ ప్రాంతాల్లో రిలే దీక్షలు నిర్వహించారు. ఎన్జీవోలు, వివిధ వర్గాలు జగన్ దీక్షకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. సోమవారం నుంచి మరికొందరు ఆమరణ, రిలే దీక్షలకు సమాయత్తమవుతున్నారు.
సాక్షి, విజయవాడ : దీక్షా సమరం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రజలందరికీ సమన్యాయం చేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహనరెడ్డి చంచల్‌గూడ జైలులో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీక్షకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు కదులుతున్నాయి. జననేత దీక్షకు మద్దతుగా ఆదివారం పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్, మైలవరం వైఎస్సార్ సీపీ యూత్ నాయకుడు జ్యేష్ఠ శ్రీనాథ్‌లు మైలవరంలో ఆమరణ దీక్షలు మొదలుపెట్టారు. విజయవాడ, పెనమలూరు, పెడన ఇతర ప్రాంతాలలో ఆయనకు మద్దతుగా రిలేదీక్షలు, నిరసన ప్రదర్శనలు సాగాయి. జిల్లాలోని ఇతర నియోజకవర్గాలలో కూడా దీక్షలు, ఆందోళనలు చేసేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి.
మైలవరంలో జోగి రమేష్ చేపట్టిన ఆమరణ దీక్షను ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణ త్యాగంతోనైనా రాష్ట్రానికి మేలు చేయాలన్న తలంపుతో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గుంటూరులో ఆమరణ నిరాహార దీక్షలో కూర్చుంటే.. దాన్ని భగ్నం చేసేందుకు పాలకవర్గాలు అత్యంత పాశవికంగా వ్యవహరించాయని విమర్శించారు. అంబులెన్స్ కూడా లేకుండా సాధారణ వాహనంలో ఆమెను ఆస్పత్రికి తరలించడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందన్నారు.
ఆస్పత్రిలో విజయమ్మ దీక్ష కొనసాగిస్తానంటే.. ఆమె ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తానే ఆమరణ దీక్ష నిర్వహిస్తానని చెప్పడం జగన్‌మోహన్‌రెడ్డి మనోధైర్యానికి నిదర్శనమన్నారు. సామాన్య పౌరుడు ఎక్కడ ఉన్నా దీక్ష చేయటానికి అర్హుడేనని, ఎటువంటి అడ్డంకులు ఉండవని న్యాయనిపుణులు చెబుతున్నా.. దీనిపై కాంగ్రెస్, టీడీపీలు రాద్ధాంతం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దీక్ష చేస్తున్న జోగి రమేష్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం పోరాడే దమ్ము, ధైర్యం వైఎస్ కుటుంబానికే ఉన్నాయని అన్నారు. జనం కోసం జగన్, విజయమ్మలు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి రాష్ట్ర విభజనలో ప్రజలకు సమన్యాయం చేయాలని లేకుంటే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్షలు చేయడం వారి గుండెధైర్యాన్ని, కార్యదీక్షను తెలియజేస్తుందని పేర్కొన్నారు.
పార్టీ యువ నాయకుడు జ్యేష్ఠ శ్రీనాథ్ కూడా మైలవరంలో ఆమరణ దీక్ష ప్రారంభించారు. ఆ సభలో మైలవరం నియోజకవర్గం సమన్వయకర్త జ్యేష్ఠ రమేష్‌బాబు మాట్లాడుతూ మూడు ప్రాంతాల ప్రజలకు సమన్యాయం జరగాలని వైఎస్సార్‌సీపీ కోరితే దాన్ని పక్కన బెట్టి రాష్ట్ర విభజనకు ఆ పార్టీ కూడా అంగీకార పత్రం ఇచ్చిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించిన మహానేత వైఎస్ వారసులు ప్రస్తుతం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఆందోళన చేపట్టారని చెప్పారు. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డిలు తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడగా ప్రస్తుతం స్వార్థం కోసం కాంగ్రెస్, టీడీపీలు తాకట్టుపెట్టాయని విమర్శించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని పరిరక్షించేందుకు జగన్‌మోహన్‌రెడ్డి జైలు నుంచే దీక్ష చేపట్టారని అన్నారు. సమ న్యాయం జరగలన్నా, రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నా.. ఆ లక్ష్యాన్ని సాధించడం వైఎస్ కుటుంబ సభ్యులకే సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
ఈ రెండు దీక్షా శిబిరాలను వందలాది మంది సందర్శించి పార్టీలు, కులమతాలకు అతీతంగా జోగి రమేష్, జ్యేష్ఠ శ్రీనాథ్‌లకు సంఘీభావం తెలిపారు. వైఎస్సార్ సీపీ వైద్యవిభాగం కన్వీనర్ డాక్టర్ గోసుల శివభరత్‌రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని ఐఎంఏ హాల్ వద్ద రిలేదీక్షలు జరిగాయి. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ మద్దతు ప్రకటించారు. ఈ దీక్షల్లో వైద్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త పి.గౌతంరెడ్డి నేతృత్వంలో 59వ డివిజన్ ఎన్‌ఎస్‌సీ బోస్ నగర్‌లో రిలే నిరాహార దీక్షలు జరిగాయి. జగన్ దీక్షలకు మద్దతుగా పెడనలో పార్టీ సమన్వయకర్త వాకా వాసుదేవరావు ఆధ్వర్యంలో రిలేదీక్షలు చేశారు.
ఉయ్యూరులో పార్టీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త పడమట సురేష్‌బాబు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. దళితవాడలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘననివాళులర్పించి అక్కడ్నుంచి కాగడాలతో ఉయ్యూరు మునిసిపల్ కార్యాలయం సమీపంలోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు ప్రదర్శన చేశారు. నడుపూరు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెడన సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ నేతృత్వంలో రాస్తారోకో నిర్వహించారు. నడుపూరు గ్రామంలోని ఎమ్‌ఎన్‌కే రహదారిపై అరగంట పాటు బైఠాయించారు. జగన్‌కు మద్దతుగా మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ జువ్వాది రుద్రయ్య సోమవారం నుంచి ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు.