సమన్యాయం చేయాలి లేదా రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలంటూ జైల్లో ఆమరణదీక్ష చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యంపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
సాక్షి, విజయవాడ : సమన్యాయం చేయాలి లేదా రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలంటూ జైల్లో ఆమరణదీక్ష చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యంపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయన్ను ఆస్పత్రికి తరలించ డంతో ప్రజలు పత్రికా కార్యాలయాలకు ఫోన్లు చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలో జననేత దీక్షకు దన్నుగా పార్టీ నేతలు, కార్యకర్తలు చేపట్టిన ఆమరణ దీక్షలను భగ్నం చేయాలంటూ పాలకుల నుంచి పోలీసులకు ఆదేశాలు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ దీక్షలు కొనసాగితే ఉద్యమం మరింతగా వేళ్లూనుకుంటుందనే భయం వారిని వెంటాడుతోంది.
ఈ క్రమంలోనే పోలీసులు గురువారం రాత్రి కొందరు దీక్షాదక్షులను బలవంతంగా శిబిరాలనుంచి ఆస్పత్రులకు తరలించారు. జగన్ దీక్షకు మద్దతుగా గురువారానికి 29 మంది ఆమరణ నిరశనలో ఉన్నారు. తిరువూరులో మూడు రోజులుగా దీక్ష చేస్తున్న ఆరుగురిని తొల గిం చారు. పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్, మైలవరం యువజన నేత జ్యేష్ఠ శ్రీనాథ్ మైలవరంలో చేపట్టిన దీక్షలు ఐదోరోజుకు చేరుకున్నాయి. వీరి ఆరోగ్యం క్షీణిం చినట్లు వైద్యులు పేర్కొన్నారు. దీంతో వీరిని బలవంతంగా ఆస్పత్రికి తరలించి దీక్ష భగ్నం చేశారు.
నందిగామలో దీక్ష చేస్తున్న వినుకొండ రామారావుకు జ్వరం రావడంతో ఆస్పత్రికి తరలించారు. దీంతో 20 మంది దీక్షలు కొనసాగిస్తున్నారు. పెడనలో నాలుగురోజులుగా దీక్ష చేస్తున్న ఉప్పాల రాము ఆరోగ్యం క్షీణిస్తోంది. రక్తపోటు స్థిరంగా ఉన్నా షుగర్ లెవెల్ తగ్గుముఖం పడుతున్నాయని వైద్యులు తెలిపారు. గుడివాడలో మరీదు కృష్ణమూర్తి, నూజివీడులో లాకా వెంగళరావు యాదవ్, పెనుగంచిప్రోలులో ఊట్ల నాగేశ్వరరావు చేపట్టిన దీక్షలు మూడోరోజుకు చేరాయి. పెడనలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వాకా వాసుదేవరావు, వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర అడ్‌హక్ కమిటీ సభ్యులు గూడవల్లి వెంకట కేదారేశ్వరరావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరింది.
నగరంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వంగవీటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక దీక్షలు రెండో రోజుకు చేరాయి. ఈ దీక్షా శిబిరంలో తంగిరాల రామిరెడ్డి, గురివిందపల్లి జయరాజు, వై. శివకాశిరెడ్డి, పెనుమాక రవి కూర్చున్నారు. ఈ దీక్షా శిబిరాన్ని వైఎస్సార్‌సీపీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ సందర్శించారు. పెనుగంచిప్రోలులో వేల్పుల పద్మకుమారి చేపట్టిన దీక్షలు రెండోరోజుకు చేరాయి. గుడివాడలో మరీదు కృష్ణమూర్తి చేస్తున్న ఆమరణ దీక్షకు మద్దతుగా 10 మంది ముస్లిం సోదరులు రిలే నిరశన చేశారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ రైతువిభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రారంభించారు.
నందివాడ మండలంలో మూడోరోజు రిలేదీక్షలో తొమ్మిదిమంది పాల్గొన్నారు. పామర్రులో మహిళలు ర్యాలీ చేశారు. నందిగామ గాంధీ సెంటర్‌లో దీక్షలు చేస్తున్న కుక్కల సత్యనారాయణ ప్రసాద్, నెలకుర్తి సత్యనారాయణ, నాదెండ్ల రాజన్, మార్కపూడి ప్రసాదరావు, షేక్ ఇస్మాయిల్, షేక్ ఖాజాపీరా, విశ్వనాథపల్లి కృపారావు, మొండితోక నారాయణరావు, వంకాయలపాటి సుధాకర్‌లకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. జగ్గయ్యపేటలో పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కూడలి వద్ద పలు వినూత్న నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు పురంధరేశ్వరీ, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మీ, చిరంజీవి, కావూరి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, జేడీ శీలం, కిషోర్‌చంద్రదేవ్‌ల మాస్క్‌లను పలువురు మహిళలు ధరించగా... మీరెందుకు రాజీనామా చేయరంటూ ఆందోళనకారులు కొరడాలతో కొడుతుండగా వారు వద్దని దండాలు పెడుతున్నట్లు ప్రదర్శించారు.
మహిళలు రోడ్డుపై రింగ్, వాలీబాల్ తదితర ఆటలాడంతోపాటు భిక్షాటన చేసి తమ నిరసన తెలిపారు. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జగన్‌కు మద్దతుగా జరుగుతున్న రిలే దీక్షలు ఐదో రోజుకు చేరాయి. సింగరాయపాలెంలో పార్టీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు, పార్టీ మండల కన్వీనర్ నిమ్మగడ్డ భిక్షాలు ఆధ్వర్యంలో జగన్‌కు మద్దతుగా ర్యాలీ జరిగింది. జగన్ యూత్ అధ్వర్యంలో పుల్లూరు గ్రామం నుంచి బైక్ ర్యాలీగా యువకులు మైలవరం చేరుకుని ఆమరణదీక్ష చేస్తున్నవారికి మద్దతు తెలిపారు.
మైలవరంలో బైక్ ర్యాలీ..
మైలవరంలో జోగి రమేష్ అధ్వర్యంలో 150 బైక్‌లతో సుమారు 300మంది పైగా కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. జ్యేష్ఠ రమేష్‌బాబు ఆధ్వర్యంలోనూ మైలవరంలో నిరసన ప్రదర్శన జరిగింది. హనుమాన్‌జంక్షన్‌లో పార్టీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. నందిగామలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మొండితోక జగన్మోహనరావు నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు. నూజివీడులో నిర్వహిస్తున్న నిరాహారదీక్షలు మూడో రోజుకు చేరాయి. ఈ దీక్షలను పార్టీ సమన్వయకర్త మేకా ప్రతాప అప్పారావు ప్రారంభించారు. నగరంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు నిర్వహించారు.